ఓజీ సినిమా టికెట్ ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను తెలంగాణ హైకోర్టు బుధవారం సస్పెండ్ చేసింది. ఈ మేరకు జస్టిస్ ఎన్. వి. శ్రవణ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 25న ప్రపంచ వ్యాప్తంగా ఓజీ సినిమా విడుదల కానుంది. ఈ నెల 24న రాత్రి ఓజీ సినిమా ప్రీమియర్ షో కు కూడా ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది. ఈ నెల 25 నుంచి అక్టోబర్ 8 వరకు టికెట్ ధరల పెంచుకొనేందుకు ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది. సింగిల్ స్క్రీన్ కు జీఎస్టీతో కలిపితే రూ. 100 , మల్టీప్లెక్స్ లో జీఎస్టీతో కలిపి రూ. 150 పెంచుకొనేందుకు ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది. ఇక ఈ నెల 24 న రాత్రి ప్రీమియర్ షో కు జీఎస్టీతో కలిపి రూ. 800 గా నిర్ణయించింది. పుష్ప 2 సినిమా రిలీజ్ సమయంలో సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట సమయంలో టికెట్ల పెంపు ఉండదని, ప్రీమియర్ షో లకు అనుమతి ఉండదని తెలిపింది. కానీ, ఈ ఘటన జరిగిన గేమ్ ఛేంజర్ సినిమాకు టికెట్ల ధరల పెంపునకు బెనిఫిట్ షో కు అప్పట్లో ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. గేమ్ ఛేంజర్ సినిమా టికెట్ల పెంపు, బెనిఫిట్ షోల విషయంలో అప్పట్లో జి. భరత్ రాజ్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై విచారించిన హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బెనిఫిట్ షో లకు అనుమతి లేదని తెలిపిన ప్రభుత్వం స్పెషల్ షోలకు అనుమతి ఇవ్వడాన్ని ప్రశ్నించింది. స్పెషల్ షో లకు అనుమతి ఇవ్వడమంటే బెనిఫిట్ షోలకు అనుమతించడంలాంటిదేనని హైకోర్టు అప్పట్లో వ్యాఖ్యానించింది. సమయానికి నిద్ర పోవడం కూడా ముఖ్యమేనని హైకోర్టు అభిప్రాయపడింది. ప్రేక్షకుల భద్రతను దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోవాలని సూచించింది.