Pavithra Jayaram | రోడ్డు ప్రమాదంలో విషాదం.. త్రినయని పవిత్ర దుర్మరణం

సీరియల్ నటి పవిత్ర జయరాం ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు.

  • By: Somu |    cinema |    Published on : May 12, 2024 6:36 PM IST
Pavithra Jayaram | రోడ్డు ప్రమాదంలో విషాదం.. త్రినయని పవిత్ర దుర్మరణం

విధాత, హైదరాబాద్ : సీరియల్ నటి పవిత్ర జయరాం ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. పవిత్ర జయరాం ప్రయాణిస్తున్న కారు తెలంగాణలోని మహబూబ్‍నగర్‌ జిల్లా భూత్పూర్ పరిధిలోని శేరిపల్లి వద్ద డివైడర్‌ను తాకి ఆర్టీసీ బస్సును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న పవిత్ర జయరాం తీవ్రంగా గాయపడగా, చికిత్స నిమిత్తం మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లుగా వైద్యులు తెలిపారు.

కారులో పవిత్ర చెల్లెలి కూతురు ఆపేక్ష, డ్రైవర్ శ్రీకాంత్, తోటి నటుడు చంద్రకాంత్‌కు గాయాలయ్యాయి. మూడు రోజుల క్రితం సీరియల్ షూటింగ్ కోసం బెంగుళూరు వెళ్లిన పవిత్ర అదివారం తెల్లవారుజామున హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమైన క్రమంలో కారు ప్రమాదంలో మృతి చెందారు. త్రినయని, నిన్నే పెళ్లాడుతా సీరియల్స్ ద్వారా పవిత్ర నటిగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు.

కర్ణాటకలోని మండ్యా ప్రాంతానికి చెందిన పవిత్ర జయరాం కన్నడ టీవీ ఇండస్ట్రీ ద్వారా ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ‘జోకలి’ సీరియల్‍తో ఆమె నటనా జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత ‘రోబో ఫ్యామిలీ’, ‘గాలిపటా’, ‘రాధారామన్’, ‘విద్యా వినాయక’ సహా కన్నడలో పలు సీరియళ్లు చేశారు. తెలుగులో ‘త్రినయని’ ఆమెకు మంచి పేరు తీసుకొచ్చింది. ఇందులో తిలోత్తమగా ప్రతినాయక ఛాయలున్న పాత్రలో తనదైన నటన ప్రదర్శించారు.

పవిత్ర మృతితో కన్నడ, తెలుగు టీవీ పరిశ్రమల్లో విషాదం నెలకొంది. ఆమె మృతిపై విచారం వ్యక్తం చేస్తూ తోటి నటీనటులు సామాజిక మాధ్యమాల వేదికగా పోస్టులు పెడుతున్నారు. పవిత్ర  మృతిపై జీ తెలుగు విచారం వ్యక్తం చేసింది. త్రినయని సీరియల్‌లో తిలోత్తమగా పవిత్ర స్థానంలో ఇంకెవరినీ ఊహించుకోలేమంది. పవిత్రా జయరాం మరణం జీ తెలుగు కుటుంబానికి తీరని లోటు’’ అని ఎక్స్‌ వేదికగా పోస్టులో తమ సంతాపాన్ని వ్యక్తపరిచింది.