Vijay Sethupathi | ‘అతడు’ నాకు పెద్ద రిలీఫ్​

విజయ్​ సేతుపతి ‌‌– తెలుగు సినీ ప్రియులకు బాగా తెలిసిన పేరు. ఈ మధ్య కొన్ని తెలుగు సినిమాలలో మరపురాని పాత్రలు పోషించారు. తమిళంలోనైతే చెప్పే పనే లేదు. ఓటీటీల పుణ్యమా అని సేతుపతి నట విశ్వరూపం చూసే భాగ్యం తెలుగు ప్రేక్షకులకు కూడా కలిగింది.

Vijay Sethupathi | ‘అతడు’ నాకు పెద్ద రిలీఫ్​

మక్కల్​ సెల్వన్​(Makkal Selvan)గా తమిళ ప్రేక్షకులు ఆరాధించే నటుడు విజయ గురునాథ సేతుపతి కాలిముత్తు అలియాస్​ విజయ్​ సేతుపతి(Vijay Sethupathi). ఈ మధ్య విడుదలైన మహారాజ(Maharaja) చిత్రంలో అద్భుతమైన నటన ప్రదర్శించిన విజయ్​, దేశం మొత్తం దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. దుబాయ్​లో చిన్న అకౌంటెంట్​గా పనిచేస్తున్న విజయ్​, సినిమాల మీద ఉన్న విపరీతమైన ఆసక్తితో మద్రాస్​కు తిరిగివచ్చాడు. మొదట చిన్నాచితక పాత్రలు చేసిన సేతుపతి, సుందరపాండ్యన్(Sundarapandyan)​, పిజ్జా(Pizza) సినిమాలతో అమాంతం వెలుగులోకి వచ్చాడు. ఆ తర్వాత కథ మనక్కూడా తెలిసిందే. 96, పేట, విక్రమ్​, మాస్టర్​, జవాన్​, ఉప్పెన, సైరా నరసింహారెడ్డి నుండి మొన్నటి మహారాజ వరకు తన నట విశ్వరూపాన్ని చూపించాయి. విక్రమ్(Vikram)​లోనైతే కమల్​హాసన్​(Kamal Haasan)తో నటనలో సమఉజ్జీగా నిలిచాడు.

నటుడిగా నిలదొక్కుకునేంతవరకు కూడా విజయ్​ సేతుపతి చాలా కష్టాలననుభవించాడు. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు కుంగుబాటు(Depression)కు లోనయ్యే విజయ్​ సేతుపతి, తన డిప్రెషన్​కు​ మందేంటో చెప్పాడు. అదేంటో తెలుసా? తెలుగు సూపర్​స్టార్​ మహేశ్​బాబు నటించిన ‘అతడు’(Mahesh Babu’s ATHADU) సినిమా.

2005లో విడుదలైన అతడు తెలుగు క్లాసిక్​ యాక్షన్​ సినిమాగా పేరుగాంచింది. థియేటర్లలో బ్లాక్​బస్టర్​ కానప్పటికీ, టీవీల్లో మాత్రం ఇప్పటికీ దుమ్మురేపుతునేఉంటుంది. త్రివిక్రమ్​ శ్రీనివాస్​(Director Trivikram Srinivas) దర్శకత్వం వహించిన ఈ సినిమాతో ఆయన పేరు మారుమోగిపోయింది. అప్పటిదాకా రచయితగానే ఉన్న త్రివిక్రమ్​ ఒక్కసారిగా టాప్​ దర్శకులలో ఒకడిగా మారిపోయాడు. అద్భుతమైన కథనం, సరిగ్గా కుదిరిన పాత్రలు, అవసరానికి మించని మాటలు, వినసొంపైన పాటలలో అతడు తెలుగు సినిమాలో ఓ చరిత్ర సృష్టించింది. ఇప్పుడు వేల కోట్లు వసూలు చేస్తున్న సినిమాలకంటే వందల రెట్లు గొప్ప సినిమా. మహేశ్​బాబును పూర్తిస్థాయి కమర్షియల్​ హీరోగా మార్చేసిన చిత్రమిది.

ఇక విజయ్​ సేతుపతి ఈ మధ్య ఒక ఇంటర్వ్యూ(In an Interview)లో మాట్లాడుతూ, తను ఎదగడానికి ప్రయత్నిస్తూ, కష్టపడుతున్న రోజుల్లో తనకు స్ఫూర్తి(Inspiration)నిచ్చిన సినిమా అతడు అని చెప్పారు. ఆ సినిమా టైటిల్స్​ దగ్గర్నుంచీ ఎండ్​ కార్డ్​ దాకా ప్రతీ సీన్​ విపరీతంగా నచ్చిందని, బ్రహ్మానందం హాస్య సన్నివేశాలు ఎంతో బాగుంటాయని ప్రశంసించారు. త్రిష(Trisha krishnan)తో రొమాన్స్​, మహేశ్​బాబు(Mahesh Babu) స్క్రీన్​ ప్రజెన్స్​ , విలన్స్​ అందరూ, అన్నీ బాగా కుదరిన సినిమా అదని, అలా అన్నీ ఉండలేవని సేతుపతి కొనియాడారు. త్రివిక్రమ్​ కథను రాసుకున్న తీరు కంటే, దాన్ని తెరమీదకు తీసుకొచ్చిన విధానం అద్భుతంగా ఉందని చెప్పిన విజయ్​ సేతుపతి, ఇప్పటికే ఎన్నోసార్లు చూసినా కూడా ఇప్పుడు మళ్లీ చూస్తే కూడా కొత్తగా, అంతే ఎంజాయ్​ చేసేలా అతడు ఉంటుందని తెలిపారు.

తానే పెద్ద హీరో అయి ఉండీ, ఇంకో హీరో సినిమా గురించి ఇంత గొప్పగా మాట్లాడటం విజయ్​ సేతుపతికే సాధ్యమని నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు. అందులోనూ మహేశ్​ అభిమానులైతే ఇక చెప్పనవసరం లేదు.