Prajwal Revanna | లైంగిక అకృత్యాల కేసులో ప్రజ్వల్‌ రేవణ్ణను దోషిగా తేల్చిన కోర్టు.. శిక్షపై శనివారం ప్రకటన

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లైంగిక వేధింపులు, లైంగిక దాడుల కేసులో హసన్‌ మాజీ ఎంపీ, మాజీ ప్రధాని దేవెగౌడ మనుమడు ప్రజ్వల్‌ రేవణ్ణను ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు దోషిగా తేల్చింది. ఈ మేరకు స్పెషల్‌ కోర్టు జడ్జి సంతోష్‌ గజానన్‌ భట్ శుక్రవారం తీర్పు వెలువరించారు.

  • By: TAAZ    crime    Aug 01, 2025 7:05 PM IST
Prajwal Revanna | లైంగిక అకృత్యాల కేసులో ప్రజ్వల్‌ రేవణ్ణను దోషిగా తేల్చిన కోర్టు.. శిక్షపై శనివారం ప్రకటన

Prajwal Revanna | దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లైంగిక వేధింపులు, లైంగిక దాడుల కేసులో హసన్‌ మాజీ ఎంపీ, మాజీ ప్రధాని దేవెగౌడ మనుమడు ప్రజ్వల్‌ రేవణ్ణను ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు దోషిగా తేల్చింది. ఈ మేరకు స్పెషల్‌ కోర్టు జడ్జి సంతోష్‌ గజానన్‌ భట్ శుక్రవారం తీర్పు వెలువరించారు. అతనికి విధించబోయే శిక్షను శనివారం ఖరారు చేయనున్నారు. హసన్‌లోని రేవణ్ణ కుటుంబానికి చెందిన గన్నికాడ గెస్ట్‌హౌస్‌లో పనిమనిషిగా చేస్తున్న ఒక 48 ఏళ్ల మహిళ ఫిర్యాదు మేరకు ప్రజ్వల్‌పై కేసు నమోదైంది. ఈమెపై లైంగిక దాడిని ప్రజ్వల్‌ తన మొబైల్‌ ఫోన్‌లో కూడా చిత్రీకరించాడు.

ఈ ఫిర్యాదుపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేశారు. బాధితురాలిపై 2021లో రెండు సార్లు.. ఒకసారి రేవణ్ణకు చెందిన ఇంటిలో, మరోసారి బెంగళూరు నివాసంలో.. లైంగిక దాడి జరిగినట్టు ప్రాసిక్యూసన్‌ కేసు. ఈ కేసులో మొత్తం 118 మంది సాక్షులను కోర్టు విచారించింది. జూలై 18న విచారణ ముగిసింది. అనేక మంది మహిళలపై లైంగిక అకృత్యాలకు పాల్పడిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వెలుగుచూసిన నేపథ్యంలో రేవణ్ణపై మరో నాలుగు కేసులు నమోదయ్యాయి. ఏప్రిల్‌ 2023లో ప్రజ్వల్‌పై తొలి కేసు నమోదైంది.