Journalist Swecha Votarkar | యాంకర్ స్వేచ్ఛ మృతి వెనక ఎవరు..?

Journalist Swecha Votarkar | ప్రముఖ న్యూస్ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య పట్ల అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆమె తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. తమ కూతురు మానసికంగా కృంగిపోవడానికి, చివరికి ప్రాణాలు విడిచేందుకు పూర్ణచందర్ అనే వ్యక్తి కారణమని ఆరోపిస్తూ చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు. స్వేచ్ఛ (Journalist Swecha Votarkar ) ప్రముఖ టీవీ చానెల్స్ అన్నింటిలో పనిచేసినప్పటికీ, ప్రముఖ తెలంగాణవాదిగా ఉండేది. సోషల్ మీడియా వేదికగా తెలంగాణ వ్యతిరేకులను ఎండగడుతూ, చాలా సభల్లో కూడా మాట్లాడింది. మీడియా సర్కిల్లో విపరీతమైన అభిమానగణం ఉన్న స్వేచ్ఛ అనుమానాస్పద మరణం తీవ్ర చర్యకు దారి తీసింది.
ఫోన్, చాట్స్ పరిశీలనలో పోలీసులు
స్వేచ్ఛ మృతికి ముందుగా ఆమె ఎవరిదీ ఫోన్ కాల్, ఎవరితో చాట్ చేసిందనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. స్వేచ్ఛ మొబైల్‌ను స్వాధీనం చేసుకుని కాల్ డేటా, వాట్సాప్ చాట్స్ విశ్లేషిస్తున్నారు. ఇదిలా ఉండగా ఆరోపణలు ఎదుర్కొంటున్న పూర్ణచందర్(Poornachander) పరారీలో ఉన్నాడు. ఆయన్ను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు మూడు రంగంలోకి దిగాయి. పూర్ణచందర్ ఎవరు? పూర్ణచందర్ ఓ న్యూస్ ఛానెల్‌లో కల్చరల్ ప్రోగ్రామ్ ఇన్‌ఛార్జ్‌గా పని చేశాడు. బీఆర్‌ఎస్ మాజీ ఎంపీ సంతోష్(Joginapally Santoshkumar)కు పిఏగా వ్యవహరించేవాడని తెలిసింది. అలాగే ఖానాపూర్ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్(BRS Party) కార్యకలాపాల్లో కీలకంగా పాల్గొనేవాడన్న ఆరోపణలు వస్తున్నాయి. తాజా ఆరోపణల నేపథ్యంలో కేటీఆర్, కవితలతో పూర్ణచందర్ దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
“నా బిడ్డను మోసం చేశాడు” : స్వేచ్ఛ తండ్రి
“స్వేచ్ఛకు ఐదేళ్ల కిందట విడాకులయ్యాయి. తర్వాత పూర్ణచందర్ పరిచయం అయ్యాడు. తన భార్యతో విడిపోతానని, స్వేచ్ఛను పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాడు. నాలుగేళ్లుగా మా కూతుర్ని నమ్మబలికాడు. కానీ వాస్తవంగా ఏదీ జరగలేదు. చివరికి ప్రాణాలు తీసే స్థితికి తీసుకెళ్లాడు,” అంటూ బాధతో తెలిపారు ఆమె తండ్రి. ఆత్మహత్యకు ముందే స్వేచ్ఛ తన తండ్రికి ఫోన్ చేసి, “మీరు త్వరగా ఇంటికి రండి. మాట్లాడాలి,” అని చెప్పిన విషయం ఆయన గుర్తుచేశారు.
“ఇది మా అమ్మ చివరి హగ్” – స్వేచ్ఛ కూతురు కన్నీటి మాటలు
“స్కూల్‌కు వెళ్లే ముందు నన్ను హగ్ చేసి పంపింది. స్కూల్ నుంచి వచ్చినప్పుడు తాత వచ్చి తీసుకెళ్తాడని చెప్పింది. ఆ మాటలే మా అమ్మ చివరి మాటలు అయ్యాయి. ఇంటికి వచ్చేసరికి తలుపు లోపల నుంచి లాక్. వెనక నుంచి ఓపెన్ చేసి చూశాక షాక్ అయ్యాను. ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. నా తాతను పిలిచాను. మేము చూసేసరికి ఆమె ముఖం ఎర్రగా మారిపోయింది,” అంటూ స్వేచ్ఛ కూతురు కన్నీటి కళ్ళతో వివరించింది.
పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టిన పోలీసులు
తల్లిదండ్రుల ఫిర్యాదు ఆధారంగా పోలీసులు పూర్ణచందర్ పాత్రను పరిశీలిస్తున్నారు. ప్రేమ పేరుతో మోసం చేసి, ఆత్మహత్యకు ప్రేరేపించాడన్న కోణంలో కేసు నమోదు చేశారు. త్వరలోనే పూర్ణచందర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ జరపనున్నట్టు సమాచారం.