అయోధ్య: అయోధ్య రామాలయ ప్రాణప్రతిష్ఠ హోరులో అనేక వాస్తవాలు మరుగునపడిపోతున్నాయి. అటువంటిదే బాబా లాల్ దాస్ హత్యోదంతం. అయోధ్య వివాదాస్పద బాబ్రీ మసీదులోని మధ్య గుమ్మటంలోని రామజన్మభూమి ఆలయానికి ఆయన గతంలో ప్రధాన పూజారిగా ఉన్నారు. 1981లో ఆయనను కోర్టు నియమించింది. రామజన్మభూమి ఉద్యమాన్ని ఘర్షణపూరిత రాజకీయాలకు, హిందువుల ఓట్లు రాబట్టేందుకు సాధనంగా వాడుకోరాదని ఆయన మొదటి వాదించేవారు. అయితే.. బాబ్రీ మసీదు కూల్చివేసిన కొన్నాళ్లకు ఆయన హత్యకు గురయ్యారు. 1993 నవంబర్ 16న బాబా లాల్‌దాస్‌ను గుర్తు తెలియని దుండగులు అయోధ్యకు 20 కిలోమీటర్ల దూరంలోని తన స్వగ్రామం రాణిపూర్ ఛత్తార్‌లో అర్ధరాత్రిపూట కాల్చి చంపారు. లాల్ దాస్.. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, విశ్వహిందూ పరిషత్‌ను తీవ్రంగా వ్యతిరేకించేవారు. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో ప్రత్యక్ష సాక్షిగా, ఫజియాబాద్, అయోధ్యల్లో శాంతికాముకుడిగా ఉన్న లాల్ దాస్ హత్య వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని చాలా మంది విశ్వసిస్తారు. కానీ.. సీబీఐ దర్యాప్తు మాత్రం భూమి వివాదంలో ఆయన హత్యకు గురయ్యారంటూ కేసు మూసేసింది.
వీహెచ్‌పీ ప్రధాన అడ్డంకుల్లో లాల్ దాస్ ఒకరు!
లాల్‌దాస్ వామపక్ష భావజాలంతో ఉండేవారు. బాబ్రీ మసీదులో భగత్‌సింగ్ ఫొటోను కూడా ఉంచేవారని ఆయన గురించి తెలిసినవారు చెబుతున్నారు. 1984లో వీహెచ్‌పీ రామజన్మభూమి కార్యక్రమాన్ని ప్రారంభించిన మొదటి రోజు నుంచి ఆయన దానికి వ్యతిరేకంగా ఉన్నారు. 1991 జూన్‌లో బీజేపీ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 419 సీట్లకు గాను సగానికిపైగా గెలుచుకున్నది. బీజేపీ నేత కల్యాణ్‌సింగ్ ముఖ్యమంత్రి అయ్యారు. ‘వివాదాస్పద భూమిలో గొప్ప రామాలయాన్ని నిర్మించాలని సంకల్పించిన వీహెచ్‌పీ.. అందుకు కొన్ని అడ్డంకులను గుర్తించింది. అందులో వివాదాస్పద ప్రాంతంలోని ఆలయ ప్రధాన పూజారి లాల్‌దాస్ రెండో అడ్డంకిగా వీహెచ్‌పీ భావించింది. ఇక చివరి అడ్డంకి బాబ్రీమసీదే’ అని ఫజియాబాద్‌కు చెందిన సీనియర్ జర్నలిస్టు సుమన్ గుప్తా గుర్తు చేసుకున్నారు.
అర్చకత్వ బాధ్యతల నుంచి తప్పించిన కల్యాణ్‌సింగ్ సర్కార్
1992, డిసెంబర్ 6వ తేదీన అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేయడానికి కొన్ని నెలల ముందు అంటే 1992 మార్చిలో కల్యాణ్‌సింగ్ ప్రభుత్వం ప్రధాన అర్చకుడిగా లాల్ దాస్‌ను తొలగించింది. ఆయన స్థానంలో మహంత్ సత్యేంద్రదాస్‌ను రామజన్మభూమి ఆలయ ప్రధాన అర్చకుడిగా నియమించింది. లాల్ దాస్‌పై అవినీతి ఆరోపణలు ఉండటం, వివాదాస్పదుడు కావడంతోనే ఆయనను తొలగించినట్టు సుమన్ గుప్తా ఒక వెబ్‌సైట్‌కు టెలిఫోన్ ద్వారా తెలిపారు. తొలగింపు తర్వాత అయోధ్యతో ఆయనకు సంబంధం లేకుండా పోయిందన్నారు. ‘ఆయన ఎప్పుడో చనిపోయారు. మీరు ఇప్పుడు ఎందుకు ఆయన గురించి అడుగుతున్నారు?’ అని ఆయన ఎదురు ప్రశ్నించారు. తన తొలగింపును సవాలు చేస్తూ అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ ఎదుట ఆయన దాఖలు చేసిన పిటిషన్ పెండింగ్‌లోనే ఉండిపోయిందని ఆయన తెలిపారు.
శాంతిసామరస్యాలు బోధించిన లాల్ దాస్
అవధ్ ప్రాంతంలోని గంగా జెమునా తెహజీబ్ సంస్కృతిలో మమేకమైన లాల్‌దాస్.. రామ జన్మభూమి ఉద్యమం కేవలం రాజకీయ ఘర్షణల కోసం, హిందూ ఓట్లు సంపాదించుకునేలా సెంటిమెంట్లను రగిల్చేందుకే ఉద్దేశించారని విమర్శిస్తూ ఉండేవారని సుమన్ గుప్తా తెలిపారు. అవధ్ ముస్లిం పాలకుల సహకారంతో అయోధ్యలో ఎన్ని ఆలయాలు నిర్మించారో, 1855లో చెలరేగిన భయంకర మారణకాండ అనంతరం హిందూ, ముస్లిం మత పెద్దలు శాంతి సామరస్యాలతో జీవించేలా సమస్యను ఎలా పరిష్కరించుకున్నారో ఆయన తరచూ చెబుతూ ఉండేవారని పేర్కొన్నారు. రామజన్మభూమి, బాబ్రీ మసీదు అంశాన్ని స్థానికంగానే పరిష్కరించుకోవాలని, దీనిని జాతీయ స్థాయిలో రాజకీయ అంశం చేయరాదని గట్టిగా వాదించేవారు.
‘బాబా లాల్ దాష్ విప్లవకారుడైన సాధువు. రామాలయ అంశాన్ని రాజకీయంగా వాడుకునేవారిపై నిప్పులు చెరిగేవారు’ అని వీహెచ్‌పీ మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి అయోధ్యలోని పురాతన సరయూ కుంజ్ దేవాలయ మహంత్ యుగళ్ కిశోర్ శాస్త్రి చెప్పారు. లాల్ దాస్ వామపక్ష భావజాలంతో ఉండేవారని, బాబ్రీ మసీదు మధ్య గుమ్మటంలోని ఆలయంలో భగత్‌సింగ్ ఫొటో ఉంచేవాడని శాస్త్రి తెలిపారు. అద్వానీ రథయాత్ర ప్రారంభించినప్పుడు దానిని నిరసిస్తూ అయోధ్యలో మీడియా సమావేశాన్ని కూడా లాల్ దాస్ ఏర్పాటు చేశారని ఆయన పేర్కొన్నారు. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో ప్రత్యక్ష సాక్షిగా ఉండటమే కాకుండా కూల్చివేతను బహిరంగంగా ఖండించారని గతంలో సీబీఐ ఎస్పీగా వ్యవహరించిన రిటైర్డ్ అధికారి ఎం నారాయణన్ చెప్పారు.
హిందూ, ముస్లిం సామరస్యాన్ని కాపాడేందుకు కృషి
హిందూ ముస్లిం సామరస్యాన్ని కాపాడేందుకు లాల్ దాస్ చేసిన కృషి ఈ రోజు పాత తరానికి చెందిన హనుమాన్‌గఢి ఆలయ మహంత్ జ్ఞాన్‌దాస్ (ఈయన కూడా లౌకికవాది అయిన సాధువుగా పేరుగాంచారు) వంటి కొద్దివారికి తెలసునని చెప్పారు. ఇదే విషయంలో సదరు వెబ్‌సైట్ జ్ఞాన్‌దాస్‌ను సంప్రదించగా.. ఆయన మాట్లాడేందుకు నిరాకరించారు. అయితే.. ‘ఆయన హనుమాన్ గఢికి చెందినవారు. మంచి మనిషి. అయితే.. బాబ్రీ మసీదు కూల్చివేత అనంతరం ఆయన శత్రువులు ఆయనను హత్య చేశారు’ అని మాత్రం చెప్పారు.
అయోధ్యలో 1885 నాటి భీకర మత ఘర్షణల అనంతరం అక్కడ వందల ఏళ్లపాటు సామరస్య వాతావరణం నెలకొన్నది. అందుకు అక్కడి ముస్లిం, హిందూ మత పెద్దలు కృషి చేశారు. కానీ.. ఆ వాతావరణాన్ని దెబ్బతీస్తూ అయోధ్య ఉద్యమం ప్రారంభమైంది. అద్వానీ రథయాత్ర సాగిన అనేక ప్రాంతాల్లో ఆ సమయంలో చెలరేగిన మత ఘర్షణల్లో వేల మంది చనిపోయారు. అంతే సంఖ్యలో గాయపడ్డారు. కుటుంబాలను కోల్పోయి అనేక మంది అనాథలుగా మిగిలారు. వారందరి సాక్షిగా.. ఇప్పుడు అయోధ్యలో భారీ ఆలయం రూపుదిద్దుకున్నది. ఇక్కడ మత సామరస్యాన్ని కాంక్షించిన లాల్ దాస్ వంటివారు.. చరిత్ర పుటల్లో.. ఎక్కడికో కొట్టుకుపోయారు.
ఇకనైనా స్ఫర్థలు పోవాలి
ఏది ఏమైనా అయోధ్య ప్రజలు శాంతి కోరుకున్నారు. కోర్టు తీర్పుతో అది వారికి లభించింది. కోర్టు తీర్పు ఒకరి పట్ల వివక్ష ప్రదర్శించిందని ఉభయ పక్షాలూ అంగీకరిస్తున్నా.. ఇంతకు మించి పరిష్కారం లేదని కూడా చెబుతున్నారు. ఇకనైనా ఈ వివాదాన్ని శాశ్వతంగా సమాధి చేయాల్సిన అవసరం ఉన్నదని అంటున్నారు. సుదీర్ఘ చరిత్ర ఉన్న అయోధ్యలో లాల్ దాస్ జీవితం కొద్దిపాటిదే అయినా.. మత సామరస్యానికి, ఉభయ మతాల మధ్య అన్యోన్యతకు లాల్ దాస్ ఇచ్చిన సందేశం అయోధ్యకే కాదు.. యావత్ దేశానికి స్ఫూర్తినిచ్చేది.