Chervugattu temple | మాస్టర్ ప్లాన్‌తో నార్కెట్‌పల్లి చెర్వుగట్టు అభివృద్ధి

Chervugattu temple | నల్గొండ జిల్లాలోని నార్కెట్ పల్లి మండలంలో ఉన్న చెర్వుగట్టు శ్రీ జడల రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని మాస్టర్ ప్లాన్ ప్రకారం అభివృద్ధి చేస్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజా రామయ్యర్ తెలిపారు. సోమవారం ఆమె చెర్వుగట్టు శ్రీ జడల రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవాలయ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ ఎస్.వెంకట్రావు, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం, ఇతర అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. రాబోయే 20-30సంవత్సరాలను దృష్టిలో ఉంచుకొని రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తే బాగుంటుందనే విషయంపై చర్చించారు.
ఈఓ పోస్ట్ గ్రేడ్ పెంచడం, దేవాలయానికి ప్రతి సంవత్సరం వచ్చే ఆదాయాన్ని, ఖర్చులను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఇకపై చేపట్టే అన్ని పనులు మాస్టర్ ప్లాన్ ప్రకారమే చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ప్రస్తుతం చేపట్టిన అన్ని రకాల అస్తవ్యస్త నిర్మాణాలనుంటిని వెంటనే నిలిపివేయాలని, మాస్టర్ ప్లాన్ ప్రకారం నిర్మాణాలు చేపట్టాలని శైలజా రామయ్యర్ ఆదేశించారు. భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించాలన్నారు. శాస్త్రీయ పద్ధతిలో క్యూలైన్ల నిర్మాణం చేపట్టాలని, వాహన మండపం, గోశాల, ప్రస్తుతం ఉన్న నడకదారికి మరమ్మతు, సీసీ కెమెరాల పెంచడం, హరిత హోటల్ నిర్మాణం, దేవాలయ భూమికి సంబంధించి భూ సేకరణ పూర్తి చేయాలన్నారు. చెరువు, కోనేరు అభివృద్ధికి అధ్యయనం చేసి ప్రణాళిక రూపొందించాలని అధికారులకు ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ రామయ్యర్ ఆదేశాలిచ్చారు.