Black Pepper | రూపాయి కూడా మిగలట్లేదా..? మిరియాలతో డబ్బు సంపాదించండి ఇలా..!
Black Pepper | చాలా మంది డబ్బు( Money ) సంపాదించాలనే లక్ష్యంతో రాత్రింబవళ్లు కష్టపడుతుంటారు. కానీ వారి చేతిలో రూపాయి కూడా మిగలదు. దీంతో వారు మానసికంగా కుంగిపోతుంటారు. అలాంటి వారు కొన్ని పరిహారాలు చేస్తే తప్పకుండా ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతారు.

Black Pepper | జీవించడంతో పాటు కుటుంబాన్ని పోషించేందుకు డబ్బు( Money ) చాలా అవసరం. దీంతో డబ్బు సంపాదించేందుకు చాలా కష్టపడుతుంటారు. కానీ చివరకు నీళ్లలా డబ్బు ఖర్చు అవుతుంటుంది. అలాంటి వారు తీవ్ర మనోవేదనకు గురవుతుంటారు. ఎంత కష్టపడ్డ ఆర్థికంగా స్థిరపడలేకపోతున్నానని, అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయని లోలోపల మదనపడుతుంటారు. ఇలా ఆర్థిక సమస్యలతో బాధపడేవారు.. కొన్ని పరిహారాలు చేస్తే అద్భుతమైన ఫలితాలు పొందొచ్చని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఆ పరిహారం ఏంటో తెలుసుకుందాం.
మిరియాల దీపం..
మిరియాలు.. ఈ పేరు తెలియని వారు ఉండరు. జలుబు, జ్వరం వచ్చినప్పుడు మిరియాలను ఔషధంగా వినియోగిస్తుంటాం. మిరియాలతో కూడిన పదార్థాలను తినడానికి ఆసక్తి చూపిస్తుంటారు. అదే విధంగా ఆధ్యాత్మికంలో కూడా మిరియాలకు అంతే ప్రాధాన్యత ఉంది. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మిరియాలతో దీపం వెలిగిస్తే విశేషమైన ఫలితాలు లభిస్తాయని చెబుతున్నారు. ఈ దీపాన్ని ఎవరైతే వెలిగిస్తారో ఆ ఇంట్లో ఎలాంటి దిష్టి దోషాలు, శత్రుబాధలూ ఉండవంటున్నారు జ్యోతిష్యులు. అలాగే ఆకస్మిక ధనలాభం కలుగుతుందట. అనేక మార్గాల్లో డబ్బు చేతికి అందుతుందని చెబుతున్నారు. మరి మిరియాల దీపానికి అంతటి శక్తి ఉంటుందట.
ఈ దీపం ఎలా వెలిగించాలంటే?
శనివారం సూర్యాస్తమయ సమయంలో ఒక మట్టి ప్రమిదలో ఇంకో ప్రమిద ఉంచి ఆవాల నూనె పోయాలి. తర్వాత మూడు వత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. ఆపై ఆ దీపంలో 9 నల్ల మిరియాలు వేయాలి. అప్పుడు అది మిరియాల దీపం అవుతుందంటున్నారు.
ఈ దీపం వెలిగించాక దాన్ని చేతిలో పట్టుకొని, ఇష్టదేవతను మనసులో స్మరించుకుంటూ ఇంట్లో ఉన్న అన్ని గదుల్లో తిరగాలి. ఇలా చేయడం ద్వారా ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీ మొత్తాన్ని ఆ దీపం లాక్కుంటుంది. అలాగే, ఇంటిపై దిష్టి దోషం, ధనపరంగా నెగెటివ్ ఎనర్జీ ఉన్నా అవీ పోయి ధన ఆదాయం పెరిగేలా ఆ దీపం దోహదం చేస్తుందట.
ఇల్లు మొత్తం తిరిగాక ఏదో ఒక మూల ఆ దీపాన్ని పెట్టేయాలి. శనివారం ఆ దీపం కొండెక్కాక మర్నాడు ఆదివారం స్నానం చేసి అందులో ఉన్న తొమ్మిది నల్ల మిరియాలను తీసి ఎవరూ తొక్కని చోట చెట్టు మొదట్లో వేయాలి. లేదా ఒక ప్లేట్లో కర్పూరంతో కలిపి ఆ నల్ల మిరియాలను కాల్చేయాలి. ఈ శక్తివంతమైన పరిహారం చేస్తే వారికి జీవితంలో తిరుగుండదంటున్నారు. అన్ని రకాలుగా ధనాకర్షణ పెరగడంతో పాటు దుష్టశక్తుల పీడ నుంచి విముక్తి లభిస్తుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.