Kali Bari | సాధారణంగా గుడికి వెళ్తే లడ్డూ, పులిహోరను నైవేద్యంగా సమర్పిస్తుంటారు. కానీ నూడిల్స్, మోమోస్‌తో పాటు పిజ్జా, పాస్తాను నైవేద్యం పెట్టడం గురించి ఎప్పుడైనా విన్నారా! పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో చైనా టౌన్‌గా ప్రసిద్ధి చెందిన టాంగ్రా ప్రాంతంలో ఉన్న చైనీస్ కాళీ మందిర్‌లో ఈ ప్రత్యేకమైన ఆచారం కొనసాగుతోంది.
ఆలయానికి 80 ఏళ్ల చరిత్ర
టాంగ్రాలోని చైనీస్ కాళీ బరి ఆలయానికి 80 ఏళ్లకు పైబడిన చరిత్ర ఉంది. స్థానిక కథనాల ప్రకారం.. ఒక చైనా బాలుడు అప్పట్లో తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. ఎన్ని ఆస్పత్రుల చుట్టూ తిరిగినా లాభం లేకుండా పోయింది. చివరకు ఆశలు వదిలేసుకోవాలని డాక్టర్లు సూచించారు. ఏం చేయాలో తెలియని స్థితిలో ఆ బాలుడి తల్లిదండ్రులు టాంగ్రాలోని ఒక చెట్టు కింద ఉన్న రెండు నల్ల రాళ్ల వద్ద ప్రార్థనలు చేశారు. అయితే ఆ రాళ్లను స్థానిక హిందువులు కాళీ మాత రూపంగా భావించేవారు.
చైనా తల్లిదండ్రులు కొద్ది రోజుల పాటు భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు చేయడంతో బాలుడు కోలుకున్నాడు. అప్పట్నుంచి ఆ కుటుంబం అక్కడే నిత్య పూజలు చేయడం మొదలుపెట్టింది. తర్వాత అక్కడే ఉండే చైనీస్ కమ్యూనిటీ సభ్యులతో కలిసి వారే ఒక ఆలయాన్ని నిర్మించారు. అప్పటి నుంచి ఈ ఆలయం అన్ని వర్గాల ప్రజలకు ఆధ్యాత్మిక కేంద్రంగా మారింది.
నూడిల్స్ ప్రసాదం వెనుక అసలు కారణం!
టాంగ్రాలోని నిర్మించిన ఈ కాళీమాత ఆలయానికి చైనీస్ కమ్యూనిటీకి చెందిన వారు ఎక్కువగా వచ్చేవారు. ఆ సమయంలో తమకు తెలిసిన ఆహారాన్నే సమర్పించారు. భక్తి ముఖ్యం.. రూపం కాదనే భావనతో స్థానికులు కూడా ఈ ఆచారానికి సపోర్టు ఇచ్చారు. అలా కాలక్రమేణా నూడిల్స్ (చౌమిన్) ఈ ఆలయంలో ప్రధాన ప్రసాదంగా మారిపోయింది. ఇక కొంతమంది భక్తులు మోమోస్, పిజ్జా, సూప్‌లను కూడా నైవేద్యంగా సమర్పించి, వాటినే ప్రసాదంలా పంచుతారు.
సంస్కృతుల సమ్మేళం..
దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ ఆలయం ఇప్పుడు సంస్కృతుల కలయికకు చిహ్నంగా మారింది. ఈ ఆలయ నిర్వాహకుల్లో పలువురు చైనా వంశానికి చెందిన వారు కూడా ఉన్నారు. వారిని వారు చైనా హిందువులు అని చెప్పుకోవడం గమనార్హం. కాగా, ఈ ఆలయాన్ని చైనీస్ కమ్యూనిటీ నిర్మించినప్పటికీ.. ప్రసాదంగా నూడిల్స్, పిజ్జాలు పంచినప్పటికీ పూజా విధానం మాత్రం పూర్తిగా హిందూ సంప్రదాయం ప్రకారమే జరుగుతుంది. పూజారులు మంత్రోచ్ఛరణలతో, హారతులతో నిత్యం ధూపదీప నైవేద్యం సమర్పిస్తారు.
పర్యాటకులకు ఆకర్షణగా కాళీబరి
ఈ వింత ఆచారం గురించి తెలిసిన పర్యాటకులు చాలామంది కోల్‌కతాలోని టాంగ్రాకు వచ్చి కాళీమాతను దర్శించుకుంటున్నారు. అనంతరం సమీపంలోని చౌనా టౌన్ వీధుల్లో లభించే ఇండో – చైనీస్ వంటకాలను రుచిచూస్తున్నారు.
Read More:
Lemon | ఆ 9 నిమ్మకాయలతో సంతానం, వివాహప్రాప్తి.. వేలంలో రూ.1.43 లక్షలకు దక్కించుకున్న భక్తులు
