- బాసర టూ భద్రాచలం సర్క్యూట్ అభివృద్ధికి ప్రత్యేక నిధుల కేటాయింపు
- ఒక్కో అడుగేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
- పుష్కరాల సందర్భంగా ప్రాధాన్యం
- కొనసాగుతున్న రాజన్న గుడి అభివృద్ధి
- భద్రాచలంలో పనులకు భూమి పూజ
- బాసర ఆలయాభివృద్ధి పనులు ప్రారంభం
- పర్యాటకుల ఆకర్షణ, స్థానికంగా ఉపాధి
విధాత, ప్రత్యేక ప్రతినిధి:
తెలంగాణలో టెంపుల్ టూరిజం అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కేంద్రీకరించింది. ఈ మేరకు ప్రాధాన్యం కలిగిన దేవాలయాల అభివృద్ధికి తగిన నిధులు కేటాయిస్తోంది. పనులను పట్టాలెక్కించి ప్రగతిపథంలో సాగేలా ప్రణాళికను అమలు చేస్తోంది. ఎంతో ప్రాచీన, ప్రాశస్త్యం ఉన్న పురాతన దేవాలయాలకు తెలంగాణ ఆలవాలంగా ఉన్పప్పటికీ పర్యాటకులను ఆకర్షించడంలో ఉన్న లోపాలను సరిదిద్దేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. ఈ దిశగా వ్యూహాత్మకంగా అడుగేస్తోంది.
తొలి దశలో గోదావరి తీర ఆలయాలు
తొలిదశలో గోదావరి నది పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రాచీన దేవాలయాల పై దృష్టి పెట్టారు. ఈ దేవాలయాకు వచ్చే భక్తుల సంఖ్యను పెంచడమే కాకుండా పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. పర్యాటకులను ఆకర్షించడం ద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాలు పెంపొందించే దిశగా ఈ యాక్షన్ ప్లాన్ తయారైంది. 2027 జూన్, జులైలో నెలల్లో రానున్న గోదావరి పుష్కరాల నాటికి ఈ టెంపుల్ సర్క్యూట్‌కు ప్రాథమిక రూపం వచ్చే విధంగా పనులు చేస్తున్నారు. పుష్కరాల పనులను కూడా రెండు విభాగాలుగా తాత్కాలిక పనులు, శాశ్వత పనులుగా విభజించి టెంపుల్ సర్క్యూట్‌ను పురోగామి దిశగా సాగించాలని యోచిస్తున్నారు. ఈ మధ్యలో చేపట్టే ఈ దేవాలయ, జాతర, ఉత్సవాలను ఈ కార్యాచరణ ప్రణాళికకు లింకు చేస్తూ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ అమలు చేస్తున్నారు.
బాసర నుంచి భద్రాచలం వరకు
గోదావరి నది తెలంగాణలోకి ప్రవేశించిన తర్వాత ఉన్న తొలి ముఖ్యమైన పుణ్యక్షేత్రం బాసర. ఇక్కడి నుంచి ఈ నదీ పరివాహక ప్రాంతంలోని భద్రాచలం వరకు టెంపుల్ సర్క్యూట్ ఏర్పాటు చేయనున్నారు. బాసర మొదలుకుని, ధర్మపురి, వేములవాడ, కాళేశ్వరం, రామప్ప, మేడారం, మల్లూరు, భద్రాచలం దేవాలయాల అభివృద్ధి ప్రణాళికతో పాటు గోదావరి పుష్కరాల ఏర్పాట్లు ఇందులో ఉన్నాయి.
వేములవాడ రాజన్న
వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి గత ప్రభుత్వంలోనే ప్రతిపాదించారు. కానీ.. పూర్తిస్థాయిలో పట్టించుకోలేదు. శ్రీ రాజ రాజేశ్వర స్వామి ఆలయం, పట్టణం అభివృద్ధి కోసం ముందుగా రూ. 127.65 కోట్లవిలువైన అభివృద్ధి ప్యాకేజీని ఆమోదించి అమలు చేస్తోంది. నవంబర్ 2024లో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ.126 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఇందులో రూ.76 కోట్లు ప్రధాన ఆలయ సముదాయాన్ని విస్తరించడానికి, యాత్రికులకు ఆధునిక సౌకర్యాలు కల్పించడానికి వినియోగిస్తున్నారు. రూ. 47.85 కోట్లు ఆలయాన్ని మూలవాగు వంతెనకు కలిపే రహదారిని వెడల్పు చేయడానికి భూసేకరణ కోసం రూ. 47.85 కోట్లు, రూ. 3.8 కోట్లు: పట్టణ మురుగునీటిని మళ్లించే ప్రధాన డ్రైనేజీ పైప్‌లైన్ నిర్మాణానికి, ఆలయంలో కొత్త అన్నదాన సత్రం కోసం ప్రభుత్వం రూ. 35.25 కోట్లు మంజూరు చేసింది. మొత్తంగా రూ. 150 కోట్ల మేరకు నిధులు కేటాయించి వేములవాడ టెంపుల్ డెవలప్ మెంట్ అథారిటీ (VTDA)ని ఏర్పాటు చేశారు.
మేడారం, రామప్ప శాశ్వత అభివృద్ధి
ఇటీవల ముగిసిన మేడారం జాతరను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఇప్పటికే శాశ్వత నిర్మాణ పనులు చేపట్టింది. రూ. 250 కోట్ల నిధులతో సమ్మక్క, సారలమ్మ గద్దెల ప్రాంగణాన్ని రాతితో నిర్మించారు. ఆకర్షణీయమైన ద్వారాలు, శిల్పాలు, బొమ్మలతో సమ్మక్క, సారలమ్మల పూర్వీకులు ఆదివాసీ కోయజాతి చరిత్రను పునర్లిఖించేందుకు ప్రయత్నించారు. మేడారంలో రోడ్ల విస్తరణ, మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇచ్చారు. జాతర సందర్భంగా ఆదరాబాదరాగా పనులు చేపట్టారు. మిగిలిన పనులను పూర్తి చేసి వాటి నాణ్యాతాప్రమాణాలను పెంచేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉంది. కొంత కాలంగా ఏడాది పొడువునా మేడారానికి భక్తుల రాక పెరిగింది. అయితే ఇక్కడికి వెళ్ళేందుకు రవాణా వసతి సౌకర్యాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. మేడారం వచ్చే భక్తులకు శాశ్వత నీటి వసతి కల్పించేందుకు ప్రత్యేకంగా గోదావరి జలాలను తరలించేందకు రూ.140 కోట్ల వ్యయంతో రామప్ప, జంపన్నవాగు పనులు చేపట్టేందుకు నిర్ణయించారు. సర్క్యూట్లో రామప్ప, కోటగుళ్ళు, లక్నవరం టెంపుల్ సర్క్యూట్‌లో యునెస్కో గుర్తింపుపొందిన రామప్ప దేవాలయాన్ని చేర్చారు. ఇప్పటికే ఈ దేవాలయ పరిసరాల్లో అభివృద్ధి పనులు చేపడుతూ, మౌలిక వసతులు కల్పిస్తున్నారు. రామప్ప సరస్సులో ఐలాండ్ నిర్మిస్తున్నారు. అత్యంత ఆకర్షణీయమైన ఈ దేవాలయ శిల్ప సంపద పర్యాటకులను విశేషంగా ఆకర్షించనుంది. ఇక్కడ మరి కొన్ని మౌలిక వసతులు కల్పించాల్సి ఉంది. అదే విధంగా కాకతీయ శిల్పకళకు ప్రతీక నిలిచే కోటగుళ్ళు కూడా ఇందులో భాగంగా మారనున్నది. మధ్యలో లక్నవరం అందాలు పర్యాటకులకు అదనపు ఆనందాన్ని అందించనున్నది. ఈ క్రమంలోనే మంగపేటలోని అతిప్రాచీన మల్లూరు లక్ష్మీనర్సింహస్వామి దేవాలయాన్ని కూడా అభివృద్ధి చేస్తున్నారు. దీనికి కూడా ఇటీవల దేవాదాయ శాఖ నుంచి నిధులు కేటాయించారు. ఈ ప్రాంతాలకు తోడు ములుగు జిల్లాలోని అటవీ ప్రాంత ఇటీవల అభివృద్ధి చేసిన బ్లాక్బెర్రీ ఐలాండ్, నైట్ విజన్ తదితర పర్యాటక ప్రదేశాలు మరింత ఆకర్షనగా నిలుస్తాయి.
భద్రాచలం అభివృద్ధికి నిధులు
భద్రాచలాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి పరిచేందుకు దశలవారీ పనులు చేపట్టేందుకు నిర్ణయించారు. రూ. 550 కోట్ల నిధులు ఖర్చు చేసే విధంగా ప్రణాళిక రూపొందించారు. ఈ క్రమంలో మొదటి దశలో పనులకు శ్రీరామ నవమి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ చేశారు. శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయ విస్తరణ కోసం తొలిదశ ₹351 కోట్లతో అభివృద్ధి పనులలో రూ.180 కోట్లతో ఆలయ విస్తరణ, మౌలిక సదుపాయాల కల్పన, రూ.96 కోట్లతో ఆలయ పరిసరాల అభివృద్ధి, రూ.75 కోట్లతో గోదావరి ఘాట్ అభివృద్ధి వంటి పనులు చేపట్టన్నారు. భద్రాచలం రూపురేఖలు మార్చే విధంగా ప్రణాళిక రూపొందించారు. ఇది అమలైతే భద్రాచలం భక్తులను, పర్యాటకులు విశేషంగా ఆకట్టుకుంటోందని భావిస్తున్నారు.
బాసరలో మాస్టర్ ప్లాన్
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్ జిల్లా గోదావరి నది ఒడ్డున ఉన్న బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయం అభివృద్ధి కోసం రూపొందించిన మాస్టర్ ప్లాన్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే పరిశీలించారు. భక్తుల విశ్వాసాలను గౌరవిస్తూ, ఆగమ శాస్త్రం ప్రకారం ఆలయ అభివృద్ధి జరగాలని చెప్పారు. ఆలయాన్ని ప్రభుత్వం రూ. 225 కోట్లతో అభివృద్ధి చేసేందుకు నిర్ణయించారు. తాజాగా సోమవారం ఈ ఆలయ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సువిశాలమైన రోడ్లు ఉండేలా చర్యలు తీసుకోవాలనిఇప్పటికే నిర్ణయించారు. భక్తుల విశ్వాసాలు దెబ్బతినకుండా ఆలయ అభివృద్ధి అద్భుతంగా ఉండేవిధంగా, ఆలయ పవిత్రతకు భంగం కలగకుండా నిబంధనలు కఠినతరం చేయాలని నిర్ణయించారు. తిరుమల తిరుపతి తరహాలో అన్ని ఆలయాల పరిసరాల్లో ఎలాంటి రాజకీయ కార్యకలాపాలకు తావు లేకుండా నిబంధనలు ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆలయ పరిసరాల్లో ఈవీ వాహనాలను మాత్రమే వినియోగించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు.
గోదావరి పుష్కరాల సందర్భంగా వసతి
2027 జూన్‌లో 26 నుంచి జూలై 7వ తేది వరకు 12 జరగబోయే గోదావరి పుష్కరాల నిర్వహణ నాటికి టెంపుల్ సర్క్యూట్ కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని నిర్ణయించారు. పుష్కరాల కోసం బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి పరీవాహక ప్రాంతంలోని ఆలయాలు, పుష్కరఘాట్లను అభివృద్ధి చేయనున్నారు. ఈ పుష్కరాలకు 10లక్షల మంది భక్తులు హాజరవుతారని అంచనా. పుష్కరాల కోసం శాశ్వత, తాత్కాలిక పనులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేసేలా ప్రణాళికలు ఉండాలని CM సూచించారు. ప్రధాన దేవాలయాలు, పర్యాటక ప్రదేశాల్లో ఘాట్ల నిర్మాణం, విస్తరణ చేపట్టేలా చర్యలు తీసుకోనున్నారు. ఆయా ప్రాంతాలను సందర్శించే భక్తులు, పర్యాటకులకు ఇబ్బందులు రాకుండా ప్రాంతాల మధ్య కనెక్టివిటీ సరిగా ఉండేలా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. పుష్కరాల ఏర్పాట్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 500 కోట్ల నిధులు కేటాయించారు. జిల్లాకు రూ. 50 కోట్ల చొప్పున కేటాయించినట్లు చెబుతున్నారు. ఇదిలా ఉండగా తాజాగా మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో భాగంగా మూసీ తీరం గండిపేట – మంచిరేవులలోని చారిత్రక వీరభద్రస్వామి ప్రాంగణంలో శ్రీ మచిలేశ్వర స్వామి, శ్రీ ఓంకారేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి భూమిపూజ నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో గోవు పూజ నిర్వహించి గోశాలను ప్రారంభించారు. 1400 ఏండ్ల చరిత్ర కలిగిన ఈ పురాతన ఆలయాన్ని 8 ఎకరాల్లో దాదాపు రూ. 700 కోట్ల వ్యయంతో పునర్నిర్మాణం, అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఇప్పటికే యాదగిరి గుట్ట లక్ష్మీనర్సింహాస్వామి దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది.
Read Also
బాసర సరస్వతి ఆలయ అభివృద్ది పనులకు సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ
Viral Marriage | 68 కోట్ల కట్నం ఇచ్చి.. పాతికేళ్ల కుర్రాడిని పెళ్లి చేసుకున్న 55 ఏళ్ల మహిళా వ్యాపారవేత్త
Harish Rao allegation| కాంగ్రెస్ సర్కార్ లో రూ.7,000 కోట్ల భారీ భూ స్కామ్ : హరీశ్ రావు
ఓటుకు నోటు దొంగ రేవంత్ రెడ్డి : కేరళం సీఎం పినరయి స్ట్రాంగ్ కౌంటర్
