Vijayawada Durga Temple | ఇంద్రకీలాద్రిపై ‘ఉగాది’ బ్రహ్మోత్సవాలు.. 22న దుర్గా మల్లేశ్వరుల కల్యాణ మహోత్సవం..
Vijayawada Durga Temple | ఏపీలోని ప్రముఖ క్షేత్రాల్లో ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మ ఆలయం ఒకటి. ఉగాది పర్వదినం సందర్భంగా ఆలయంలో బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ నెల 9 నుంచి 27 వరకు ఉత్సవాలు జరుగనున్నాయి. ఉగాది వసంత నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా 9వ తేదీ నుంచి 18 వరకు ప్రత్యేక పుష్పార్చనలు జరుగనున్నాయి. 19 నుంచి దుర్గ మల్లేశ్వరస్వామి చైత్రమాసం కల్యాణ బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఉత్సవాల్లో భాగంగా దుర్గామల్లేశ్వరస్వామి వార్ల కల్యాణం కనుల పండువగా జరుగనున్నది. 24న పూర్ణాహుతితో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. 19వ తేదిన వెండి పల్లకీ సేవ, 20న రావణ వాహన సేవ, 21న వెండి రథోత్సవం, 22న నంది వాహన సేవ, 23న సింహ వాహన సేవపై ఆది దంపతులు విహరిస్తూ భక్తులను కటాక్షించనున్నారు.
ఈ నెల 9న క్రోధి నామ సంవత్సరం సందర్భంగా ఉగాది సందర్భంగా మహోత్సవాలు ప్రారంభమవుతాయని ఆలయ అధికారులు తెలిపారు. 9 నుంచి 18 తేదీ వరకు ప్రత్యేక పుష్పార్చన కార్యక్రమాలు జరుగుతాయని.. వేడుకలకు హాజరయ్యే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. 9న ఉగాది సందర్భంగా మధ్యాహ్నం 3గంటలకు పంచగ శ్రవణం ఉంటుందని తెలిపారు. 24న ఉదయం పది గంటలకు పూర్ణాహుతి, సాయంత్రం గంగా పార్వతి సమేత మల్లేశ్వర స్వామి వార్లకు పవిత్ర కృష్ణానదిలో తెప్పోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే ఈ నెల 9 నుంచి 27 వరకు పుష్పార్చన కొనసాగుతుందని చెప్పారు. ఈ నెల 22 న రాత్రి 10.30 గంటలకు దుర్గా మల్లేశ్వర దివ్య కల్యాణమహోత్సవం జరుగనున్నది.
బ్రహ్మోత్సవాల్లో దుర్గమ్మకు ఒక్కో రోజు వివిధ పూలతో ప్రత్యేకంగా అర్చన చేయనున్నారు. 9న అమ్మవారికి మల్లెపూలు, మరువముతో అమ్మవారికి ప్రత్యేక పుష్పార్చన చేస్తారు. 10న కనకాంబరాలు, గులాబీలతో ప్రత్యేక పూజలు జరుగుతాయి. 11 న చామంతి, ఏప్రిల్ 12న మందార పుష్పాలు, ఎర్ర కలువ పూలతో అర్చన ఉంటుంది. 13న తెల్లజిల్లేడు, మారేడు, తులసి, మరువము, ధవళంతో అర్చన చేస్తారు. 14న కాగడా మల్లెలు, జూజులు, మరువముతో.. 15న ఎర్ర తామర పుష్పాలు, ఎర్ర గన్నేరు, సన్నజాజులతో పుష్పార్చన వేడుకగా జరుగుతుంది. 16న చామంతి, సంపంగి పుష్పాలతో ప్రత్యేక పూజలు జరుగుతాయి. 17న కనకాంబరాలు, గులాబీలతో.. 18న కనకాంబరాలతో పాటు వివిధ రకాల పూజలతో ప్రత్యేక పూజాధికాలు కొనసాగుతున్నాయి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram