Srisailam : శ్రీశైలంలో శివదీక్ష భక్తుల నిరసన

శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భారీ రద్దీ. స్పర్శ దర్శనం ఆలస్యంపై శివదీక్ష భక్తుల నిరసన, క్యూలైన్లు విరగొట్టిన ఘటన ఉద్రిక్తతకు దారి.

Reported by: Tejaswini Nanna | ఆంధ్ర ప్రదేశ్ | Feb 09, 2026, 12:38 pm IST
Read Time: 5 mins
Srisailam : శ్రీశైలంలో శివదీక్ష భక్తుల నిరసన

అమరావతి : శ్రీశైలంలో మహాశివరాత్రి నేపథ్యంలో కొనసాగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలకు తరలివస్తున్న శివ భక్తులకు అవసరమైన ఏర్పాట్ల కల్పనలో అధికారం యంత్రాంగం విఫలమైందంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సోమవారం స్పర్శ దర్శనానికి ఆలస్యమవుతోందని శివదీక్ష భక్తులు నిరసనకు దిగారు. ఈవో, చైర్మన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఆగ్రహంతో శివదీక్ష భక్తులు కృష్ణదేవరాయ క్యూలైన్లు విరగ్గొట్టి ఆలయంలోకి చొచ్చుకెళ్లారు.
కృష్ణదేవరాయ గోపురం నుంచి, పుష్కరణి వైపు నుంచి వందలాదిగా దూసుకొస్తున్న శివదీక్ష భక్తులను నియంత్రించడంలో సిబ్బందికి సాధ్యం కాలేదు. జ్యోతిర్ముడి కలిగిన శివదీక్ష భక్తులకు ఈ నెల 12 వరకు మల్లికార్జున స్వామి స్పర్శ దర్శనం కల్పిస్తారు. అటు శ్రీశైల క్షేత్రానికి భారీగా భక్తులు భారీగా కాలినడకన వస్తున్నారు. మరోవైపు బ్రహ్మోత్సవాల సందర్బంగా పెరిగిన రద్దీతో వాహనాల సంఖ్య పెరిగి పలు చోట్ల ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయి. ఏకంగా ముగ్గురు మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, వంగలపూడి అనిత, బీసీ జనార్దన్‌రెడ్డిలు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై దేవదాయ శాఖ, జిల్లా అధికారులతో సమీక్షలు చేసి..మార్గదర్శకత్వం చేసిన భక్తుల రద్దీ క్రమబద్దీకరణలో విఫలమవ్వడం విమర్శలకు గురవుతుంది.

భక్తులకు ఇబ్బంది లేకుండా చర్యలు

బ్రహ్మోత్సవాల సందర్బంగా ఫిబ్రవరి 13 నుండి భక్తులందరికీ శ్రీస్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతించనున్నట్లుగా ఆలయ చైర్మన్‌ రమేష్‌, ఈవో శ్రీనివాసరావు వివరించారు. ఈనెల 18 వరకు కొనసాగే ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. అక్కడక్కడా ఎదురైన సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈసారి సుమారు 10లక్షలకు పైగా భక్తులు వస్తారన్న అంచనాతో దేవస్థానం యంత్రాంగం ఏర్పాట్లు చేసిందని వివరించారు. భక్తుల కోసం అదనపు క్యూలైన్లు, మొబైల్ టాయిలెట్స్ ఏర్పాట్లు చేశారమని, క్యూలైన్లలో మంచినీరు, అల్పాహారం, బిస్కెట్లు పంపిణీ చేస్తున్నారని తెలిపారు. 15న మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని సాయంత్రం 5 గంటలకు శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామివార్లకు ప్రభోత్సవం, రాత్రి 10 గంటల నుంచి లింగోద్భవకాల మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పాగాలంకరణ, రాత్రి 12 గంటలకు కల్యాణం జరుగనుందని, 16న రాత్రి 8 గంటలకు శ్రీస్వామిఅమ్మవార్లకు ఆలయ పుష్కరిణిలో తెప్పోత్సవం జరుగనుందని, 18న రాత్రి 8.30 గంటలకు పుష్పోత్సవం, శయనోత్సవం, ఏకాంత సేవ జరుగనుంది అని తెలిపారు.

ఇవి కూడా చదవండి :

Sai Dhansika | నా వాళ్లపై చేయి వేసినా ఊరుకోను .. ఆకతాయిల‌కి ఝ‌ల‌క్ ఇచ్చిన క‌బాలి న‌టి
Disha Patani | గ్లామర్‌తో చంపకే పిల్లా.. ట్రెడిషనల్ డ్రెస్ లో అదిరిపోయే లుక్‌లో దిశా పటాని