Dhurandhar 2 | దేశవ్యాప్తంగా సంచలన విజయాన్ని సాధించిన ధురంధర్ 2 సినిమా ఇప్పుడు మరో కారణంతో చర్చల్లో నిలుస్తోంది. స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తూ ఇప్పటికే దాదాపు రూ.1500 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఫుల్ రన్‌లో రూ.2000 కోట్ల మార్క్‌ను ఈజీగా చేరుకుంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
దర్శకుడు ఆదిత్య ధర్ రూపొందించిన ఈ చిత్రంలో రణ్‌వీర్ సింగ్ భారత గూఢచారి పాత్రలో కనిపించడం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా పాకిస్తాన్‌లో భారత స్పై ఏజెంట్లు ఎలా పనిచేస్తారనే అంశాన్ని మరింత ఘాటుగా చూపించడం సినిమాకు హైలైట్‌గా నిలిచింది.
ఇండియన్ స్పై ఏజెంట్స్ కోసం గాలింపు..
అయితే ఈ సినిమా ప్రభావం నిజ జీవితంలో కూడా కనిపిస్తోందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ‘ధురంధర్ 2’ విడుదల తర్వాత పాకిస్తాన్‌లో ఇండియన్ స్పై ఏజెంట్ల కోసం ఆ దేశ భద్రతా సంస్థలు గాలింపు చర్యలను పెంచినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి.
అయితే విచిత్రంగా, ఇప్పటివరకు ఒక్క భారత గూఢచారినీ పట్టుకోలేకపోయినా, స్థానికులనే స్పై అనుమానంతో విచారణకు గురిచేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇళ్లులేని వారు, బిచ్చగాళ్లు టార్గెట్ అవుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
టార్గెట్ అవుతున్న బిచ్చగాళ్లు..
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని వీడియోల్లో పాకిస్తాన్ భద్రతా సిబ్బంది రోడ్లపై నిద్రిస్తున్న వారిని ప్రశ్నిస్తూ, గన్‌లతో బెదిరిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. స్పై ఏజెంట్లు సాధారణ వ్యక్తుల వేషాల్లో ఉంటారనే అనుమానంతో ఈ చర్యలు తీసుకుంటున్నారని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే, గతంలో కూడా భారత గూఢచారులు పాకిస్తాన్‌లో పనిచేసిన ఘటనలు ఉన్నాయని పలువురు గుర్తుచేస్తున్నారు. ముఖ్యంగా అజిత్ దోవల్ ఒకప్పుడు పాకిస్తాన్‌లో అండర్‌కవర్‌గా పనిచేశారనే విషయం తరచుగా ప్రస్తావనకు వస్తోంది.
అయితే ప్రస్తుతం జరుగుతున్న ప్రచారంపై అధికారికంగా ఎలాంటి ధృవీకరణ లేకపోయినా, ఈ అంశం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. ‘ధురంధర్ 2’ సినిమా ప్రభావంతో పాకిస్తాన్‌లో పరిస్థితులు మారిపోయాయా? లేదా ఇది కేవలం అతిశయోక్తి మాత్రమేనా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
