Janhvi Kapoor | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ విడుదలకు సిద్ధమవుతోంది. గ్రామీణ క్రీడల నేపథ్యంలో రూపొందిన ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్‌ను చిత్రబృందం జోరుగా నిర్వహిస్తోంది.

ఈ నేపథ్యంలో విజయవాడలో ‘పెద్ది’ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకకు హీరో రామ్ చరణ్‌తో పాటు హీరోయిన్ జాన్వీ కపూర్, నటుడు జగపతి బాబు, దివ్యేందు శర్మ, సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, నిర్మాతలు మరియు చిత్ర యూనిట్ సభ్యులు హాజరయ్యారు. వేలాదిగా తరలివచ్చిన అభిమానుల సందడితో ఈ కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది.

తెలుగులో మాట్లాడి అభిమానులను మెప్పించిన జాన్వీ

ఈ వేడుకలో మాట్లాడిన జాన్వీ కపూర్, తెలుగులో స్పీచ్ ఇచ్చి అందరినీ ఆకట్టుకుంది. ప్రేక్షకులు, అభిమానులు చూపిస్తున్న ప్రేమ తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తోందని చెప్పిన ఆమె, ‘పెద్ది’ సినిమా చూసిన తర్వాత కూడా ఇదే ప్రేమతో ప్రేక్షకులు థియేటర్ల నుంచి బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేసింది.

“మీరు మాపై చూపిస్తున్న ప్రేమ మాకు ప్రతిరోజూ కష్టపడి పని చేయడానికి ప్రేరణ ఇస్తుంది. మేము చేసే ప్రతి పని మిమ్మల్ని అలరించడానికే. ‘పెద్ది’ ఒక ప్రత్యేకమైన సినిమా. మన జీవితానికి అర్థం ఏమిటి? మన ఐడెంటిటీ ఏంటి? అనే ప్రశ్నలకు సమాధానం చెప్పే కథ ఇది” అని జాన్వీ పేర్కొంది.

‘నా జీవితానికి అర్థం సినిమాలే’

తన వ్యక్తిగత జీవితంపై కూడా జాన్వీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. “నా జీవితానికి అర్థం సినిమాలు చేయడం, ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడం. నా గుర్తింపు కూడా ఈ నేలతో, మీ అందరితో బలంగా ముడిపడి ఉంది. మీరు నాపై చూపించే ప్రేమకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఈ సినిమాతో మీరు గర్వపడేలా చేస్తానని నమ్ముతున్నాను” అని చెప్పింది.

రామ్ చరణ్‌పై ప్రశంసల వర్షం

‘పెద్ది’ తనకు సినిమా విడుదలకు ముందే చాలా ఇచ్చిందని జాన్వీ తెలిపింది. ముఖ్యంగా రామ్ చరణ్‌తో కలిసి పనిచేసే అవకాశం దక్కడం తన అదృష్టమని పేర్కొంది.

“రామ్ సార్ ఒక జెమ్. ఆయన అద్భుతమైన నటుడు. బుచ్చిబాబు సర్ నాకు తెలిసిన అత్యంత ప్యాషనేట్ దర్శకుల్లో ఒకరు. రత్నవేలు గారు నా ఫేవరెట్ సినిమాటోగ్రాఫర్. ఏఆర్ రెహమాన్ గారు ఒక లెజెండ్. నిర్మాత సతీష్ గారు ఈ మొత్తం ప్రయాణాన్ని ఎంతో అద్భుతంగా మార్చారు. ఈ టీమ్ మొత్తం సినిమాకు తమ బెస్ట్ ఇచ్చింది” అంటూ చిత్రబృందంపై ప్రశంసలు కురిపించింది.

‘ఈసారి నన్ను ఇంకా ఎక్కువసేపు చూస్తారు’

ఈ సినిమాలో తన పాత్ర గురించి కూడా జాన్వీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. “ఈసారి ప్రేక్షకులు నన్ను తెరపై మరింత ఎక్కువసేపు చూస్తారు. మేమంతా ఎంతో ప్రేమతో, అంకితభావంతో ఈ సినిమా చేశాం. మీరు థియేటర్లకు వచ్చి మా కష్టాన్ని ఆదరిస్తే అదే మా విజయానికి నిజమైన గుర్తింపు” అని చెప్పింది.

‘మానవా మానవా’ డైలాగ్‌తో నవ్వులు

కార్యక్రమంలో మరో సరదా సంఘటన కూడా చోటుచేసుకుంది. యాంకర్ సుమ కనకాల అభ్యర్థన మేరకు, చిరంజీవి–శ్రీదేవి నటించిన క్లాసిక్ చిత్రం ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’లోని ప్రసిద్ధ ‘మానవా మానవా’ డైలాగ్‌ను చెప్పాలని జాన్వీని కోరారు. వెంటనే జాన్వీ తనదైన స్టైల్‌లో ఆ డైలాగ్ చెప్పడంతో సభలో నవ్వులు, చప్పట్లు మార్మోగాయి.