Meena | రూ.100 కోట్లకు మీనా ఇల్లు అమ్మేసిందా? .. అంత క‌ష్టం ఏమోచ్చింది..!

Meena | ఒకప్పుడు దక్షిణాది చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయికగా వెలుగొందిన నటి మీనా గురించి ఇటీవలి రోజుల్లో సోషల్ మీడియాలో పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా చెన్నైలోని ఆమె విలాసవంతమైన ఇంటిని రూ.100 కోట్లకు విక్రయించిందన్న ప్రచారం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

  • By: Sandeep |    movies |    Published on : Apr 24, 2026 4:08 PM IST
Meena | రూ.100 కోట్లకు మీనా ఇల్లు అమ్మేసిందా? .. అంత క‌ష్టం ఏమోచ్చింది..!

Meena | ఒకప్పుడు దక్షిణాది చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయికగా వెలుగొందిన నటి మీనా గురించి ఇటీవలి రోజుల్లో సోషల్ మీడియాలో పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా చెన్నైలోని ఆమె విలాసవంతమైన ఇంటిని రూ.100 కోట్లకు విక్రయించిందన్న ప్రచారం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

ప్యాలెస్‌ను తలపించే ఇల్లు

చెన్నై సైదాపేట శ్రీరామ్ కాలనీలో ఉన్న మీనా బంగ్లా ప్రత్యేకతతో నిలుస్తుంది. దాదాపు 20 ఏళ్ల క్రితం ఎంతో ఇష్టంతో నిర్మించుకున్న ఈ ఇల్లు కేరళ సంప్రదాయ శైలిలో రాజభవనాన్ని తలపించేలా ఉంటుంది. అరుదైన కలపతో నిర్మించిన ఈ ఇంటికి అప్పట్లోనే సుమారు రూ.10 కోట్లు ఖర్చయిందని సమాచారం.

రూ.100 కోట్లకు అమ్మిందన్న ప్రచారం

ఇటీవల ఈ ఇంటిని రూ.100 కోట్లకు ఒక విదేశీ దంపతులకు అమ్మేసిందన్న వార్తలు వేగంగా వ్యాపించాయి. రూ.10 కోట్లతో నిర్మించిన ఇల్లు ఇప్పుడు పదింతల ధరకు అమ్ముడైందన్న ఊహాగానాలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. అమెరికాకు చెందిన ఓ ఎన్ఆర్ఐ జంట ఈ బంగ్లాను కొనుగోలు చేసిందని కూడా ప్రచారం జరిగింది.

“అది కేవలం పుకారు మాత్రమే”

అయితే ఈ వార్తలపై మీనా సన్నిహితులు స్పందించి పూర్తి స్పష్టత ఇచ్చారు. మీనా ఇల్లు అమ్మిందన్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని వారు ఖండించారు. ఆ ఇల్లు మీనాకు కేవలం ఒక భవనం మాత్రమే కాదు, ఆమె జీవితానికి చెందిన అనేక భావోద్వేగాలను మోసుకెళ్తున్న స్థలం అని పేర్కొన్నారు.

ఆ ఇంటితో మీనాకు ప్రత్యేక అనుబంధం

మీనా భర్త సాగర్ అదే ఇంట్లో తుదిశ్వాస విడిచారు. అలాగే ఆమె కుమార్తె నైనిక కూడా అదే ఇంట్లో పుట్టి పెరిగింది. ఈ నేపథ్యంలో ఆ ఇంటితో మీనాకు ఎంతో బలమైన అనుబంధం ఉందని, అలాంటి సెంటిమెంట్ ఉన్న ఇంటిని అమ్మే ఆలోచనే లేదని ఆమె సన్నిహితులు స్పష్టం చేశారు.

సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ జోరు

తెలుగులో “చంటి”, “సుందరకాండ”, “సూర్యవంశం”, “ముఠా మేస్త్రి”, “బొబ్బిలి సింహం”, “అల్లరి అల్లుడు”, “సీతారామయ్య గారి మనవరాలు” వంటి అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించిన మీనా, ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించారు. పెళ్లి తర్వాత కొంత విరామం తీసుకున్న ఆమె, “దృశ్యం” సిరీస్‌తో మళ్లీ తన నటనతో ఆకట్టుకున్నారు. “దృశ్యం 2”లోనూ ఆమె నటనకు మంచి ప్రశంసలు లభించాయి. ప్రస్తుతం “దృశ్యం 3”తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్న మీనా, సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ తన సత్తా చాటుతున్నారు.