Ram Charan | గ్లోబల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌నటించిన భారీ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకుపోతోంది. దర్శకుడు బుచ్చిబాబు స‌న‌ తెరకెక్కించిన ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా విడుదలైన తొలి షో నుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా రామ్ చరణ్ నటనకు ప్రేక్షకులు, సినీ విమర్శకుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

సినిమాలో చరణ్ పోషించిన పాత్రకు ప్రేక్షకులు పూర్తిగా కనెక్ట్ అవుతున్నారు. ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో వచ్చే భావోద్వేగ సన్నివేశాలు, క్లైమాక్స్‌లో ఆయన ప్రదర్శించిన నటన ప్రేక్షకులను కంటతడి పెట్టించే స్థాయిలో ఉందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ‘పెద్ది’లో చరణ్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

అజ్ఞాతంలోకి చ‌ర‌ణ్‌..

అయితే సినిమా సక్సెస్‌ను ఆస్వాదించాల్సిన సమయంలో రామ్ చరణ్ కనిపించకపోవడం అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. విడుదలకు ముందు వరకు ప్రమోషన్స్‌లో చురుకుగా పాల్గొన్న చరణ్.. సినిమా రిలీజ్‌కు ఒక రోజు ముందు నుంచి ఎక్కడా కనిపించలేదు. ప్రీమియర్ షోలు, థియేటర్ సందర్శనలు, సక్సెస్ మీట్ వంటి కార్యక్రమాల్లో కూడా ఆయన గైర్హాజరవడంతో పలు ఊహాగానాలు మొదలయ్యాయి.

వాస్తవానికి ‘పెద్ది’ షూటింగ్ సమయంలో చరణ్‌కు గాయాలైన విషయం తెలిసిందే. సినిమాలో కీలకమైన కుస్తీ పోటీల సన్నివేశాల చిత్రీకరణ సమయంలో ఆయన మణికట్టుకు తీవ్ర గాయం అయినట్లు సమాచారం. గాయం అయినప్పటికీ షూటింగ్‌కు అంతరాయం కలగకుండా ఫిజియోథెరపీ సహాయంతో ఆయన చిత్రీకరణను కొనసాగించినట్లు తెలుస్తోంది.

చ‌ర‌ణ్ అంకింత‌భావం అలా..

ప్రమోషన్ల సమయంలో కూడా చరణ్ చేతికి మణికట్టు వద్ద ప్రత్యేకమైన మెడికల్ సపోర్ట్ బ్యాండ్ కనిపించింది. ఆ సమయంలోనే తన గాయం గురించి ఆయన స్వయంగా ప్రస్తావిస్తూ, వైద్యులు శస్త్రచికిత్స అవసరమని సూచించారని వెల్లడించారు. అయితే సినిమా పనులు, ప్రమోషన్స్ దృష్ట్యా వెంటనే ఆపరేషన్ చేయించుకోకుండా వాయిదా వేసుకున్నట్లు తెలిపారు.

“ఇప్పుడు ఆపరేషన్ చేయించుకుంటే కొన్ని వారాలు విశ్రాంతి తీసుకోవాల్సి వస్తుంది. సినిమా ప్రమోషన్స్ ఆగిపోకూడదు” అనే ఉద్దేశంతో విడుదల వరకు చికిత్సను వాయిదా వేసుకున్నట్లు అప్పట్లో చరణ్ చెప్పిన విషయం అభిమానులకు గుర్తుంది. దీంతో సినిమా కోసం ఆయన చూపించిన అంకితభావాన్ని అందరూ ప్రశంసించారు.

ఆప‌రేష‌న్ చేయించుకున్నాడా..

ఇప్పుడు సినిమా విడుదలైన తర్వాత చరణ్ కనిపించకపోవడంతో, ముందుగా చెప్పినట్టే మణికట్టుకు శస్త్రచికిత్స చేయించుకున్నారనే వార్తలు సినీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఆయన సన్నిహితుల సమాచారం ప్రకారం, ప్రముఖ ఆసుపత్రిలో మణికట్టు ఆపరేషన్ జరిగినట్లు, ప్రస్తుతం ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు.

ఇక చరణ్ గైర్హాజరులో కూడా ‘పెద్ది’ విజయోత్సాహం కొనసాగుతోంది. ఆయన సతీమణి ఉపాస‌న‌ సహా చిత్రబృందంలోని పలువురు సభ్యులు థియేటర్లలో సినిమా వీక్షించి ప్రేక్షకుల స్పందనను ఆస్వాదించారు. తాజాగా నిర్వహించిన సక్సెస్ ప్రెస్ మీట్‌లో కూడా చరణ్ కనిపించకపోవడం ఈ ప్రచారానికి మరింత బలం చేకూర్చింది.

ప్రస్తుతం అభిమానులందరూ చరణ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. పూర్తి ఆరోగ్యంతో తిరిగి అభిమానుల ముందుకు రావాలని సోషల్ మీడియాలో సందేశాలు పోస్ట్ చేస్తున్నారు. మరోవైపు, ఆయన కోలుకున్న తర్వాత ‘పెద్ది’ గ్రాండ్ సక్సెస్ మీట్ నిర్వహించే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు చెబుతున్నాయి.