SBI Clerk Exams 2021: 5,454 పోస్ట్‌ల భర్తీకి ఎస్‌బీఐ నోటిఫికేషన్‌

బ్యాంకింగ్‌ రంగంలో ఏ పోస్ట్‌లో కొలువుదీరినా ఉజ్వల భవిష్యత్తు ఖాయమనే అభిప్రాయం! ఒక్కసారి బ్యాంక్‌ ఉద్యోగంలో చేరితే ఇక వెనుదిరిగి చూసుకోనక్కర్లేదనే భావన! అందుకే దేశంలో కొన్ని లక్షల మంది బ్యాంక్‌ జాబ్‌ కోసం పరీక్షలకు ప్రిపేరవుతుంటారు! అలాంటి వారందరికీ ప్రభుత్వ రంగ బ్యాంకు.. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) తీపి కబురు చెప్పింది. క్లరికల్‌ కేడర్‌లో 5వేలకు పైగా జూనియర్‌ అసోసియేట్స్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో.. ఎస్‌బీఐ 2021 నోటిఫికేషన్‌ […]

SBI Clerk Exams 2021: 5,454 పోస్ట్‌ల భర్తీకి ఎస్‌బీఐ నోటిఫికేషన్‌

బ్యాంకింగ్‌ రంగంలో ఏ పోస్ట్‌లో కొలువుదీరినా ఉజ్వల భవిష్యత్తు ఖాయమనే అభిప్రాయం! ఒక్కసారి బ్యాంక్‌ ఉద్యోగంలో చేరితే ఇక వెనుదిరిగి చూసుకోనక్కర్లేదనే భావన! అందుకే దేశంలో కొన్ని లక్షల మంది బ్యాంక్‌ జాబ్‌ కోసం పరీక్షలకు ప్రిపేరవుతుంటారు! అలాంటి వారందరికీ ప్రభుత్వ రంగ బ్యాంకు.. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) తీపి కబురు చెప్పింది. క్లరికల్‌ కేడర్‌లో 5వేలకు పైగా జూనియర్‌ అసోసియేట్స్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో.. ఎస్‌బీఐ 2021 నోటిఫికేషన్‌ వివరాలు, ఎంపిక ప్రక్రియ, ప్రిపరేషన్‌ వ్యూహాలు తదితర అంశాలపై విశ్లేషణ..

మొత్తం 5,454 పోస్ట్‌లు
► ఎస్‌బీఐ జూనియర్‌ అసోసియేట్స్‌(కస్టమర్‌ సపోర్ట్‌ అండ్‌ సేల్స్‌)–2021 ఎంపిక ప్రక్రియ ద్వారా జాతీయ స్థాయిలో 5,454 పోస్ట్‌లను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. రెగ్యులర్‌ నియామకాల ద్వారా 5,000 పోస్ట్‌లను, బ్యాక్‌లాగ్‌ 454 ఖాళీలకు నియామకాలు చేపట్టనుంది. క్లరికల్‌ కేడర్‌లో ఈ పోస్టులను భర్తీ చేయనుంది.

► అర్హత: బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్ట్‌ 16, 2021లోపు ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.

► వయసు: ఏప్రిల్‌ 1, 2021 నాటికి 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. గరిష్ట వయో పరిమితిలో ఎస్‌సీ/ఎస్‌టీ కేటగిరీ అభ్యర్థులకు అయిదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల సడలింపు లభిస్తుంది.

హైదరాబాద్‌ సర్కిల్‌–275 పోస్టులు
మొత్తం పోస్ట్‌లలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్‌ సర్కిల్‌ పరిధిలో 275 పోస్ట్‌లు అందుబాటులో ఉన్నాయి. జనరల్‌ కేటగిరీలో 111, ఎస్‌సీ కేటగిరీలో 44, ఎస్‌టీ కేటగిరీలో 19, ఓబీసీ కేటగిరీలో 74, ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీలో 27 ఖాళీలను కేటాయించారు. హైదరాబాద్‌ సర్కిల్‌లో పరీక్ష రాయాలనుకునే వారు తెలుగు లేదా ఉర్దూ మీడియంలను పరీక్ష మాధ్యమాలుగా పేర్కొనాల్సి ఉంటుంది.

రెండు దశల్లో ఎంపిక ప్రక్రియ
ఎస్‌బీఐ జూనియర్‌ అసోసియేట్స్‌ ఎంపిక ప్రక్రియ రెండు దశల్లో రాత పరీక్షల విధానంలో జరుగుతుంది. అవి.. ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్‌ ఎగ్జామినేషన్‌. ముందుగా ప్రిలిమినరీలో ఉత్తీర్ణత సాధించిన వారికి తర్వాత దశలో మెయిన్‌ పరీక్ష నిర్వహిస్తారు. ప్రిలిమ్స్, మెయిన్‌ రెండూ ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటాయి. నెగిటివ్‌ మార్కుల విధానం ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్కుల కోత వేస్తారు. ఇంటర్వ్యూ ఉండదు.

తుది జాబితా ఇలా
ఎంపిక ప్రక్రియలో రెండు దశల(ప్రిలిమినరీ, మెయిన్‌) విధానాన్ని అనుసరిస్తున్నప్పటికీ.. నియామకం ఖరారు చేసే క్రమంలో మెయిన్‌లో చూపిన ప్రతిభనే పరిగణనలోకి తీసుకుంటారు. ప్రిలిమినరీలో నిర్ణీత కటాఫ్‌ మార్కులు పొందితేనే.. మెయిన్‌ పరీక్ష పేపర్‌ మూల్యాంకనం చేస్తారు. కాబట్టి అభ్యర్థులు ప్రిలిమినరీ నుంచే చక్కటి ప్రతిభ చూపేలా సన్నద్ధం కావాలి.

ఉమ్మడి ప్రిపరేషన్‌
రెండు దశల్లో నిర్వహించే ఎంపిక ప్రక్రియలో విజయం సాధించి.. తుది జాబితాలో నిలవాలంటే.. అభ్యర్థులు ప్రిలిమ్స్‌ ప్రిపరేషన్‌ నుంచే మెయిన్‌పైనా దృష్టిపెట్టాలి. ప్రిలిమ్స్‌లో ఉండే ఇంగ్లిష్‌ లాంగ్వేజ్, న్యూమరికల్‌ ఎబిలిటీ, రీజనింగ్‌ ఎబిలిటీలను మెయిన్‌లోని జనరల్‌ ఇంగ్లిష్, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్, రీజనింగ్‌ ఎబిలిటీలతో అనుసంధానించుకుంటూ ప్రిపరేషన్‌ సాగించే వీలుంది.

జూన్‌లో పరీక్ష
ఎస్‌బీఐ నోటిఫికేషన్‌లో పేర్కొన్న ప్రకారం–ప్రిలిమినరీ పరీక్ష జూన్‌లో జరిగే ∙అవకాశముంది. అదే విధంగా మెయిన్‌ను జూలై 31న నిర్వహించనున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమయాన్ని అభ్యర్థులు సద్వినియోగం చేసుకునే విధంగా నిర్దిష్ట వ్యూహంతో అడుగులు వేయాలి. ముందుగా ప్రిలిమ్స్‌ తేదీ వరకు.. ప్రిలిమ్స్, మెయిన్స్‌ రెండింటిలో ఉన్న సబ్జెక్ట్‌లను చదవాలి. ఆ తర్వాత అందుబాటులో ఉన్న సమయంలో.. మెయిన్‌ ఎగ్జామ్‌పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలి. మెయిన్‌లో మాత్రమే ఉన్న జనరల్‌/ఫైనాన్షియల్‌ అవేర్‌నెస్, కంప్యూటర్‌ ఆప్టిట్యూడ్‌ విభాగాలకు ప్రత్యేక సమయం కేటాయించాలి. వాస్తవానికి ఈ రెండు సబ్జెక్ట్‌లకు కూడా ఇప్పటి నుంచే సన్నద్ధమయ్యేలా సమయం కేటాయించుకోవడం ఉపయుక్తంగా ఉంటుంది.

ఎస్‌బీఐ నోటిఫికేషన్‌– ముఖ్య సమాచారం
► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
► ఆన్‌లైన్‌ దరఖాస్తు తేదీలు: ఏప్రిల్‌ 27, 2021 నుంచి మే 17, 2021;
► ప్రిలిమినరీ పరీక్ష తేదీ: జూన్‌ నెలలో జరుగుతుంది.
► మెయిన్‌ ఎగ్జామినేషన్‌ తేదీ: జూలై 31, 2021
► తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: చీరాల, గుంటూరు, కడప, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్‌ కరీంనగర్, ఖమ్మం, వరంగల్‌.
► పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://bank.sbi/careers, https://www.sbi.co.in/careers