ప్రేమికులకు పూరి జగన్నాథ్ క్లాస్!
విధాత: ప్రేమ, ఇష్టం పేరుతో ఒకరిపై ఒకరు అధికారం చెలాయిస్తూ ఉంటారు. ముఖ్యంగా తాము చెప్పినట్లు వినడం లేదని, తమకు ఇష్టం లేని విధంగా ప్రవర్తిస్తోందని, మరొకరితో చనువుగా ఉంటోందని ఈమధ్య కాలంలో పలువురు అమ్మాయిలపై వారి ప్రియులు అఘాయిత్యాలకు పాల్పడుతుండటం నిత్యం చూస్తూనే ఉన్నాం. తమను ప్రేమించిన పాపానికి ఆ అమ్మాయిలకు స్వాతంత్య్రం లేకుండా చేస్తున్నాం. ఇక తమను ప్రేమించడం లేదని చంపడాలు, యాసిడ్ పోయడాలు, అఘాయిత్యాలకు పాల్పడం నిత్యం మామూలైపోయింది. మరికొందరు తమ పెళ్లాలకు […]

విధాత: ప్రేమ, ఇష్టం పేరుతో ఒకరిపై ఒకరు అధికారం చెలాయిస్తూ ఉంటారు. ముఖ్యంగా తాము చెప్పినట్లు వినడం లేదని, తమకు ఇష్టం లేని విధంగా ప్రవర్తిస్తోందని, మరొకరితో చనువుగా ఉంటోందని ఈమధ్య కాలంలో పలువురు అమ్మాయిలపై వారి ప్రియులు అఘాయిత్యాలకు పాల్పడుతుండటం నిత్యం చూస్తూనే ఉన్నాం.
తమను ప్రేమించిన పాపానికి ఆ అమ్మాయిలకు స్వాతంత్య్రం లేకుండా చేస్తున్నాం. ఇక తమను ప్రేమించడం లేదని చంపడాలు, యాసిడ్ పోయడాలు, అఘాయిత్యాలకు పాల్పడం నిత్యం మామూలైపోయింది. మరికొందరు తమ పెళ్లాలకు స్వేచ్ఛ లేదని, తాము చెప్పినట్లు వినడమే వారి పని అనే భ్రమలో ఉంటారు.
ఇక పెళ్లాలు కూడా తమ మొగుడు ఇతర మహిళలతో మాట్లాడకూడదని, ఆయన తన రహస్యాలన్నీ తమతోనే పంచుకోవాలని భావిస్తుంటారు. నా మొగుడు నాకే సొంతం, నా భార్య నేను చెప్పిందే వినాలి వంటి ధోరణులు మనం చూస్తూనే ఉన్నాం. ఇక వయసు వచ్చిన పిల్లలను కూడా నువ్వు ఈ చదువే చదవాలి. మేము చెప్పిన ఉద్యోగమే చేయాలి అని నిర్ణయిస్తారు.
ఒకనాడు మేము ఆ ఉద్యోగం చేయాలని భావించాం. నువ్వు మా కోరిక తీర్చి, మేము చేయలేని పనిని నువ్వు చేసి చూపించాలి. మేము చెప్పిన వారినే పెళ్లి చేసుకోవాలి అంటారు. ఇక ఇదే ధోరణి చాలా మంది ప్రాణస్నేహితులుగా చెప్పుకునే వారిలో కూడా కనిపిస్తుంది.
ఈ ధోరణిపైనే దర్శకనిర్మాత పూరీ జగన్నాథ్ విరుచుకు పడ్డాడు. తాజాగా ఆయన పూరి మ్యూజింగ్స్ వేదికగా డోంట్ ఓన్ అనే అంశంపై తన అభిప్రాయాలను పంచుకున్నాడు.
బుద్ధుడు సర్వసంగపరిత్యాగి. ఏది నాదని అనుకోవద్దు అని చెప్పాడు. ఆయన చెప్పాడని అన్ని వినలేం కదా…! కనీసం మనకు ఇల్లు, కారు, కనీస బ్యాంకు బ్యాలెన్స్ ఉండాలి. ఇవన్నీ ఓకే దేన్నైనా సొంతం చేసుకోండి కానీ మనిషిని కాదు.
ఈ వ్యక్తిని తన ఆస్తి అన్నట్టు ఎప్పుడూ ప్రవర్తించవద్దు. అలా అనుకోవడానికి మొదటి మెట్టు ప్రేమ. ప్రేమ పేరుతో ఒక వ్యక్తిని తాడేసి కట్టేస్తారు. దాంతో ఆ వ్యక్తికి ఊపిరాడదు. రాను రాను మీ ప్రేమ వాళ్లకు వేధింపుగా మారుతుంది. అవతలి మనిషి మనం చెప్పినట్టే వినాలి… రహస్యాలని మనతోనే పంచుకోవాలని భావిస్తుంటారు.
నీది అలాంటి ప్రేమే అయితే దయచేసి ప్రేమించవద్దు. జీవితంలో ప్రేమనేది ఒక ఛాయిస్ లాంటిది. అంతేగాని అది అవసరం కాదు. మనందరం సాధారణ మనుషులం. ప్రతి ఒక్కరికి ఒక జీవితం ఉంటుంది. ఒక మనిషి మరో మనిషిని సొంతం చేసుకోవడం తప్పు. కొందరిపై మనం అధికారం చూపిస్తాం. వేరొకరి మీద మీ అధికారం ఏంటి? నీ పుట్టుక నీకు తెలియదు.
నీ జీవితానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు ముందుగా నీకు తెలియవు. అలాంటి నువ్వు పక్క వాడి పుస్తకం లాక్కొని వాడి కథలో కొన్ని సీన్స్ రాస్తా అంటే ఎలా? ఇక్కడ నీకు ఇన్ని ఆస్తులు ఉన్నా చివరకు వెళ్ళేది ఒకే చోటకు. మనందరం ఇక్కడికి టూర్ కోసం వచ్చాము. టూరిస్ట్‌లా ఉందాం. చూసి ఎంజాయ్ చేద్దాం… టూర్ పూర్తి కాగానే వెళ్లిపోదాం…
నీతోటి పర్యాటకుడిని సొంతం చేసుకోవాలని మాత్రం చూడొద్దు అని తన విలువైన సలహాను పూరి జగన్నాథ్ ప్రేమికులకు ఇచ్చాడు. ఇది ప్రేమికులకే కాదు భార్యాభర్తలకు, స్నేహితులకు కూడా వర్తిస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.