Health tips | మహిళలూ ఆ శుభ్రతపై అశ్రద్ధ అస్సలే వద్దు.. ఆరోగ్యానికి చాలా ప్రమాదం..!

Health tips | మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే శ‌రీరంలో ప్రతి అవ‌య‌వం ఆరోగ్యంగా ఉండాల్సిందే. ఎందుకంటే స‌మ‌స్య ఏ భాగంలో ఉన్నా మ‌నిషి సంపూర్ణ ఆరోగ్యంతో లేన‌ట్లే. సిగ్గు, బిడియం లాంటి కార‌ణాలవ‌ల్ల కొంద‌రు జ‌ననాంగాల గురించిన చ‌ర్చను ఇష్టప‌డ‌రు. దానివ‌ల్ల వాటి ఆరోగ్యం కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అవ‌గాహ‌న లేక అశ్రద్ధ చేస్తారు.

Health tips | మహిళలూ ఆ శుభ్రతపై అశ్రద్ధ అస్సలే వద్దు.. ఆరోగ్యానికి చాలా ప్రమాదం..!

Health tips : మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే శ‌రీరంలో ప్రతి అవ‌య‌వం ఆరోగ్యంగా ఉండాల్సిందే. ఎందుకంటే స‌మ‌స్య ఏ భాగంలో ఉన్నా మ‌నిషి సంపూర్ణ ఆరోగ్యంతో లేన‌ట్లే. సిగ్గు, బిడియం లాంటి కార‌ణాలవ‌ల్ల కొంద‌రు జ‌ననాంగాల గురించిన చ‌ర్చను ఇష్టప‌డ‌రు. దానివ‌ల్ల వాటి ఆరోగ్యం కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అవ‌గాహ‌న లేక అశ్రద్ధ చేస్తారు. ఫ‌లితంగా ర‌క‌ర‌కాల ఇన్‌ఫెక్షన్‌లు, వ్యాధులతో ఇబ్బందులు ప‌డుతారు. ముఖ్యంగా మ‌హిళ‌లు ఇలాంటి స‌మ‌స్యల బారిన‌ప‌డే ప్రమాదం ఎక్కువ‌గా ఉంది. కాబ‌ట్టి జ‌న‌నాంగాల ఆరోగ్యం విష‌యంలో మ‌హిళ‌లు ఎలాంటి పొర‌పాట్లు చేయ‌కూడ‌దో ఈ ఆర్టిక‌ల్‌లో తెలుసుకుందాం..

1. ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం

కొంతమంది నలుగురిలో అందంగా కనిపించడం కోసం ముఖం, కాళ్లు, చేతులపై పెట్టిన శ్రద్ధ తమ ర‌హ‌స్య భాగాలపై పెట్టరు. రహస్య భాగాలను స‌రిగ్గా శుభ్రం చేసుకోరు. అందరికి కనిపంచేవి కావుగా అని ఆశ్రద్ధ చేస్తారు. ఇలా అశ్రద్ధ చేయడంవల్ల ర‌క‌ర‌కాల ఇన్‌ఫెక్షన్‌లు వస్తాయి. కాబ‌ట్టి ఆ భాగం శుభ్రత‌లో అస్సలు అశ్రద్ధ చేయ‌కూడ‌దు.

2. శుభ్రతకు ప‌రిక‌రాలు వాడ‌టం

కొంతమంది త‌మ జ‌ననాంగాలను శుభ్రం చేసుకోవ‌డానికి చేతుల‌ను వినియోగించరు. ముట్టుకోవడమే అపరిశుభ్రత అన్నట్టుగా కొన్ని రకాల ప‌రిక‌రాల‌తో రహస్య భాగాలను శుభ్రం చేసుకుంటారు. ఇలా పరికరాలను వాడటం కూడా ప్రమాద‌క‌ర‌మ‌ని నిపుణులు చెబుతున్నారు. ప‌రిక‌రాల‌తో జ‌ననాంగాలను శుభ్రం చేయ‌డంవ‌ల్ల వాటిని ఇన్‌ఫెక్షన్‌ల నుంచి కాపాడే మంచి బ్యాక్టీరియా కూడా న‌శిస్తుంద‌ట‌.

3. చెమ‌ట దుస్తుల‌తో ఎక్కువసేపు ఉండ‌టం

వాతావరణం వేడిగా ఉన్నప్పుడు శరీరానికి చెమటపడుతుంది. వేసవిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఇలా చెమ‌ట‌ప‌ట్టిన దుస్తుల‌తో ఎక్కువసేపు ఉండ‌టం కూడా ప్రమాద‌క‌రం. ఎందుకంటే చెమట ఎక్కువగా రహస్య భాగాలుండే ఇరుకు ప్రాంతాలోనే పడుతుంది. దాంతో ఆ రహస్య భాగాలతోపాటు శ‌రీరంలోని ఇత‌ర భాగాల‌కు కూడా ఇన్‌ఫెక్షన్‌లు సోకే ప్రమాదం ఉన్నది.

4. సిగ్గుతో సొంత చికిత్సలు అనర్థం

కొంతమంది రహస్య భాగాలలో ఏదైనా స‌మ‌స్య త‌లెత్తితే బయటికి చెప్పుకోరు. చికిత్స కోసం నిపుణుల‌ను సంప్రదించ‌డానికి కూడా సంకోచిస్తారు. అందుకే త‌మ‌కు తోచిన సొంత వైద్యం చేసుకుంటారు. ఇలాంటి సొంత చికిత్సవ‌ల్ల మంచికంటే చెడే ఎక్కువ జ‌రుగుతుంద‌ని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కచ్చితంగా నిపుణులను సంప్రదించి చికిత్స తీసుకోవాలని అంటున్నారు.

5. సంకేతాల‌ను ఖాత‌రు చేయ‌ండి

కొందరు రహస్య భాగాల్లో ఇన్‌ఫెక్షన్‌లకు సంబంధించిన సంకేతాలు క‌నిపించినా ప‌ట్టించుకోరు. వైద్యుల‌ను సంప్రదించి చికిత్స పొంద‌డానికి సందేహిస్తారు. దాంతో స‌మ‌స్య మ‌రింత ముదురుతుంది. పరిస్థితి చేయిదాటిపోతే అప్పటికైనా వైద్యులను సంప్రదించక తప్పదు. అప్పుడు ఆర్థికంగా కూడా ఎక్కువ సొమ్ము ఖర్చు చేయాల్సి వస్తుంది. కాబట్టి సమస్య చిన్నగా ఉన్నప్పుడే వైద్యులను సంప్రదించడం ఉత్తమం.

6. శానిట‌రీ ప్యాడ్స్‌ను సమయానికి మార్చండి

సాధారణంగా మహిళలు పీరియ‌డ్స్ స‌మ‌యంలో శానిట‌రీ నాప్కిన్స్ వాడుతారు. కానీ ఎక్కువ నాప్కిన్స్‌ వాడాల్సి వస్తుందన్న కారణంగా కొంద‌రు వాటిని స‌మ‌యానికి మార్చరు. ఇలా నాప్కిన్స్‌ను ఎప్పటిక‌ప్పుడు మార్చకుండా ఎక్కువసేపు ఉప‌యోగించ‌డంవ‌ల్ల కూడా ఇన్‌ఫెక్షన్‌లు సోకే ప్రమాదం ఉంటుంది. ఆ నాలుగు రోజులు ప్రతి నాలుగు గంట‌ల‌కు ఒక శానిట‌రీ ప్యాడ్ మార్చడం ఆరోగ్యకరం. నాప్కిన్స్‌ ఖర్చుకు భయపడితే వేలల్లో వైద్యానికి ఖర్చు చేయాల్సిన పరిస్థితి వస్తుంది.

7. త‌ర‌చూ వైద్య ప‌రీక్షలు చేయించేకోవాలి

రహస్య భాగాల్లో సమస్య వచ్చినప్పుడు బాధపడటం కంటే సమస్య రాకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. తరచూ గైనకాలజిస్టును సంప్రదించి వైద్య పరీక్షలు చేయించుకుంటే ఎలాంటి సమస్యలైనా తీవ్రం కాకుండా ఉంటాయి. ఇన్‌ఫెక్షన్‌లను కూడా ముందే గుర్తించి చికిత్స పొందే అవకాశం కలుగుతుంది. కాబట్టి మ‌హిళ‌లు క‌నీసం ఏడాదికి రెండు సార్లయినా వైద్య ప‌రీక్షలు చేయించుకోవాలి.

8. సింథ‌టిక్ లోదుస్తులు వాడవద్దు

చాలా మంది మహిళలు సింథటిక్‌ లోదుస్తులు వినియోగిస్తారు. ఇలా సింథ‌టిక్ లోదుస్తుల వాడ‌కం రహస్య భాగాల ఆరోగ్యానికి ప్రమాద‌క‌రం. ఎందుకంటే సింథ‌టిక్ దుస్తులు శరీరానికి పట్టిన చెమ‌ట‌ను పీల్చుకోవు. దాంతో చెమట కారణంగా జననాంగాలపై ఫంగస్‌ పెరిగి ఇన్‌ఫెక్షన్‌ల లాంటి అనారోగ్యం బారిన‌ప‌డే ప్రమాదం ఉంది.

9. ఘాటు వాస‌న వెద‌జ‌ల్లే ఉత్పత్తులు వద్దు

శ‌రీర శుభ్రత‌కు వినియోగించే కొన్ని ర‌కాల‌ స‌బ్బులు, లోష‌న్‌లు కూడా జ‌న‌నావయవాల అనారోగ్య స‌మ‌స్యల‌కు దారితీస్తాయ‌ని నిపుణులు చెబుతున్నారు. ఘాటైన సబ్బులు లోషన్‌ల కారణంగా రహస్య భాగాల్లోని పీహెచ్ స్థాయిలు మారిపోయి ఇన్‌ఫెక్షన్‌లు వ‌స్తాయని హెచ్చరిస్తున్నారు. కాబట్టి రహస్య భాగాల శుభ్రత విషయంలో మహిళలు ఎలాంటి ఆశ్రద్ధ చూపకూడదని అంటున్నారు.