pregnancy myths vs medical advice | కొత్తగా ప్రెగ్నెంట్ అయ్యారా..?
ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఎన్నో అనుమానాలు.. మరెన్నో భయాలు.. ఇంతకుముందంటే పెద్దవాళ్లు సపోర్టుగా ఉండేవాళ్లు. ఇప్పుడున్న గ్లోబల్ ఫ్యామిలీస్ కి ఆ సపోర్టూ తక్కువే. ఒకవేళ ఉన్నా.. కొందరు పెద్దవాళ్లు రకరకాల మూఢనమ్మకాలతో సతాయిస్తుంటారు. డాక్టర్ల సూచనలు, పెద్దవాళ్ల సలహాల మధ్య మరింత గందరగోళానికి గురవుతుంటారు కొత్తగా గర్భవతులైనవాళ్లు. అలాంటి గందరగోళం ఉంటే ఇది చదవండి.

Pregnancy Myths vs Medical Advice |
విశ్రాంతా… వ్యాయామమా..
గర్భంతో ఉన్నప్పుడు పూర్తిగా విశ్రాంతిలో ఉండాలంటారు. కానీ ఎక్కువ రెస్టుతో రిస్కే. వాకింగ్, చిన్న చిన్న ఎక్సర్ సైజులు చేయడం వల్ల నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగని జిమ్ లకు వెళ్లి, బరువులెత్తడం లాంటి ప్రయోగాలు చేయకుండా నిపుణుల సలహాతో తేలికపాటి వ్యాయామాలు చేయాలి. అలసటగా అనిపించినప్పుడు మాత్రం విశ్రాంతి తీసుకోవడం తప్పనిసరి.
ఇద్దరి తిండి తినాలా?
గర్భంతో ఉన్నప్పుడు ఆకలి అయినా, కాకపోయినా ఏదో ఒకటి తినాలంటుంటారు. ఈ నమ్మకంతో చాలామంది అతిగా తినేస్తుంటారు. అతిగా తినడం వల్ల అవసరమైన దానికన్నా ఎక్కువ బరువు పెరుగుతారు. అధిక బరువు అయితే ప్రసవం కష్టం అవుతుంది. అందుకే బిడ్డ ఆరోగ్యంగా పుట్టాలంటే ఒకే ఒక మార్గం గర్భం దాల్చిన మొదటిరోజు నుంచి సమతుల పౌష్టికాహారం తీసుకుంటే చాలు.
దూరం.. దూరం..
ప్రెగ్నెంట్ అయిన తరువాత భర్తకు దూరంగా ఉండాలా వద్దా.. అనే విషయంపై ఎన్నో సంకోచాలుంటాయి. కానీ పెద్దవాళ్లను గానీ, డాక్టర్ ను గానీ అడగడానికి సంశయిస్తుంటారు. అలాగని భర్తతో లైంగికంగా దూరంగా ఉండటం వల్ల కుటుంబ సమస్యలు వస్తాయన్న ఆందోళన ఉంటుంది. అయితే ప్రెగ్నెన్సీ లో కాంప్లికేషన్లు ఏమీ లేకపోతే లైంగిక అవసరాలకు దూరమవ్వాల్సిన అవసరం లేదంటున్నారు నిపుణులు. కలయిక సమయంలో రక్తస్రావం కనిపిస్తే మాత్రం భర్తతో కలవకపోవడమే మంచిది.
జ్వరం వస్తే…?
ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఏ జలుబో, జ్వరమో వస్తే వాటికి మందులు వాడకపోతే ఒక బాధ. వాడకపోతే ఇంకో బాధ అన్నట్టు ఉంటుంది. కొన్ని రకాల మందులు, యాంటిబయాటిక్స్ వల్ల గర్భంలో బిడ్డకి నష్టం కలిగిస్తాయి. అందువల్ల డాక్టర్ అనుమతి లేకుండా సొంతంగా ఏ మందులూ వాడొద్దు.
బస్సెక్కితే…
గర్భంతో ఉన్నప్పుడు ప్రయాణాలు చేయొచ్చా లేదా అనే మీమాంస చాలామందికి ఉంటుంది. అయితే సౌకర్యవంతంగా అనిపించినప్పుడు ఎలాంటి ప్రయాణమైనా చెయ్యవచ్చు. కానీ నెలలు నిండిన తర్వాత ప్రయాణాలు చెయ్యకపోవడమే మంచిది.
స్పోర్ట్స్ విమెన్ ప్రెగ్నెంట్ అయితే…
స్పోర్ట్స్ వల్ల శరీరంపై అధిక భారం పడుతుందని, కాబట్టి ప్రెగ్నెన్సీలో క్రీడలకు దూరంగా ఉండాలని చెబుతుంటారు. కానీ క్రీడలే కెరీర్ గా ఉన్నవాళ్లు ఒక్కసారిగా వాటిని మానేయాలంటే కష్టమే. అందుకే సౌకర్యంగా ఉన్నంతవరకూ ఏ ఆటలైనా ఆడుకోవచ్చు. ఈత, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్ వంటి ఆటలు మంచి ఉత్సాహాన్ని కూడా ఇస్తాయి.
ఇవి కూడా చదవండి..
Health tips | మహిళలూ ఆ శుభ్రతపై అశ్రద్ధ అస్సలే వద్దు.. ఆరోగ్యానికి చాలా ప్రమాదం..!
Health tips | మీలో ఈ లక్షణాలున్నాయా.. వెంటనే రొమ్ము క్యాన్సర్ పరీక్షలు చేయించుకోండి..!