Garlic benefits | ఈ 10 లాభాలు పొందాలంటే.. మీ డైలీ డైట్‌లో వెల్లుల్లి తప్పక ఉండాల్సిందే..!

Garlic benefits | ఈ 10 లాభాలు పొందాలంటే.. మీ డైలీ డైట్‌లో వెల్లుల్లి తప్పక ఉండాల్సిందే..!

Garlic benefits : వెల్లుల్లి అనేది ఒక రకం మ్యాజికల్‌ ఫుడ్‌ ఐటమ్‌..! ఒకే రకం ఆహార పదార్థంతో ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు దక్కాలంటే మీ డెయిలీ డైట్‌లో వెల్లుల్లి ఉండాల్సిందే..! దీనిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ సెప్టిక్‌ లక్షణాలు ఉండటంవల్ల గత కొన్ని శతాబ్దాలుగా వంటల్లో ఒక భాగమైపోయింది..! దీనిలో అల్లిసిన్‌ అనే పదార్థంతోపాటు ఫాస్ఫరస్, జింక్‌, పొటాషియం, మెగ్నీషియం లాంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి..! వెల్లుల్లిలో విటమిన్‌ సి, కె, ఫోలేట్‌, నియాసిన్‌, థయామిన్‌ కూడా ఎక్కువ మోతాదులో లభిస్తాయి..! ఆరోగ్య ప్రయోజనాలేగాక సుగంధ పరిమళాలను వెదజల్లే ఈ వెల్లుల్లిని ప్రతి ఒక్కరూ తమ డెయిలీ డైట్‌లో భాగం చేసుకుంటే ఈ 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. అవేంటో తెలుసుకుందాం…


ఆరోగ్య ప్రయోజనాలు


1. గుండెకు మేలు

ఈ భూమ్మీద ఇతర వ్యాధులతో పోల్చుకుంటే గుండె నొప్పి, గుండెపోటుతోనే ఎక్కువగా మరణాలు సంభవిస్తున్నాయి. అధిక రక్తపోటు అనేది ఈ తరహా అనారోగ్యాలకు ప్రధాన కారణం. వెల్లుల్లిని డెయిలీ డైట్‌లో భాగం చేసుకోవడం ద్వారా రక్తపోటు స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చు.


2. జీర్ణశక్తి మెరుగు

పచ్చి వెల్లుల్లిని మీ డైలీ డైట్‌లో భాగం చేయడం ద్వారా జీర్ణ సంబంధ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. దీనికి వాపును తగ్గించే లక్షణం ఉన్నది. పేగుల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. పచ్చి వెల్లుల్లిని డైట్‌లో భాగం చేసుకోవడంవల్ల పేగుల్లోని నులిపురుగులు తొలగించబడుతాయి. కడుపులోని ప్రమాదకరమైన బ్యాక్టీరియాను కూడా వెల్లుల్లి తొలగిస్తుంది. మొత్తానికి ఉదరం ఆరోగ్యానికి పచ్చి వెల్లుల్లి తోడ్పడుతుంది.


3. వ్యాధి నిరోధకత

వెల్లుల్లికి వ్యాధి నిరోధకతను పెంచే లక్షణం ఉన్నది. రోజూ పచ్చి వెల్లుల్లిని మీ డైట్‌లో భాగంగా తీసుకోవడం ద్వారా జలుబు, దగ్గు లాంటి సమస్యలు సాధ్యమైనంత త్వరగా తగ్గిపోతాయి. ప్రతి ఉదయం రెండు వెల్లుల్లి రెబ్బలను తింటే మంచి ఫలితాలు కనిపిస్తాయి. దీనిలోని వ్యాధినిరోధక లక్షణాల కారణంగా అంటువ్యాధుల లాంటివి ప్రబలినప్పుడు వెల్లుల్లి రెబ్బలను ఒక దారానికి గుచ్చి పిల్లలు, పసికందుల మెడలో వేస్తారు. పిల్లలు ఆ వాసన పీల్చడం ద్వారా వ్యాధికారక వైరస్‌, బ్యాక్టీరియా నశిస్తుంది.


4. చెడు కొవ్వు నిర్మూలన

వెల్లుల్లి డైలీ డైట్‌లో భాగంగా ఉండటంవల్ల శరీరంలో చెడు కొలెస్టరాల్‌ తగ్గుతుంది. వెలుల్లికి శరీరంలోని కొవ్వుల స్థాయిలను, చెడు కొలెస్టరాల్‌ స్థాయిలను తగ్గించే శక్తి ఉన్నదని పలు పరిశోధనల్లో, అధ్యయనాల్లో తేలింది. కాబట్టి ఏదేమైనా వెల్లుల్లి వినియోగానికి, శరీరంలో కొవ్వుల స్థాయికి మధ్య సహసంబంధం ఏమిటో తెలుసుకునేందుకు మరిన్ని పరిశోధనలు జరుగాల్సిన అవసరం ఉన్నది.


5. సూక్ష్మక్రిమి నాశని

వెల్లుల్లిలోని సూక్ష్మజీవనాశక లక్షణాలు, ముఖ్యంగా అల్లిసిన్‌ అనే రసాయనం కారణంగా దానికి వైరస్‌లు, బ్యాక్టీరియాలతోపాటు శిలీంధ్రాల (ఫంగస్‌ల)పై కూడా పోరాడే శక్తి ఉన్నట్లు ఇటీవల జరిగిన పరిశోధనల్లో వెల్లడైంది. వెల్లుల్లిలోని వివిధ రసాయనాలకు ఆరోగ్యకరమైన కణాల మీద దాడిచేసే ప్రమాదకరమైన బ్యాక్టీరియాలను నిర్మూలించే సత్తా ఉన్నదని పరిశోధకులు గుర్తించారు.


6. నొప్పులు, వాపుల నిర్మూలన

వెల్లుల్లి మంచి నొప్పి నివారణిగానే కాకుండా, వాపు నివారణిగా కూడా పనిచేస్తుంది. నొప్పిగా ఉన్న కీళ్లపైన, కండరాలపైన వెల్లుల్లి నూనెతో మర్దన చేస్తే కాసేపట్లో ఉపశమనం లభిస్తుంది. కీళ్లవాతం, నరాల సంబంధ వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నవాళ్లకు ఆ సమస్య నుంచి బయటపడేసే దివ్యమైన ఔషధంగా వెల్లుల్లి పనిచేస్తుంది.


7. చర్మ ఆరోగ్యం

వెల్లుల్లిలోని యాంటీ ఆక్సిడెంట్స్‌, యాంటీ బ్యాక్టీరియల్‌ లక్షణాలవల్ల చర్మంపై మొటిమలు, కురుపులు లాంటి వాటిని పోగొట్టే శక్తి దానికి ఉంది. ముఖంపై బ్యాక్టీరియాను నశింపజేయడం ద్వారా మొటిమలు మటుమాయం అవుతాయి. మొటిమలపై పచ్చి వెల్లుల్లి రసాన్ని రుద్దడం ద్వారా మొటిమలు తగ్గిపోతాయని ఇటీవల జరిగిన కొన్ని పరిశోధనల్లో తేలింది. అయితే, చర్మ వ్యాధులకు చికిత్స పొందుతున్నవారు వెల్లుల్లి రసం పూసుకోవడంవల్ల చర్మం పాలిపోతుంది. అందువల్ల అలాంటివారు తమ డెర్మటాలజిస్ట్‌ సలహా మేరకు మాత్రమే ఇలాంటి చిట్కాను అమలు చేయాలి.


8. క్యాన్సర్‌ నిరోధకం

వెల్లుల్లిలో క్యాన్సర్‌ను నిరోధించే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. తరచూ వెల్లుల్లిని ఆహారంలో భాగంగా చేసుకోవడం ద్వారా క్యాన్సర్‌ కణాలను విస్తరింపజేసే పదార్థాలను నశింపజేస్తుంది. ఇప్పటికే జరిగిన పరిశోధనల ద్వారా వెల్లుల్లిలో యాంటీ క్యాన్సర్‌ లక్షణాలు ఉన్నాయని తేలింది. కానీ వెల్లుల్లి యాంటీ క్యాన్సర్‌ యాక్టివిటీకి సంబంధించి మరిన్ని పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉన్నది.


9. యాంటీ ఆక్సిడెంట్స్‌

వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్స్‌ విస్తారంగా ఉన్నాయి. అందుకే ఇది ఆక్సిడేటివ్‌ స్ట్రెస్‌ను తగ్గిస్తుంది. దైహిక బాధను నివారిస్తుంది. ఫ్రీ రాడికల్స్‌కు వ్యతిరేకంగా పోరాడుతుంది. వెల్లుల్లిలో 20కి పైగా పాలిఫెలోనిక్‌ కాంపొనెంట్స్‌ ఉన్నాయి. అందుకే ఇది ఫ్లావొనాయిడ్స్‌, పాలీఫెనాల్స్‌ లాంటి యాంటీ ఆక్సిడెంట్స్‌లను అధికంగా కలిగిన ఆహార పదార్థాల్లో ఒకటిగా ఉంది. యాంటీ ఆక్సిడెంట్స్‌ క్యాన్సర్‌, మధుమేహం, అల్జీమర్స్‌, హృదయ వ్యాధులు లాంటివి వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తాయి.


10. బ్లడ్‌ క్లాట్స్‌ను నిర్మూలన

వెల్లుల్లికి రక్తంలో ప్లేట్‌లెట్స్‌ స్టిక్‌నెస్‌ను తగ్గించి రక్తాన్ని గడ్డకట్టకుండా చేసే సామర్థ్యం ఉంది. హృదయం మంచి రక్తాన్ని దేహ భాగాలకు తీసుకెళ్లే ధమనులు పెలుసుబారకుండా అడ్డుకుంటుంది. రక్తనాళాలు గట్టిగా, ఇరుకుగా మారేందుకు కారణమయ్యే ప్లాక్‌ (ఒక రకం పాచి)ను వెల్లుల్లి నిర్మూలిస్తుంది. అందుకే ఒకే ఫుడ్‌ ఐటమ్‌తో ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు పొందాలంటే మీ డైలీ డైట్‌లో వెల్లుల్లిని భాగంగా చేసుకోండి.