Preah Vihear Temple | హిందూ దేవాలయం కోసం థాయ్‌లాండ్- కంబోడియా యుద్ధం!
2008లో కంబోడియా ఈ ఆలయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా నమోదు చేయడానికి ప్రయత్నించడాన్ని థాయ్ లాండ్ ప్రతిఘటించింది. దీంతో రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. రెండు వైపుల సైనికుల మధ్య అప్పటి నుంచి ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి.

Preah Vihear Temple | బౌద్ధ దేశాలైన థాయ్ లాండ్-కంబోడియా దేశాల మధ్య యుద్దం ఓ ప్రాచీన హిందూ దేవాలయం కోసం అంటే అశ్చర్యం కలగమానదు. ప్రస్తుతం రెండు దేశాల సైనికులు సరిహద్దుల వద్ధ పరస్పరం కాల్పులకు దిగారు. ఫైటర్ జెట్ లు, రాకెట్లతో పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. కాల్పులలో 10మందికి పైగా పౌరులు, పలువురు సైనికులు మరణించారు. గురువారం సరిహద్దు వద్ద రెండు దేశాలు తీవ్ర స్థాయిలో దాడులకు దిగాయి. రెండు దేశాల సైనికులు ఇరు వైపుల కాల్పులు జరిపారు. థాయిలాండ్‌లోని సిసా కెట్ ప్రావిన్స్ దాడుల్లో తీవ్రంగా దెబ్బతింది. గ్యాస్ స్టేషన్ పై కాల్పులు జరపడంతో ఆరుగురు మరణించారు. సురిన్ ప్రావిన్స్‌లోని ఫానోమ్ డాంగ్ రాక్ హాస్పిటల్‌తో సహా థాయిలాండ్‌లోని సైనిక, సైనికేతర ప్రదేశాలపై కంబోడియా రాకెట్లను ప్రయోగించిందని థాయిలాండ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆరోపించింది.
ప్రతికారంగా థాయిలాండ్ తన ఎఫ్-16 ఫైటర్ జెట్లను మోహరించింది. కంబోడియా సరిహద్దు ప్రాంతాలపై బాంబు దాడులు చేసింది. ఈ దాడుల్లో ఇద్దరు పౌరులు మరణించినట్లు కంబోడియా తెలిపింది. థాయిలాండ్ తమ దేశ పౌరులను కంబోడియా నుంచి వెనక్కి రావాలని కోరింది. రెండుదేశాల మధ్య ఉద్రిక్తతల నివారణకు చైనా మధ్యవర్తిత్వం కోసం ముందుకొచ్చింది. ప్రస్తుతానికి సైనిక ఘర్షణలు కొనసాగుతున్నాయి.
ప్రాచీన ఆలయం కోసం యుద్దం ఎందుకు?
ఈ రెండు బౌద్ధ దేశాలు 1000 ఏళ్ల కన్నా పురాతనమైన హిందూ ఆలయం కోసం యుద్దానికి దిగడం చర్చనీయాంశమైంది. దీంతో ఆ ప్రాచీన ఆలయం ప్రత్యేకత ఏమై ఉంటుదన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఈ రెండు దేశాల సరిహద్దుల్లో ఉండే 11 వ శతాబ్ధపు హిందూ దేవాలయం(ప్రీహ్ విహార్) కోసం థాయ్‌లాండ్- కంబోడియాలు ఘర్షణ పడుతున్నాయి. ప్రీహ్ విహార్ ఒక శివాలయం. దీనిని కెమెర్ రాజ్యపాలనలో కట్టారు. ఆలయం కోసం రెండు దేశాలు దాదాపు 100ఏళ్ల నుంచి పోరాటాలు చేస్తుండటం గమనార్హం. ధాయ్ లాండ్-కంబోడియల మధ్య వివాదం నేపథ్యంలోకి వెళితే ఈ రెండు దేశాలు 800 కి.మీ సరిహద్దును పంచుకుంటున్నాయి. 1863-1953 వరకు కంబోడియా ఫ్రెంచ్ ఆక్రమణలో ఉంది. ఫ్రెంచ్ వలస పాలకులు నిర్ణయించిన సరిహద్దుపై 1907లో ఒక ఒప్పందం కుదిరింది. అయితే, థాయిలాండ్ మాత్రం ఈ సరిహద్దు మ్యాప్ ను సవాల్ చేసింది. 11వ శతాబ్ధపు హిందూ ఆలయం (ప్రీహ్ విహార్) కంబోడియాలో ఉండటాన్ని వ్యతిరేకించింది. 1959లో కంబోడియా ఈ విషయాన్ని అంతర్జాతీయ కోర్టుకు తీసుకెళ్లింది. కంబోడియాకే ఆ ఆలయం చెందుతుందని కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది.
అనంతరం 2008లో కంబోడియా ఈ ఆలయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా నమోదు చేయడానికి ప్రయత్నించడాన్ని థాయ్ లాండ్ ప్రతిఘటించింది. దీంతో రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. రెండు వైపుల సైనికుల మధ్య అప్పటి నుంచి ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. 2011లో పెద్ద ఘర్షణ జరిగింది. రెండు దేశాల మధ్య వారం పాటు యుద్ధం జరిగింది. ఈ ఘర్షణల్లో 15 మంది మరణించారు.10,000 మంది నిరాశ్రయులయ్యారు. తాజాగా, మరోసారి ఈ రెండు దేశాలు యుద్ధ పరిస్థితులు కొనసాగుతున్నాయి.