Deepotsavam State Festival | కోటి దీపోత్సవాన్ని రాష్ట్ర పండుగగా గుర్తిస్తాం : సీఎం రేవంత్ రెడ్డి
ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన కోటి దీపోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని, రాష్ట్రపండుగ హోదా ప్రకటించారు. జాతీయ పండుగగా గుర్తించాలని ప్రధాని మోడీకి లేఖ రాయనున్నట్లు తెలిపారు.
CM Revanth Reddy Declares Koti Deepotsavam as Telangana State Festival
(విధాత సిటీ బ్యూరో)
హైదరాబాద్ :
Deepotsavam State Festival | హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్న కోటి దీపోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. కార్తీకమాసం సందర్భంగా ప్రతీ ఏటా జరిగే ఈ మహోత్సవం ఈసారి మరింత ఆధ్యాత్మికంగా, మహిమాన్వితంగా సాగుతోంది. ఎనిమిదో రోజు ఎన్టీఆర్ స్టేడియం శివభక్తి జ్యోతులతో మిన్నంటగా, ఆ ప్రాంగణం భక్తి, ఆరాధనల కాంతులతో నిండిపోయింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సతీ సమేతంగా ఈ వేడుకలకు హాజరయ్యారు. సీఎం రేవంత్ దంపతులను వేదమంత్రాల నడుమ తుమ్మల నరేంద్ర చౌదరి, రమాదేవీ దంపతులు ఘనంగా స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ కోటి దీపోత్సవాన్ని రాష్ట్రపండుగగా గుర్తిస్తామని ప్రకటించారు. అంతేకాదు, జాతీయ పండుగగా గుర్తించాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్లు తెలిపారు. ఆయన మాట్లాడుతూ గత 14 సంవత్సరాలుగా నరేంద్ర చౌదరి దంపతులు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిరంతరంగా నిర్వహిస్తూ దేశవ్యాప్తంగా భక్తుల మనసుల్లో స్థానం సంపాదించుకున్నారని అన్నారు. హైదరాబాద్ నగరంలో ప్రారంభమైన ఈ మహోత్సవం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సరిహద్దులు దాటి ఇప్పుడు ప్రపంచంలోని భక్తులందరికీ శివనామస్మరణను వినిపిస్తోందని సీఎం రేవంత్ ప్రశంసించారు.
ఈ కార్యక్రమానికి తాను హాజరైన రోజే తన జన్మదినం కావడం జీవితకాలం గుర్తుండిపోయే మధుర జ్ఞాపకమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున వచ్చే సంవత్సరం నుంచి కోటి దీపోత్సవాన్ని అధికారిక రాష్ట్రపండుగగా గుర్తించి నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అంతేకాదు, ఈ ఉత్సవానికి జాతీయ స్థాయి గుర్తింపు రావాలని, పీఎం మోడీకి లేఖ రాయనున్నట్లు తెలిపారు.
సీఎం రేవంత్ మాట్లాడుతూ ఎంత కష్టంలో ఉన్నా ఈ మహోత్సవంలో పాల్గొంటే గొప్ప ఆధ్యాత్మిక శక్తి లభిస్తుందని, ఆ శక్తితో తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతానని పేర్కొన్నారు. కోటి దీపోత్సవం ఆధ్యాత్మికత, విశ్వాసం, సాంస్కృతిక ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram