తెలంగాణ ప్రభుత్వం రాజధాని హైదరాబాద్ లో మరోసారి భూముల వేలంకు షెడ్యూల్ జారీ చేసింది. బంజారాహిల్స్, మోకిల, మేడిపల్లి వంటి ప్రైమ్ ఏరియాల్లోని ప్ ఈ వేలంలో అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) జూన్ 17 నుంచి జూన్ 30 వరకు ఈ-వేలం నిర్వహించనుంది. ఈ మెగా వేలం ప్రక్రియలో భాగంగా హెచ్‌ఎండీఏ మొత్తం 176 ప్లాట్లను నోటిఫై చేసింది. ఇందులో బంజారాహిల్స్‌లోని 8.24 ఎకరాల భారీ ల్యాండ్ కోసం కనీస ధరను ఎకరాకు రూ.99 కోట్లుగా ప్రభుత్వ అధికారులు నిర్ణయించారు.
బంజారాహిల్స్ స్థలంతో పాటు రియల్ ఎస్టేట్ పరంగా విపరీతమైన క్రేజ్ ఉన్న మోకిలాలో 100 ప్లాట్లు, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలోని మేడిపల్లి లేఅవుట్‌లో 68 ప్లాట్లు, అలాగే నార్సింగి, పీర్జాదిగూడ, చందానగర్, బైరాగిగూడ, బౌరంపేట ప్రాంతాల్లోని మిగిలిన చిన్న చిన్న ప్లాట్లను కూడా ఈ వేలంలో విక్రయించనున్నారు. బంజారాహిల్స్ ప్రాంతంలోని భూమికి జూన్ 19న వేలం నిర్వహించనుండగా.. మిగిలిన నివాస, వాణిజ్య ప్లాట్లకు జూన్ 17, 24, 29, 30 తేదీల్లో వేలం జరగనుంది.
కనీస ధరలు ఇలా..
ఈ వేలంలో ఆయా ప్రాంతాల డిమాండ్‌ను బట్టి ప్రీమియం ధరలను ఖరారు చేశారు. మోకిలాలో 300 నుంచి 400 చదరపు గజాల విస్తీర్ణం గల ప్లాట్ల(మిడ్-రేంజ్ గ్రోత్ ) కు కనీస ధరను గజానికి రూ.50 వేలుగా నిర్ణయించారు. చందానగర్, కుత్బుల్లాపూర్ పరిధిలోని సూరారంలో అప్‌సెట్ ధర గజానికి రూ.60 వేలుగా నిర్ణయించారు. అలాగే నార్సింగిలో రూ.50 వేలు, మేడిపల్లిలో (అర్బన్ రెసిడెన్షియల్) రూ.45 వేలు, బైరాగిగూడ, పీర్జాదిగూడల్లో రూ.40 వేలు, బౌరంపేటలో అత్యంత తక్కువగా గజానికి రూ.30 వేలుగా కనీస ధరను ఫిక్స్ చేశారు. ఈ భూముల అమ్మకం ద్వారా రాష్ట్ర ఖజానాకు దాదాపు రూ.1500 కోట్ల వరకు ఆదాయం సమకూరుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇటీవల రాయదుర్గంలో ఎకరం భూమి వేలంలో రూ.237కోట్లు పలకడం, రావిర్యాలలో సైతం గజం భూమి రూ. 83,500పలకడం వంటి పరిణామాలు తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగానికి కొత్త బూమ్ అందిస్తున్నాయి.
బంజారాహిల్స్ భూమిపై భారీ అంచనాలు
హెచ్‌ఎండీఏ చరిత్రలోనే మొదటిసారిగా బంజారాహిల్స్ ప్రాంతంలోని భూమిని బహిరంగ మార్కెట్లో విక్రయానికి ఉంచడం ఈ ధఫా వేలంలో ఆసక్తికర అంశంగా నిలిచింది. బంజారాహిల్స్‌లోని ఈ భూమి(హై-ఎండ్ ప్రీమియం) ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అత్యంత సమీపంలో ఉందని హెచ్‌ఎండీఏ అధికారులు వెల్లడించారు. భవిష్యత్తులో ఈ ల్యాండ్ నుంచి పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి నేరుగా కనెక్టివిటీని ఏర్పాటు చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ భూమికి సమీపంలోనే కార్పొరేట్ హాస్పిటల్స్, లగ్జరీ హోటళ్లు, విద్యాసంస్థలు, కేబీఆర్ పార్క్ ఉన్నాయన్నారు. అంతేకాకుండా ఫార్చ్యూన్ 500 సంస్థల కార్యాలయాలు కూడా ఇక్కడికి కేవలం 10 కిలోమీటర్ల పరిధిలోనే ఉన్నాయని చెప్పారు. అందుకే ఈ భూమికి వేలంలో డిమాండ్ ఉంటుందని అంచనా వేస్తున్నామని వెల్లడించారు.
భారీ ఆదాయంపై ప్రభుత్వం ఆశలు
ఈ దఫా వేలం పాటలో ఉంచిన భూములు, ప్లాట్లు వ్యూహాత్మక ప్రాంతాల్లో ఉండటంతో కొనుగోలుదారుల్లో విపరీతమైన ఆసక్తి కనిపిస్తోంది. వీటిలో చాలా వరకు ఔటర్ రింగ్ రోడ్డుకు (ORR) చేరువలో ఉండటమే కాకుండా, ప్రతిపాదిత మెట్రో కారిడార్లకు కూడా దగ్గరగా ఉన్నాయి. మెరుగైన కనెక్టివిటీ కారణంగా ఇవి నివాస గృహాల నిర్మాణానికి ఎంతో అనువైనవి. నగరంలో మౌలిక సదుపాయాలు విస్తరిస్తున్న కొద్దీ, ఈ ప్లాట్లు లాభదాయకమైన పెట్టుబడిగా మారుతాయని భావిస్తున్నారు. బంజారాహిల్స్‌లో అత్యధిక ధరలు ఉండగా, గేటెడ్ కమ్యూనిటీల కోసం మోకిల బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తోంది.
వేలానికి ముందస్తు సన్నాహాలు
వేలంపై ఆసక్తి గల ఇన్వెస్టర్లు ప్రస్తుతం ఎంఎస్ టీసీ లిమిటెడ్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేస్తున్నారు. వేలంలో పాల్గొనాలనుకునే వారు ముందుగానే రిజిస్టర్ చేసుకోవడం చాలా ముఖ్యం. వేలంలో పాల్గొనే బిడ్డర్లు తప్పనిసరిగా ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ (EMD) చెల్లించాల్సి ఉంటుంది. కేవలం సీరియస్ బయ్యర్లు మాత్రమే లైవ్ సెషన్‌లో పాల్గొనేలా చూసేందుకు ఈ డిపాజిట్ నిబంధనను పెట్టారు.ఇన్వెస్టర్లు ప్లాట్లు కొనేముందు రేరా (RERA) స్టేటస్‌ను క్షుణ్ణంగా పరిశీలించాలి. సాధారణంగా హెచ్‌ఎండీఏ ప్లాట్లకు క్లియర్ టైటిల్స్ ఉంటాయి, అయినప్పటికీ జోనింగ్, ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ (FSI) వివరాలను సరిచూసుకోవడం మంచిది. అలాగే నాన్-అగ్రికల్చరల్ ల్యాండ్ అసెస్‌మెంట్ (NALA) ట్యాక్స్ నిబంధనల గురించి కూడా తెలుసుకోండి. సరైన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల భవిష్యత్తులో ఎలాంటి న్యాయపరమైన సమస్యలు రాకుండా ఉంటుంది.
