Chinese Manja | హైదరాబాద్‌లో 1.24 కోట్ల విలువైన చైనా మాంజా స్వాధీనం : 143మంది అరెస్టు

సంక్రాంతికి ముందుగా హైదరాబాద్ పోలీసులు నిషేధిత చైనా మాంజాపై విస్తృత తనిఖీలు చేపట్టి 103 కేసులు నమోదు చేసి 143 మందిని అరెస్టు చేయడంతో పాటు రూ.1.24 కోట్ల విలువైన 6,226 మాంజా బాబిన్లను స్వాధీనం చేసుకున్నారు. పర్యావరణానికి, పక్షులకు, మనుషుల ప్రాణాలకు ప్రమాదకరమైన ఈ దారం విక్రయాలను ఉక్కుపాదంతో అణచివేస్తామని సీపీ వీసీ సజ్జనార్ స్పష్టం చేశారు.

Chinese Manja | హైదరాబాద్‌లో 1.24 కోట్ల విలువైన చైనా మాంజా స్వాధీనం : 143మంది అరెస్టు

Hyderabad Police Seize ₹1.24 Crore Chinese Manja, 143 Arrested

విధాత సిటీ బ్యూరో | హైదరాబాద్​:

Chinese Manja | సంక్రాంతి సందడి ప్రారంభమయ్యే ముందు నిషేధిత చైనా మాంజాపై హైదరాబాద్ పోలీసుల ప్రత్యేక డ్రైవ్ వేగం పుంజుకుంది. నగరవ్యాప్తంగా నిర్వహించిన తనిఖీలలో మొత్తం 103 కేసులు నమోదు కాగా 143 మందిని అదుపులోకి తీసుకున్నారు. రూ.1.24 కోట్లు విలువ కలిగిన 6,226 బాబిన్ల మాంజాను స్వాధీనం చేసుకోవడం సంచలనం సృష్టించింది. పర్యావరణానికి, పక్షులకు, మనుషుల ప్రాణాలకు ప్రమాదకరమైన ఈ నిషేధిత దారంపై సంపూర్ణ నిషేధం కొనసాగుతున్నప్పటికీ అక్రమ అమ్మకాలు కొనసాగుతున్నాయని సిటీ కమిషనర్​ సజ్జనార్ పేర్కొన్నారు.

సంక్రాంతి పతంగుల పండుగ అయినప్పటికీ ఆనందం పేరుతో ప్రమాదాలు పెరగకూడదనే ఉద్దేశంతో కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు కమిషనర్ తెలిపారు. మెటాలిక్ కోటింగ్ మరియు గాజు మిశ్రమాలు కలిగిన ఈ దారాలు విద్యుత్ తీగలకు తగిలితే షాక్ ప్రమాదాలు కూడా తలెత్తే అవకాశం ఉందని, ముఖ్యంగా పిల్లలు పెను ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉన్నందున తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని సజ్జనార్ సూచించారు. చట్టం ఉల్లంఘించిన ఎవరినైనా తక్షణమే అరెస్టు చేసి కేసులు నమోదు చేస్తామని కమిషనర్ స్పష్టం చేశారు.

ఉపేక్షించే ప్రసక్తే లేదు : నగర కమిషనర్ సజ్జనార్ హెచ్చరిక

Senior Hyderabad police officials examining large stacks of seized Chinese manja reels during enforcement drive

కొంతమంది వ్యాపారులు దుకాణాల తనిఖీలను తప్పించుకునేందుకు కామర్స్ ప్లాట్ఫార్మ్లు, సోషల్ మీడియా ద్వారా అమ్మకాలకుపాల్పడుతున్నట్లు తేలడంతో 24 గంటలపాటు ఆన్‌లైన్ మానిటరింగ్ ఏర్పాటు చేసినట్లు కూడా వెల్లడించారు. ఆన్‌లైన్‌లో కూడా నిషేధిత మాంజా కొనుగోలు లేదా విక్రయాలు జరిగితే చట్టపరంగా తీవ్ర చర్యలు తప్పవని చెప్పారు. చైనా మాంజా అమ్మకాలపై అవసరమైన సమాచారం ఎవరైనా డయల్ 100 లేదా వాట్సాప్ నెం. 9490616555 ద్వారా అందించాలని పౌరులను కోరారు.

జోన్లవారీగా పరిశీలిస్తే సౌత్ వెస్ట్ జోన్ అత్యధిక కేసులు నమోదు చేసిన ప్రాంతంగా నిలిచింది. ఈ జోన్‌లో 34 కేసులు నమోదు కాగా 46 మందిని అరెస్టు చేసి 3,265 బాబిన్లను స్వాధీనం చేశారు. ఆ తరువాత సౌత్ జోన్ 27 కేసులతో నిలిచింది. ఈస్ట్ జోన్, సౌత్ ఈస్ట్ జోన్, సెంట్రల్, నార్త్ మరియు వెస్ట్ జోన్లలో కూడా కేసులు నమోదు కాగా మొత్తం పట్టుబడిన మాంజా విలువ నగరవ్యాప్తంగా రూ.1.24 కోట్లకు చేరింది.

Hyderabad police inspecting a shop selling kite strings while questioning a vendor during Chinese manja crackdown

ఈ డ్రైవ్‌లో సిటీ టాస్క్ ఫోర్స్ కీలక పాత్ర పోషించిందని సజ్జనార్ తెలిపారు. మొత్తం 103 కేసుల్లో 67 కేసులు టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలోనే నమోదు అయ్యాయి. నిషేధిత మాంజా హైదరాబాద్‌కు గుజరాత్, రాజస్థాన్, ఢిల్లీ వంటి రాష్ట్రాల నుంచి అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించామని, ఆ సరఫరా వ్యవస్థ మొత్తాన్ని కూడా  స్తంభింపజేసేందుకు చర్యలు ప్రారంభించినట్లు వెల్లడించారు. కార్య‌క్ర‌మంలో క్రైమ్స్ అడిష‌న‌ల్ సీపీ శ్రీ‌నివాసులు, డీసీపీలు కారె కిరణ్ ప్రభాకర్, జీ చంద్రమోహన్, గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, అడిష‌న‌ల్ డీసీపీ అందె శ్రీనివాస్ రావు పాల్గొన్నారు.

పండుగ సందర్భంగా ప్రజల ఆనందం మరొకరి ప్రాణాలకు ముప్పు కాకూడదన్న సందేశంతో పోలీసులు చేపట్టిన ఈ చర్యలు నగరవ్యాప్తంగా విస్తృతంగా కొనసాగనున్నాయి.