- ఖైరతాబాద్ గణేశుడి థీమ్ ప్రకటన
- 69 అడుగుల మట్టి విగ్రహం
- పంచముఖ సంకటహర మహాగణపతి అవతారం
- సెప్టెంబర్ 14న వినాయక చవితి
వినాయక నవరాత్రి ఉత్సవాల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన ఖైరతాబాద్ మహా గణపతి ఈ ఏడాది మరో విశిష్ట అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. 2026 సంవత్సరానికి సంబంధించిన ఖైరతాబాద్ బడా గణేశుడి థీమ్‌ను ఉత్సవ కమిటీ అధికారికంగా ప్రకటించింది.
ఈ ఏడాది 69 అడుగుల ఎత్తుతో మట్టి విగ్రహాన్ని ‘పంచముఖ సంకటహర మహాగణపతి’ అవతారంలో ఏర్పాటు చేయనున్నారు. విగ్రహ తయారీ పనులకు గురువారం ఘనంగా కర్రపూజ నిర్వహించి ఉత్సవ కమిటీ అంకురార్పణ చేసింది.ఉత్సవ కమిటీ సభ్యులు ఖైరతాబాద్‌లోని పండల్ వద్ద గణేశుడి నమూనా పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ నమూనా ప్రకారం ప్రధాన గణపతి విగ్రహానికి ఒక వైపు 15 అడుగుల సోమనాథ జ్యోతిర్లింగం, మరో వైపు కాళీమాత విగ్రహం ఏర్పాటు చేయనున్నారు.
100 మందికి పైగా నిపుణులు
ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ చైర్మన్ సాయింగారి రాజ్‌కుమార్ మాట్లాడుతూ.. దశాబ్దాలుగా వస్తున్న సంప్రదాయం ప్రకారం కర్రపూజతో విగ్రహ నిర్మాణ పనులను ప్రారంభించినట్లు తెలిపారు. వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు మొదలుపెట్టినట్లు చెప్పారు. విగ్రహ తయారీ బాధ్యతలను ప్రముఖ శిల్పి చిన్నస్వామి రాజేంద్రన్ పర్యవేక్షిస్తున్నారు. ఆయన గత నాలుగు దశాబ్దాలుగా ఖైరతాబాద్ బడా గణేశుడి నిర్మాణంతో అనుబంధం కలిగి ఉన్నారు. ఈ భారీ విగ్రహం నిర్మాణంలో 100 మందికి పైగా నైపుణ్యం కలిగిన కార్మికులు పాల్గొననున్నారు.
విగ్రహ నిర్మాణానికి అవసరమైన మట్టి, ఉక్కు, ఎండుగడ్డి, బియ్యం ఊక, స్కాఫోల్డింగ్ కోసం కలప వంటి సామగ్రిని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల నుంచి సేకరించినట్లు నిర్వాహకులు తెలిపారు. పర్యావరణహితంగా మట్టి విగ్రహాన్ని తయారు చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చెప్పారు. ఈ ఏడాది వినాయక చవితి వేడుకలు సెప్టెంబర్ 14న ప్రారంభం కానున్నాయి. ఉత్సవాలకు మూడు రోజుల ముందే విగ్రహ నిర్మాణ పనులు పూర్తి చేసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు శిల్పి రాజేంద్రన్ తెలిపారు.
ఖైరతాబాద్ బడా గణేశుడి దర్శనం కోసం ప్రతి సంవత్సరం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. ఈ ఏడాదితో ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవాలు 72 ఏళ్లు పూర్తి చేసుకుంటుండటం మరింత ప్రత్యేకతను సంతరించుకుంది.
