Ghana Gold Mines| గోల్డ్ మైన్స్ అడ్డా ఘనా..అయినా పేదరికమే

పేదరికం..అల్లర్లు, అశాంతి, అప్పులు వంటి వాటికి అడ్డా ఆఫ్రికా దేశం ఘనా. అటువంటి దేశానికి భారీ గోల్డ్ మైన్స్ పెద్ద వరంగా ఉన్నాయి. అయితేనేం పాలకులకు సరైన దృక్పథం, రాజకీయ పార్టీలకు చిత్తశుద్ది లేకపోవడంతో ఆ దేశం అస్థిర రాజకీయాలకు, అల్లర్లకు నిత్య కేంద్రంగా మారిపోయింది. తల్లి రత్న గర్భ..తనయులు గర్బ దరిద్రులు అన్న నానుడికి ఈ దేశం సరిగ్గా పోతుంది.

Ghana Gold Mines| గోల్డ్ మైన్స్ అడ్డా ఘనా..అయినా పేదరికమే

విధాత : పేదరికం..అల్లర్లు, అశాంతి, అప్పులు వంటి వాటికి అడ్డా ఆఫ్రికా దేశం ఘనా(Ghana). అటువంటి దేశానికి భారీ గోల్డ్ మైన్స్ (Gold Mines)పెద్ద వరంగా ఉన్నాయి. అయితేనేం పాలకులకు సరైన దృక్పథం, రాజకీయ పార్టీలకు చిత్తశుద్ది లేకపోవడంతో ఆ దేశం అస్థిర రాజకీయాలకు, అల్లర్లకు నిత్య కేంద్రంగా మారిపోయింది. తల్లి రత్న గర్భ..తనయులు గర్బ దరిద్రులు అన్న నానుడికి ఈ దేశం సరిగ్గా పోతుంది. భారీగా ఏటా విదేశీ రుణాలతో ఆ దేశం ఆర్థిక ఇబ్బందులతో, పెరుగుతున్న ధరలు, ద్రవ్యోల్భణంతో ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారు. ఘనా దేశంలో అమెరికా, చైనాలకు ధీటుగా భారీ బంగారు గనుల నిక్షేపాలు ఉన్నాయి. ఒబువాసి, తార్క్యా వంటి బంగారు గనులు ఆ దేశానికి ప్రధాన ఆదాయ మార్గంగా ఉన్నాయి. గోల్డ్ ఫీల్డ్ సంస్థ ఆధ్వర్యంలోని ఘనా గోల్డ్ మైన్స్ అక్కడ తొలి 5 సంవత్సరాలలో సంవత్సరానికి సగటున 900,000 ఔన్సుల ఉత్పత్తిని చేస్తున్నాయి. అఫ్రికాలోనే బంగారం ఉత్పత్తి చేసే దేశాల్లో ఘనా అగ్రస్థానంలో ఉండగా..ప్రపంచంలో ఆరవ స్థానంలో కొనసాగుతుంది.

అనధికార గోల్డ్ మైన్స్ తో ఆదాయానికి గండి

అనధికారిక గనులు, బహుళ జాతి సంస్థల ఆధీనంలోని గనులతో ఘనా దేశంలో పర్యావరణ, నేరపూరిత సమస్యలు కూడా అధికమవుతున్నాయి. నదులు కలుషితమవుతున్న తీరుపై ఆందోళనలు సైతం చెలరేగాయి. బంగారం అక్రమ మైనింగ్ ఉచ్చులో యువత నేరాలలో చిక్కుకుంటుంది. ఘనా పాలకులు తమ దేశానికి వరంగా ఉన్న గోల్డ్ మైన్స్ ను సొంతంగా మైనింగ్ చేసుకోలేపోతుండటం, విదేశీ సంస్థలకు కట్టబెడుతుండటం సమస్యగా తయారైంది. చట్టబద్దచిన్న గనుల నుంచి 40శాతం బంగారం వెలికితీత చేయడం గమనార్హం, అనధికార గనుల నుంచి వస్తున్న బంగారం సైతం గణనీయంగా ఉంటుంది. గత సంవత్సరం ఘనాలో అక్రమ బంగారు గని కార్మికులు ఘనా చరిత్రలో అతిపెద్ద బంగారు నగెట్‌(బంగారు ఖనిజం రాయి)ను కనుగొన్న తీరు ఆ దేశ బంగారు గనుల సామర్ధ్యానికి నిదర్శనం. అనధికార మైనింగ్ ఘనా ఆదాయానికి గండి కొడుతుంది.

అతిపెద్ద బంగారు గని అమెరికాలోనే

ప్రపంచంలో అతిపెద్ద బంగారు గని అమెరికాలోని నెవాడా రాష్ట్రంలో ఉంది. ఈ గనిలో ఏటా టన్నుల కొద్ది గోల్డ్ ను వెలికి తీస్తుంటారు. భూమిపైనే అతిపెద్ద బంగారు గనిగా ఈ ప్రాంతం ప్రసిద్ధి చెందింది. ఈ బంగారు గనిని బారిక్ గోల్డ్, న్యూమెంట్ కార్పొరేషన్ అనే సంస్థలు కలిపి నడుపుతున్నాయి. ఈ గనిలో ఏటా సుమారు వంద టన్నులు అంటే లక్ష కిలోల గోల్డ్ ను బయటకు తీస్తున్నారు. ప్రస్తుతం భూమిపై వినియోగంలో ఉన్న అతిపెద్ద బంగారు గని ఇదేనని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఆ స్థాయిలో బంగారం ఉత్పత్తి చేసే గనులు ఘనా సహా అఫ్రికా దేశాలలో ఉన్నప్పటికి బంగారు ఖనిజ నిల్వలను గుర్తించి వెలికితీయడంలో ఆఫ్రికా దేశాలు వెనుకబడిపోతున్నాయి.

బంగారం ఉత్పత్తిలో టాప్ టెన్ దేశాలు ఇవే

వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నివేదిక మేరకు బంగారం ఉత్పత్తిలో ప్రపంచంలో చైనా టాప్ 1గా ఉంది.
ఏటా ప్రపంచ వ్యాప్తంగా 3660 టన్నుల గోల్డ్ మైనింగ్ జరుగుతుంది. వీటిలో చైనా 400 టన్నుల బంగారం ఉత్పత్తితో మొదటి స్థానంలో ఉంది. 340 టన్నులతో రష్యా రెండవ స్థానంలో ఉంది. 285 టన్నులతో ఆస్ట్రేలియా మూడో స్థానంలో ఉంది. 210 టన్నులతో కెనడా నాలుగో స్థానంలో ఉంది. అమెరికా 160 టన్నులతో ఐదవ స్థానంలో ఉంది. ఆఫ్రికాలో 26వ అతి చిన్న దేశంగా ఉన్న ఘనా 150 టన్నుల బంగారం ఉత్పత్తితో ఆరో స్థానంలో ఉంది. 141 టన్నులతో మెక్సికో ఏడవ స్థానంలో, 150 టన్నులతో ఇండోనేషియా 8వ స్థానంలో, 137 టన్నులతో పెరూ తొమ్మిదవ స్థానంలో ఉంది. 132 టన్నులతో ఉజ్బెకిస్తాన్ పదవ స్థానంలో ఉంది.