climate change । జూన్‌ నుంచి ఆగస్ట్‌ మధ్య మండిపోయిన ప్రపంచం.. భారత్‌లో రెండో తీవ్ర వేసవి

గత సంవత్సరం జూన్‌, జూలై, ఆగస్ట్‌ నెలలు 1970 తర్వాత గరిష్ఠ ఉష్ణోగ్రతలను నమోదు చేయగా.. ఈ ఏడాది కూడా తగ్గేదే లేదంటూ.. రెండో తీవ్ర వేసవిగా నిలిచింది.

climate change । జూన్‌ నుంచి ఆగస్ట్‌ మధ్య మండిపోయిన ప్రపంచం.. భారత్‌లో రెండో తీవ్ర వేసవి

climate change । ఈ ఏడాది జూన్ నుంచి ఆగస్టు వరకు ప్రపంచంలోని అనేక ప్రాంతాలు అసాధారణ ఉష్ణోగ్రతలను (unusual heat) అనుభవించాయి. వాతావరణ మార్పులు (climate change), ప్రజలపై వాటి ప్రభావం వివరాలను విశ్లేషించే స్వతంత్ర గ్రూపు.. క్లైమేట్ సెంట్రల్ (Climate Central) సెప్టెంబర్ 18, 2024న ఈ మేరకు ఒక నివేదికను విడుదల చేసింది. మానవులు కారణంగా పెరుగుతున్న పర్యావరణ మార్పులతో వేడి సంబంధిత ఆరోగ్య సమస్యలు కోట్లమంది ఎదుర్కొంటున్నారని నివేదిక తెలిపింది. వాతావరణంలో మార్పుల కారణంగా భూగోళంపై గరిష్ఠ ఉష్ణోగ్రతలు (temperatures) దీర్ఘకాలం కొనసాగే అవకాశం ఉందని నివేదిక పేర్కొన్నది. దక్షిణాసియా దేశాలలో అత్యంత ఎక్కువగా ప్రభావితమైన దేశాలలో భారత్ ఒకటి అని నివేదిక తెలిపింది. దేశంలో జూన్ నుంచి ఆగస్టు మధ్య 60 రోజుల వ్యవధిలో భారత దేశంలో రెండు కోట్ల మందికి పైగా ప్రజలు అసాధారణ ఉష్ణోగ్రతలను ఎదుర్కొన్నారని తెలిపింది. పర్యావరణంలో మార్పులే ఇందుకు కారణమని స్పష్టం చేసింది. వీటి వల్లే తిరువనంతపురం, వాసాయి- విరార్, కవరట్టి, ఠాణె, ముంబై, పోర్ట్‌ బ్లెయిర్‌ వంటి నగరాలలో 70 రోజులు, అంతకుమించి అసాధారణ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలిపింది. భారతదేశంలో ఈ వేసవిలో 536 వడగాడ్పులు చోటు చేసుకున్నాయి. గడిచిన 14 ఏళ్లలో ఇదే అత్యధికమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రత్యేకించి వాయవ్య ప్రాంతం 1901 తర్వాత అత్యంత వేడి వేసవిని చవి చూసిందని భారత వాతావరణ విభాగం పేర్కొన్నది.

మూడు నెలలుగా ప్రపంచవ్యాప్తంగా నిరవధిక వేడిగాలులు

2024 జూన్ నుంచి ఆగస్టు వరకు ప్రపంచవ్యాప్తంగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవడానికి వాతావరణంలో మార్పులు ఎలా కారణమయ్యాయో తన క్లైమేట్ షిఫ్ట్ ఇండెక్స్‌(Climate Shift Index)ను ఉపయోగించి క్లైమేట్‌ సెంట్రల్‌ విశ్లేషించింది. వాతావరణ మార్పులపై ప్రపంచవ్యాప్తంగా రోజువారీ నమోదవుతున్న ఉష్ణోగ్రతల ప్రభావం ఎలా ఉందనే విషయాన్ని క్లైమేట్‌ షిఫ్ట్‌ ఇండెక్స్‌ (CSI) బేరీజు వేసింది. ఇందుకోసం ప్రపంచవ్యాప్తంగా 22 ప్రధాన ప్రాంతాల్లో విస్తరించిన పెద్ద దేశాల్లో ఉన్న 218 దేశాల్లోని రాష్ట్రాలు, భూభాగాలు, 940 నగరాల్లో ఉష్ణోగ్రలను క్లైమేట్‌ సెంట్రల్‌ అధ్యయనం చేసింది. ప్రతి నలుగురిలో ఒకరు వాతావరణ మార్పుల కారణంగా కలిగిన ఉష్ణోగ్రలకు గురయ్యారని అధ్యయనంలో వెల్లడైంది. జూన్‌, జూలై, ఆగస్ట్‌ నెలల్లో ప్రతి రోజూ వారు అనుభవించిన ఉష్ణోగ్రతలకు వాతావరణ మార్పులే మూడు రెట్లు కారణమని వెల్లడైంది. అంతేకాదు.. వాతావరణ మార్పుల కారణంగా 2024, ఆగస్ట్‌ 13వ తేదీన గరిష్ఠ ఉష్ణోగ్రతలకు ఈ భూమి గురైంది. ఆ రోజున ప్రపంచ జనాభాలో సగం మంది అంటే.. 4.1 బిలియన్ల ప్రజలు గరిష్ఠ తాపానికి గురయ్యారట.

17 రోజులపాటు అదనపు ఉష్ణోగ్రతలు

వాతావరణ మార్పుల కారణంగా ప్రమాదకరమైన ఉష్ణోగ్రతలను సగటున ఒక వ్యక్తి అదనంగా 17 రోజులపాటు అనుభవించినట్టు విశ్లేషణలో తేలింది. అందులోనూ ప్రపంచ జనాభాలో 25శాతం మంది అంటే సుమారు 200 కోట్ల మంది ప్రజలు 30, అంతకంటే ఎక్కువ రోజులు  అధిక ఉష్ణోగ్రతలకు గురయ్యారని విశ్లేషణ తెలిపింది. ప్రత్యేకించి కరీబియన్‌ (Caribbean) దీవులలోని యావత్‌ జనాభా, మధ్యాసియా, మైక్రోనేషియా (Micronesia), ఉత్తర ఆఫ్రికా, దక్షిణ యూరప్‌ దేశాల్లోని ప్రతి నలుగురిలో ముగ్గురు అధిక ఉష్ణోగ్రతల బారిన పడినట్టు తేలింది.

72 దేశాల్లో 1970 తర్వాత గరిష్ణ ఉష్ణోగ్రతలు ఈ ఏడాదే

జూన్‌ నుంచి ఆగస్ట్‌ మధ్య కాలంలో 72కుపైగా దేశాలు 1970 తర్వాత ఈ ఏడాది గరిష్ఠ ఉష్ణోగ్రతలు అనుభవించారని  విశ్లేషణలో తేలింది. ఒక్క ఆసియా ఖండంలోనే 33.3 కోట్ల మంది ప్రజలు సుమారు 60 రోజులపాటు అసాధారణ ఉష్ణోగ్రతలబారిన పడ్డారు. భారతదేశం గత ఏడాది జూన్‌, ఆగస్ట్‌ నెలల మధ్య 1970 తర్వాత అత్యంత తీవ్ర వేసవిని ఎదుర్కొనగా.. ఈ ఏడాది రెండో అత్యంత తీవ్ర వేసవిని (second-hottest season) ఎదుర్కొన్నది. ఈ మూడు నెలల్లో 29 రోజులపాటు వాతావరణ మార్పుల కారణంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్టు నివేదిక తెలిపింది. ముంబై నగరం 54 రోజులపాటు గరిష్ఠ ఉష్ణోగ్రతలను ఎదుర్కొన్నది. కాన్పూర్‌, ఢిల్లీల్లో  మనుషుల ఆరోగ్యానికి ప్రమాదకర స్థాయిలో అంటే 39 డిగ్రీల సెల్సియస్‌కు మించి ఎండలు కాశాయి. దీనికి వాతావరణ మార్పలు నాలుగింతలు కారణమని విశ్లేషణలో వెల్లడైంది. ఈ ఏడాది అనేక ప్రాంతాల్లో ఎండాకాలం సుదీర్ఘకాలం కొనసాగింది. ఫలితంగా అధికారిక లెక్కల ప్రకారం జూన్‌ మధ్యలో 143 మంది గుండెపోట్లకు (heatstroke) గురవగా, వడ దెబ్బవంటి కారణాలతో సుమారు 42వేల మంది చనిపోయారు. రాజస్థాన్‌ వంటి చోట్ల ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల  సెల్సియస్‌ను దాటి పోయాయి. రాత్రి ఉష్ణోగ్రతలు సైతం అనేక ప్రాంతాల్లో 35 డిగ్రీలపైనే నమోదయ్యాయి. ఢిల్లీలో మే 13వ తేదీ తర్వాత దాదాపు 40 రోజులపాటు 40 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.