Elon Musk| అమెరికా రాజకీయాల్లో సంచలనం..ఎలాన్ మస్క్ కొత్త పార్టీ!

అమెరికా రాజకీయాల్లో సంచలన పరిణామాలు చోటుచేసుకున్నాయి. ద్విపార్టీ విధానం కొనసాగుతున్న అమెరికా రాజకీయాల్లో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కొత్త మలుపు తిప్పాడు. బిగ్ బ్యూటిఫుల్ బిల్లు విషయంలో అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను వ్యతిరేకించిన మస్క్ ముందే చెప్పినట్లు కొత్త రాజకీయ పార్టీని ప్రకటించాడు. ” ది అమెరికా పార్టీ”పేరుతో కొత్త పార్టీ పెడుతున్నట్లుగా ఎలాన్ మస్క్ వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో ప్రజాస్వామ్యం లేదని.. ప్రజలకు స్వేచ్ఛ ఇచ్చేందుకే కొత్త పార్టీ నిర్ణయం తీసుకున్నట్లు మస్క్ తెలిపారు. గతంలో ఎక్స్‌లో మస్క్ కొత్త పార్టీ ఏర్పాటు అంశంపై ఓటింగ్ నిర్వహించగా 80 శాతం మంది అనుకూలంగా ఓటు వేశారు. ఆ సమయంలో ది అమెరికా పార్టీ అంటూ ఆయన చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. అయితే మస్క్ కొత్త పార్టీ పెట్టినంత మాత్రాన అమెరికాలో దాని ప్రభావం ఏమి ఉండదని నిపుణులు అంటున్నారు. అమెరికా రాజకీయాల్లో మస్క్ కొత్త పార్టీ ప్రభావం..పాత్ర ఏమిటన్నది మునుముందు తేలనుంది.
ట్రంప్ వర్సెస్ మస్క్
ఇప్పటికే ట్రంప్ ఆయనను అమెరికా నుంచి దుకాణం మూసేసి, ఇంటికి (దక్షిణాఫ్రికా) వెళ్లాల్సి వస్తుందంటూ ఎద్దేవా చేశారు. చరిత్రలో ఎవరికీ దక్కని విధంగా ఆయన సబ్సిడీలు పొందారని ఆక్షేపించారు. సబ్సిడీలే లేకపోతే రాకెట్ ప్రయోగాలు, ఉపగ్రహాలు, ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తి వంటివేవీ ఉండేవి కాదన్నారు. ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించేందుకు ఏర్పాటు చేసిన డోజ్‌ను మస్క్‌పైకి ఉసిగొల్పాల్సి రావచ్చు. బహుశా అదే ఆయన్ను కబళించే రాకాసిగా మారవచ్చు అంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అటు ట్రంప్ హెచ్చరికలపై మస్క్ కూడా కౌంటర్ ఎటాక్ చేశారు. తనకిస్తున్న సబ్సిడీలను ఎత్తేయాలంటూ ట్రంప్‌కు సవాలు విసిరారు. బిగ్ బ్యూటిఫుల్ బిల్లును రుణ బానిసత్వం బిల్లుగా మస్క్ అభివర్ణించారు. ఈ బిల్లుతో జాతీయ రుణం మరో మూడు లక్షల కోట్ల డాలర్లకు పైగా పెరుగుతుందన్నారు. దేశ ప్రజల గురించి ఆలోచించే కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నామన్నారు. అతిపెద్ద రుణ పెరుగుదల బిల్లుకు ఓటేసిన ప్రతి కాంగ్రెస్ సభ్యుడు సిగ్గుతో తలదించుకోవాలన్నారు. ఈ పిచ్చి బిల్లు రిపబ్లికన్ పార్టీకి ఆత్మహత్య సదృశ్యం అవుతుందని మస్క్ హెచ్చరించారు.
దేశ వ్యతిరేకులే బిల్లును వ్యతిరేకిస్తున్నారు : ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రతిష్టాత్మకంగా తెచ్చిన బిగ్ బ్యూటీ ఫుల్ బిల్లును కాంగ్రెస్ ఉభయసభలు ఆమోదించాయి. దేశ స్వాతంత్ర దినోత్సవం రోజు అధ్యక్షుడు ట్రంప్ సంతకంతో ఈ బిల్లు చట్ట రూపు సంతరించుకుంది. బిల్లుపై ట్రంప్ సంతకం చేసిన సందర్భంగా అమెరికన్ సైన్యం దేశభక్తి కవాతును నిర్వహించింది. బిల్లుపై సంతకం చేసిన వేళ ట్రంప్ మాట్లాడుతూ అమెరికా గెలుస్తుంది.. అమెరికా గెలుస్తుంది.. గతంలో ఎన్నడూ లేని విధంగా గెలుస్తోందని వాఖ్యానించారు. దేశ ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్నామని పేర్కొన్నారు. దేశాన్ని వ్యతిరేకించే వారే ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారని మండిపడ్డారు. ఈ చట్టం వల్ల ప్రతి ఒక్కరు ఆరోగ్య బీమా లేక చనిపోతారని ప్రతిపక్ష డెమెక్రాట్లు అంటున్నారని.. కానీ ఇది ప్రతి ఒక్కరిని బతికించేదని ట్రంప్ చెప్పుకొచ్చారు. బిగ్ బ్యూటీఫుల్ బిల్లు ట్రిలియన డాలర్ల పన్ను మినహాయింపులతో పాటు 1.2 ట్రీలియన్ డాలర్ల విలువైన మెడిక్ ఎయిడ్, ఆహార కూపన్ల కోతకు ఉద్దేశించి తెచ్చారు. వలసల సేవల విభాగానికి ఇది మరిన్ని నిధులను అందించనుందని.. కాంగ్రెస్ బడ్జెట్ కార్యాలయం అంచనాల ప్రకారం పదేళ్లలో 3.3 ట్రిలియన్ ద్రవ్యలోటును తీర్చనుంది. బిగ్ బ్యూటిఫుల్ బిల్లు కోట్ల మంది తక్కువ ఆదాయం ఉన్న ప్రజలకు నష్టం చేసి.. సంపన్నులకు దోచిపెట్టడానికి ట్రంప్ తీసుకొచ్చారని ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీ విమర్శించింది. ఈ బిల్లుతో కోట్ల మంది ఆరోగ్య బీమాకు దూరం అవుతారని ఆరోపించింది.