Trump Tariffs | గ్లోబలైజేషన్‌కు ముగింపు.. వాణిజ్య యుద్ధాలకు నగారా?
ట్రంప్ టారిఫ్‌ల నేపథ్యంలో రాబోయే పరిస్థితిపై బిజినెస్ లీడర్లు ఎవరి అంచనాలో వారు ఉన్నారు. ఏం జరుగబోతున్నదో వేచి చూసే ధోరణిని వ్యక్తం చేస్తున్నారు. ‘ఆట నిబంధనలూ మారుతూ ఉండే కారణంగా మీ సప్లై చైన్ ఆధారంగా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోలేరు’ అని ఫ్రైట్ ప్రైసింగ్ ప్లాట్ ఫామ్ అయిన గ్జెనెటా చీఫ్ ఎనలిస్ట్ పీటర్ స్టాండ్ అన్నారు.

Trump Tariffs | ఇది అమెరికా లిబరేషన్ డే.. ఇదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార టారిఫ్‌ల విడుదలకు ముందు తన సామాజిక మాధ్యమంలో రాసిన వాక్యం. ఇప్పటిదాకా గ్లోబలైజేషన్ శకం కొనసాగగా.. ట్రంప్ టారిఫ్‌ల నేపథ్యంలో దానికి భరతవాక్యం పలికినట్టయింది. ఇక వివిధ దేశాల మధ్య వాణిజ్య యుద్ధానికి తెర లేచే అవకాశాలు కనిపిస్తున్నాయని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల వల్ల దశాబ్దాలపాటు అమెరికా కార్మికులు, మాన్యుఫాక్చరర్లు తీవ్రంగా దెబ్బతిన్నారని ట్రంప్ వాదిస్తున్నారు. స్వేచ్ఛా వాణిజ్యం వలన ప్రపంచ వాణిజ్యానికి అడ్డంకులు తొలగిపోయాయని అంటున్నారు. ఫలితంగా ఇంపోర్ట్ గూడ్స్ మార్కెట్ అమెరికాలో మూడు ట్రిలియన్ డాలర్లకు పెరగగా.. 1.2 ట్రిలియన్ డాలర్ల వాణిజ్య లోటుకు దారి తీసిందని చెప్పారు.
ట్రంప్ టారిఫ్‌ల ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ప్రతికూలంగా ఉంటుందని యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ ప్రెసిడెంట్ క్రిస్టీన్ లగార్డ్ ఐర్లాండ్‌కు చెందిన న్యూస్‌టాక్ రేడియోలో అన్నారు. దాని ప్రభావపు సాంద్రత, నిలకడ పరిధి, లక్ష్యంగా చేసుకున్న ఉత్పత్తులు, అది ఎంతకాలం ఉంటుంది? చర్చలు జరుగుతాయా? లేదా? అనే దానిపై ఆధారపడి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. వాస్తవానికి టారిఫ్ అనే పదం డిక్షనరీలోనే అత్యంత అందమైన పదమని ఒకప్పుడు ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇప్పుడు తన ప్రతీకార ప్రణాళికలు ఇతర దేశాలు విధించే అధిక సుంకాలతో అమెరికా రేట్లను సరిపోల్చుతాయని చెబుతున్నారు. నాన్ టారిఫ్ అడ్డంకులను అధిగమిస్తాయని, అమెరికా ఎగుమతులకు ప్రతికూలంగా ఉంటాయని అంటున్నారు.
ఆటో సుంకాలు అమెరికాకు వ్యూహాత్మకంగా కీలకమైన మాన్యుఫాక్చరింగ్ సామర్థ్యాలను తిరిగి అందిస్తాయని ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో చెప్పారు. ఇది రక్షణవాదం కాదని, పునరుద్ధరణ అని ఆయన యూఎస్‌ఏ టుడేలో రాసిన వ్యాసంలో అభివర్ణించారు. అయితే.. వివిధ దేశాల ఆర్థిక వేత్తలు మాత్రం టారిఫ్‌లతో గ్లోబల్ ఎకానమీ మందగమనాన్ని చవి చూస్తుందని చెబుతున్నారు. మాంద్యం ప్రమాదాలను పెంచుతుందని, అమెరికా వాసుల సగటు జీవన ఖర్చులను వేల డాలర్ల మేరకు పెంచేస్తుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు ట్రంప్ బెదిరింపుల పర్వం వల్ల తమ కార్యకలాపాలను ప్లాన్ చేసుకోవడం కష్టంగా మారుతుందని వ్యాపారవర్గాలు చెబుతున్నాయి. ఈ స్థాయిలో షరతులున్న పరిస్థితి తనకు గుర్తు లేదని, కానీ ఫలితం చాలా అనూహ్యంగా ఉన్నదని ఇంటరాక్టివ్ బ్రోకర్స్ ముఖ్య వ్యూహకర్త స్టీవ్ సోస్నిక్ అన్నారు. ఇప్పుడు ఎవరికీ తెలియదని, ముందుంది ముసుర్ల పండగని వ్యాఖ్యానించారు.
ట్రంప్ టారిఫ్‌ల నేపథ్యంలో రాబోయే పరిస్థితిపై బిజినెస్ లీడర్లు ఎవరి అంచనాలో వారు ఉన్నారు. ఏం జరుగబోతున్నదో వేచి చూసే ధోరణిని వ్యక్తం చేస్తున్నారు. ‘ఆట నిబంధనలూ మారుతూ ఉండే కారణంగా మీ సప్లై చైన్ ఆధారంగా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోలేరు’ అని ఫ్రైట్ ప్రైసింగ్ ప్లాట్ ఫామ్ అయిన గ్జెనెటా చీఫ్ ఎనలిస్ట్ పీటర్ స్టాండ్ అన్నారు. ట్రంప్‌ను విమర్శించకుండా జాగ్రత్తపడిన ఇటలీ ప్రధాని జార్జియా మెలోని.. ఇటాలియన్ కంపెనీలకు ట్రంప్ టారిఫ్‌లు గట్టి ఎదురుదెబ్బగా ఉంటాయని చెప్పారు. అమెరికా వినియోగదారులపైన ఇది సమంజసంగా ఉండబోదని అన్నారు. అందుకే తాను ఈ వాణిజ్య యుద్ధాన్ని నివారించేందుకు మనం అంతా కలిసి కృషి చేయాలని చెప్పానని పేర్కొన్నారు.
టారిఫ్ ఎఫెక్ట్ గట్టిగానే తాకిన ఆస్ట్రేలియా, యూరోపియన్ యూనియన్, కెనడా, మెక్సికో వంటి దేశాలు అమెరికా ఉత్పత్తులపై అంతేస్థాయిలో టారిఫ్‌లు విధించేందుకు సిద్దపడుతున్నాయి. అయితే కొందరు మాత్రం అమెరికాతో చర్చలకు మొగ్గుచూపుతున్నారు. ఇది రానున్న రోజుల్లో ఏ రూపం తీసుకుంటుందనేది ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.