విధాత : కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి ప్రముఖ పారిశ్రామికవేత్త రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ అనంత్ అంబానీ భారీ విరాళం అందించారు. అనంత్ అంబానీ ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తెల్లవారుజామున సుప్రభాత సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. శ్రీవారి దర్శనానికి ముందు అనంత్ అంబానీ స్వామివారికి తలనీలాలు సమర్పించి, స్వామివారి సేవలో పాల్గొన్నారు. అనంతరం ఆలయంలోని మూలవిరాట్టును దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ ఈవో, వేద పండితులు అనంత్ అంబానీకి శేషవస్త్రం కప్పి, తీర్థప్రసాదాలు అందించి సంప్రదాయబద్ధంగా ఆశీర్వచనాలు అందించారు.
ఈ సందర్భంగా భక్తులకు పర్యావరణహితమైన ప్రయాణ సేవలు అందించడమే లక్ష్యంగా టీటీడీకి రూ.27.5 కోట్ల విలువైన 25 ఎలక్ట్రిక్ బస్సులను విరాళంగా ప్రకటించారు. బస్సులతో పాటు చార్జింగ్ స్టేషన్ల ఖర్చు, డ్రైవర్ల జీతాలను కూడా రిలయన్స్ సంస్థనే భరించనుందని తెలిపారు.ఈ ఎలక్ట్రిక్ బస్సుల కోసం తిరుమల కొండపై ఒక హైటెక్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్‌ను కూడా రిలయన్స్ ఏర్పాటు చేయబోతోంది. ఇది భవిష్యత్తులో తిరుమలలో మరిన్ని ఎలక్ట్రిక్ వాహనాలు పెరగడానికి దోహదం చేయనుంది.
అలాగే అనంత్ అంబానీ తిరుమల గోశాల ఆధునీకరణకు ముందుకు వచ్చారు.. గుజరాత్లో రిలయన్స్ వంతారా వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం తరహాలో తిరుమలలోని టీటీడీ గోశాలను కూడా అల్ట్రా మోడర్న్‌గా మార్చేందుకు అనంత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గోవుల సంరక్షణ, వాటికి బెస్ట్ మెడికల్ ఫెసిలిటీస్, అనువైన వాతావరణం కల్పించేందుకు అవసరైన ఆధునాతన, పర్యావరణ వసతులు కల్పించనున్నారు.
