విధాత : తమిళనాడు నమక్కల్ జిల్లాలోని తిరుచెంగోడులో జరుగుతున్న అర్ధనారీశ్వర స్వామి రథోత్సవంలో విషాధ ఘటన చోటుచేసుకుంది. రథోత్సవం సాగుతున్న క్రమంలో ఇరుకు వీధిలో రథం చక్రం కింద పడి 18 ఏళ్ల ఇంజనీరింగ్ విద్యార్థి బి. హర్షవర్ధన్ అనే యువకుడు దుర్మరణం చెందాడు. మరో యువకకుడు శశిధరన్ కు వెన్నుముక విరగడంతో ఆసుపత్రికి తరలించారు.

రథం కదలకుండా ఉన్న సమయంలో, భక్తులు దాన్ని లాగడంతో అది ఒక్కసారిగా పక్కకు ఒరిగింది. దీంతో రథం చక్రానికి, పక్కనే ఉన్న గోడకు మధ్యలో నిల్చున్న ఇద్దరు యువకులు అందులో చిక్కుకున్నారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన హర్షవర్ధన్‌ను ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించినట్లు సమాచారం. ఘటనా స్థలాన్ని మంత్రులు పరిశీలించి, బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా (పరిహారం) ప్రకటించారు.

అర్థనారీశ్వర స్వామి ఆలయ చరిత్ర

తిరుచెంగోడు అర్ధనారీశ్వర స్వామి ఆలయం 2000 సంవత్సరాల పురాతనమైనది. 650 అడుగుల ఎత్తులో కొండపైన ఉంది. ప్రధాన దైవమైన అర్ధనారీశ్వర స్వామి పడమటి దిశకు అభిముఖంగా ఉంటారు, ఇది శివాలయాలలో సాధారణంగా కనిపించదు. ప్రధాన దైవం అర్థనారీశ్వరుడు సగం పురుషుడు, సగం స్త్రీ రూపంలో ఉన్నందునా..స్వామిని మాధోరుబాగన్, అమ్మయప్పన్ అని కూడా పిలుస్తారు. అర్ధనారీశ్వర స్వామి పాదాల కింద దేవ తీర్థం అనే ఒక తీర్థం ఉంది, అది ఎప్పటికీ ఎండిపోదు. ఈ తీర్థానికి ఔషధ గుణాలు ఉన్నాయని నమ్ముతారు.

అర్థనారీశ్వర ఆలయాన్ని చోళులు 1000 సంవత్సరాల క్రితం అద్బుతంగా నిర్మింపచేశారు. లింగ రూపంలోనే మహాశివుని అర్చించే మనకు మనిషి రూపంలో మహాశివుడు దర్శనమిచ్చే క్షేత్రాలు చాలా తక్కువగా ఉంటాయి. అందునా ఓకే శిల్పంలో శివ,పార్వతులు ఇద్దరూ అర్ధనారీశ్వరులలా దర్శనం ఇచ్చే క్షేత్రం కేవలం ఇది ఒక్కటి మాత్రమే కావడం విశేషం. కొండ శిఖరానికి 1206 మెట్లు ఏర్పాటు చేశారు.