CM Revanth Reddy: టీజీ ఆర్టీసీ తొలి మహిళా డ్రైవర్ కు సీఎం రేవంత్ రెడ్డి ప్రశంస!

విధాత, హైదరాబాద్ : తెలంగాణ ఆర్టీసీలో తొలి మహిళా డ్రైవర్‌గా చేరిన వాంకుడోతు సరితను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. అవకాశాలు వస్తే మహిళలు ఏ రంగంలోనైనా రాణించగలరని నిరూపించారని..ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసిన సరితకు అభినందనలని రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా ప్రశంసించారు. ప్రస్తుతం ఆర్టీసీ బస్సులకు మహిళలనే యజమానులుగా చేస్తున్న సందర్భంలో, మహిళా డ్రైవర్ నియామకం ఒక కీలక ముందడుగు అని పేర్కొన్నారు. మహిళలు విద్య, విజ్ఞానం, వృత్తి, వ్యాపారం, క్రీడలు, సైన్యం వంటి అన్ని రంగాల్లో తమ ప్రతిభను చాటుతున్నారని చెప్పారు.
గృహ బాధ్యతలు, సమాజ నిర్మాణంలోనూ మహిళల పాత్ర అపూర్వమైనదిగా రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఎన్నో అవమానాలను ఎదుర్కొంటూ, అడ్డంకులను అధిగమించి మహిళలు విజయాల బాటలో ముందుకెళ్తున్నారని, సరిత అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని అభినందించారు. “ఇందిరా మహిళా శక్తి” పథకం ద్వారా రాష్ట్రంలోని స్వయం సహాయక బృందాలకు సాధికారత కల్పించేందుకు ప్రభుత్వం పలు కార్యక్రమాలు ప్రారంభించిందని సీఎం రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. కోటి మందిని కోటీశ్వరులుగా తీర్చిదిద్దాలన్న లక్ష్య సాధన కోసం ప్రతి మహిళా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలని కోరారు.
యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణ పూర్ మండలం సీత్యతండాకు చెందిన సరిత టీజీ ఆర్టీసీలో తొలి మహిళా డ్రైవర్ గా విధుల్లో చేరారు. తొలి రోజు శనివారం హైదరాబాద్-మిర్యాలగూడ ట్రిప్ బస్ నడిపారు. దేశ రాజధాని ఢిల్లీలో డ్రైవర్ గా పనిచేసిన సరిత తల్లిదండ్రులు వృద్ధాప్యం ఉండటంతో వారిని చూసుకునేందుకు స్వగ్రామానికి చేరుకున్నారు. రాష్ట్రంలో బస్ డ్రైవర్ గా అవకాశమివ్వాలని జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ లను సరిత అభ్యర్థించారు. వారు స్పందించి ఆమెకు డ్రైవర్ గా ఉద్యోగం ఇప్పించారు.