IRCTC Tamilnadu Tour | వీకెండ్‌లో ఫ్యామిలీతో కలిసి చిన్న ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఐఆర్‌సీటీసీ మీకోసమే ప్రత్యేకంగా తీసుకొచ్చిన కోస్టల్ చార్మ్ ఆఫ్ తమిళనాడు పేరిట ఓ ప్రత్యేక టూర్ ప్యాకేజీని అందిస్తోంది. ఈ యాత్రలో భాగంగా ప్రకృతి సోయగాలను ఆస్వాదిస్తూనే.. బీచ్‌లో సరదాగా గడిపే అవకాశం ఉంటుంది. పుదుచ్చేరి, చిదంబరం, మహాబలిపురం వంటి తమిళనాడులోని ప్రత్యేక ప్రాంతాలను తిరిగి వచ్చేలా తక్కువ ధరలో ఐఆర్‌సీటీసీ ఈ పర్యటనను షెడ్యూల్ చేసింది.
హైదరాబాద్‌లోని కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి ప్రతి శుక్రవారం ఈ టూర్ ప్రారంభమవుతుంది. మొత్తం నాలుగు రాత్రులు, ఐదు రోజుల పాటు ఈ యాత్ర కొనసాగుతుంది. ఈ పర్యటనలో భాగంగా పుదుచ్చేరిలోని అరవిందో ఆశ్రమం, ఆరోవిల్, ప్యారడైజ్ బీచ్, చిదంబరంలోని నటరాజ స్వామి ఆలయం, పిచావరం మాంగ్రూవ్ బోటింగ్, మహాబలిపురంలోని యునెస్కో గుర్తింపు పొందిన వారసత్వ కట్టడాలను సందర్శించవచ్చు. ఇలా ఈ టూర్‌లో ఆధ్యాత్మికతను జోడిస్తూ ప్రకృతి అందాలు, సముద్ర తీరాలలో అద్భుతమైన అనుభవం పొందవచ్చు.
ప్యాకేజీ వివరాలు
హైదరాబాద్ నుంచి ప్రారంభమయ్యే టూర్ కోసం ఐఆర్‌సీటీసీ కంఫర్ట్ (3టైర్ ఏసీ), స్టాండర్డ్ (స్లీపర్ క్లాస్) విభాగాలుగా చార్జ్ చేస్తున్నారు.
కంఫర్ట్‌లో విభాగంలో అయితే ట్విన్ షేరింగ్‌కు అయితే రూ.19,810; ట్రిపుల్ షేరింగ్‌కు అయితే రూ.15,290 ఐఆర్‌సీటీసీ చార్జ్ చేస్తుంది. ఇక 5 నుంచి 11 సంవత్సరాల లోపు పిల్లలకు బెడ్‌తో కలిపి రూ.11,620; బెడ్ లేకుండా అయితే రూ.8,830 చార్జ్ చేస్తుంది.
స్టాండర్డ్ విభాగంలో అయితే ట్విన్ షేరింగ్‌కు రూ.17,660 ఐఆర్‌సీటీసీ వసూలు చేస్తుంది. ట్రిపుల్ షేరింగ్‌కు అయితే రూ.13,130 చార్జ్ చేస్తుంది. ఇక 5 నుంచి 11 సంవత్సరాల లోపు పిల్లలకు బెడ్‌తో కలిపి రూ.9,470 బెడ్ లేకుండా అయితే రూ.6,670 చార్జ్ చేస్తుంది. అదే ఈ పర్యటనకు నలుగురు కంటే ఎక్కువ బృందం వస్తే ఈ ధరలో తగ్గింపు ఉంటుంది.
రోజు వారీ టూర్ ప్లాన్
మొదటి రోజు: హైదరాబాద్‌లో కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి సాయంత్రం 5 గంటలకు బయల్దేరతారు.
రెండో రోజు: ఓవర్‌నైట్ జర్నీ అనంతరం పుదుచ్చేరికి ఉదయం 11.05 గంటలకు చేరుకుంటారు. హోటల్‌లో చెక్‌ఇన్, ఫ్రెషప్ తర్వాత అరవిందో ఆశ్రమం, ఆరోవిల్లె, ప్యారడైజ్ బీచ్‌ను సందర్శిస్తారు. రాత్రికి పుదుచ్చేరిలోనే బస ఉంటుంది.
మూడో రోజు: బ్రేక్‌ఫాస్ట్ అనంతరం చిదంబరం బయల్దేరి వెళ్తారు. నటరాజస్వామి ఆలయాన్ని దర్శించుకుంటారు. మధ్యాహ్నం పిచావరం మాంగ్రూవర్‌ను సందర్శిస్తారు. అక్కడ బోటింగ్‌కు అవకాశ కల్పిస్తారు. సాయంత్రం షాపింగ్ చేసుకోవచ్చు. రాత్రికి పుదుచ్చేరిలోనే బస ఉంటుంది.
నాలుగో రోజు: బ్రేక్‌ఫాస్ట్ అనంతరం మహబలిపురం బయల్దేరి వెళ్తారు. సైట్ సీయింగ్ చేస్తూ చెంగల్పట్టు స్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతారు.
ఐదో రోజు: ఉదయం 7.50 గంటలకు హైదరాబాద్ కాచిగూడ రైల్వే స్టేషన్‌కు చేరుకోవడంతో యాత్ర ముగుస్తుంది.
ప్యాకేజీలో ఉండే సదుపాయాలు
* ట్రైన్ టికెట్లు
* రెండు బ్రేక్‌ఫాస్ట్‌లతో కూడిన హోటల్ వసతి
* లోకల ట్రాన్స్‌పోర్టుకు ఏసీ వాహనం
* సైట్ సీయింగ్
* ట్రావెల్ ఇన్సూరెన్స్
* టోల్, పార్కింగ్, జీఎస్టీ
ప్యాకేజీలో లేని సదుపాయాలు
* లంచ్, డిన్నర్
* ట్రైన్‌లో భోజనం
* ఎంట్రీ టికెట్లు
* బోటింగ్, యాక్టివిటీస్
* టూర్ గైడ్
* వ్యక్తిగత ఖర్చులు
ముఖ్య నిబంధనలు
* ప్రయాణానికి నాలుగు రోజుల ముందు టికెట్లు ఇస్తారు
* 15 రోజుల ముందు టికెట్ క్యాన్సిల్ చేస్తే 250 చార్జ్ చేస్తారు. నాలుగు రోజుల లోపు అయితే 100 శాతం చార్జ్ చేస్తారు.
* ట్రైన్ ఆలస్యంగా వస్తే షెడ్యూల్ మారుతుంది.
సరిగ్గా ప్లాన్ చేసుకుంటే వీకెండ్‌లోనే ఈ ట్రిప్‌ను పూర్తి చేయవచ్చని ట్రావెల్ నిపుణులు చెబుతున్నారు. సోమవారం ఒక్క రోజు సెలవు పెట్టుకుంటే.. శుక్రవారం సాయంత్రం డ్యూటీ అయిపోయాక బయల్దేరి వెళ్లి.. మంగళవారం ఉదయం డ్యూటీ సమయానికి రావచ్చని అంటున్నారు.
