Janasena| నేటి నుంచి విశాఖలో జనసేన సమావేశాలు

అమరావతి: జనసేన(Janasena) పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు నేటి నుంచి విశాఖ(Visakhapatnam)లో ప్రారంభం కానున్నాయి. విశాఖ మున్సిపల్ స్టేడియంలో కొనసాగనున్న జనసేన సమావేశాల్లో భాగంగా గురువారం ఉదయం జనసేన లెజిస్లేటివ్ సమావేశం, మధ్యాహ్నం జనసేన రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహిస్తారు. శుక్రవారం పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా క్రియాశీలక నాయకులతో సమావేశాలు జరుగుతాయి. ఈ సమావేశాల కోసం పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) మూడు రోజులు విశాఖలోనే ఉండి కార్యకర్తలు, నేతలతో సమావేశం కానున్నారు.
తాజా రాజకీయ పరిణామాలు, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై పవన్ కల్యాణ్ పార్టీ నాయకత్వంతో సమావేశాల్లో చర్చిస్తారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరుకానున్నట్లు సమాచారం. 30న జనసేన విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఇందిరా గాంధీ ప్రియదర్శిని స్టేడియంలో భారీ బహిరంగసభ నిర్వహిస్తున్నట్లు పార్టీ నాయకత్వం వెల్లడించింది. ఆ రోజు సాయంత్రం 6 గంటలకు జరిగే ఈ బహిరంగ సభలో పవన్‌కల్యాణ్ ప్రసంగిస్తారు.