Kavitha| కృష్ణార్జునులమంటూ సొంత డబ్బా : కేటీఆర్, హరీష్ రావులపై కవిత విసుర్లు

బీఆర్ఎస్ లో కృష్ణార్జునులం అంటూ కేటీఆర్, హరీష్ రావు లు ట్వీట్లు పెట్టుకుని పరస్పరం సొంత డబ్బాలు కొట్టుకుంటున్నారు గాని..ప్రతిపక్ష నాయకులుగా ప్రజల అంచనాల మేరకు వారు పనిచేయడం లేదని..అందుకే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ భారీ మెజార్టీతో ఓడిపోయిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ బహిష్కృత నేత కల్వకుంట్ల కవిత విమర్శించారు.

Kavitha| కృష్ణార్జునులమంటూ సొంత డబ్బా : కేటీఆర్, హరీష్ రావులపై కవిత విసుర్లు

విధాత : బీఆర్ఎస్ లో కృష్ణార్జునులం అంటూ కేటీఆర్(Ktr), హరీష్ రావు(Harish Rao) లు ట్వీట్లు పెట్టుకుని పరస్పరం సొంత డబ్బాలు కొట్టుకుంటున్నారు గాని..ప్రతిపక్ష నాయకులుగా ప్రజల అంచనాల మేరకు వారు పనిచేయడం లేదని..అందుకే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ భారీ మెజార్టీతో ఓడిపోయిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ బహిష్కృత నేత కల్వకుంట్ల కవిత(Kavitha) విమర్శించారు. మెదక్ జిల్లా జనం బాట కార్యక్రమంలో భాగంగా మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ వాళ్లు సోషల్ మీడియాలో ఉద్యమం చేస్తున్నారు తప్ప ప్రజాక్షేత్రంలో పని చేయడం లేదన్నారు. నిజంగానే బీఆర్ఎస్ నేతలు ప్రజల కోసం పని చేసి ఉంటే జూబ్లీహిల్స్ ఫలితాలు మరొలా ఉండేవన్నారు. ప్రతిపక్ష పార్టీ ప్రజల కోసం పనిచేయలేని గ్యాప్ ను తెలంగాణ జాగృతి అందుకుని ప్రజాక్షేత్రంలో ప్రజాసమస్యలపై పోరాడుతుందన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ ఓటమికి చాల కుట్రలు జరిగాయని..సమయం, సందర్బం వచ్చినప్పుడు వెల్లడిస్తానని కవిత చెప్పుకొచ్చారు.

హరీష్, గంగుల, నవీన్ రావుల కోసం మారిన త్రిబుల్ ఆర్ ఆలైన్ మెంట్

రెడ్డిపల్లి గ్రామంలో కాళేశ్వరంలో భూములు పోయి నష్టపోయిన రైతులు త్రిబుల్ ఆర్ లో మరోసారి భూములు పోతున్నాయని, రైల్వే లైన్ లో మరికొందరి భూములు పోయే ప్రమాదం ఉందని కవిత తెలిపారు. రెడ్డిపల్లిలో 56మంది రైతులకు చెందిన ఎకరం, అర ఎకరం భూములు 59ఎకరాలు పోతున్నాయన్నారు.  రెడ్డిపల్లికి రాగానే త్రిబుల్ ఆర్ అనేక వంకలు తిప్పిన తీరు చూస్తేనే కొందరి పెద్దల కోసం అలైన్ మెంట్ మార్చారని అందరికి అర్ధమైపోతుందన్నారు. హరీష్ రావు 400ఎకరాల భూములు, ఫామ్ హౌస్, గంగుల కమలాకర్ 15ఎకరాల భూముల కోసం, ఎమ్మెల్సీ నవీన్ రావు 18ఎకరాల భూముల కోసం త్రిబుల్ ఆర్ అలైన్ మెంట్ మార్చారని కవిత ఆరోపించారు. ఇదే విషయాన్ని ఇక్కడి రైతులు వెల్లడించారని తెలిపారు. ఇట్లాంటి విషయాలు కేసీఆర్ తెలిస్తే ఊరుకునేవారు కాదని..కేసీఆర్ కళ్లకు గంతలు కట్టి ఇలాంటి పనులు చేసినందుకే మెదక్ లో బీఆర్ఎస్ ఓడిపోయిందన్నారు. నర్సాపురంలో స్టేట్ హైవే పక్కన మడిగెలలో ఎస్టీ బాలుర హాస్టల్ నిర్వహిస్తున్నారని , పిల్లలను కాపాడుకోవడం టీచర్లకు కష్టంగా మారిందని..ఆ మడిగలకు మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డికి నెలకు రూ.1లక్ష 50వేలు వస్తున్నందునా వాటిలో హాస్టల్ నిర్వహిస్తున్నారని కవిత ఆరోపించారు. ప్రభుత్వం పిల్లల సంక్షేమం కోసం హాస్టల్ భవనం మార్చాలని, కొత్తది నిర్మించాలని డిమాండ్ చేశారు.

మెదక్ సమస్యలపై హరీష్ రావు నిర్లక్ష్యం

రెడ్డిపల్లి భూ నిర్వాసిత రైతులకు కోటి రూపాయల చొప్పున ఇవ్వాలని లేదా కాళేశ్వరం కాలువ పరిధిలోని 150ఎకరాల్లో భూమికి బదులుగా భూమి ఇవ్వాలన్న రైతుల కోరికను ప్రభుత్వం ఆమోదించాలని కవిత డిమాండ్ చేశారు. ఏడుపాయల వనదుర్గ ఆలయ పరిరక్షణకు ఘన్ పూర్ ఆనకట్టు ఎత్తును పెంచాలని, హరీష్ రావు మంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ ప్రభుత్వం 2016లో 43కోట్ల రూపాయలు మంజూరు చేసిన్పటికి పనులు ఎందుకు పూర్తి చేయలేదో ఆయన ప్రజలకు సమాధానం చెప్పాలని కవిత డిమాండ్ చేశారు. మెదక్ లో కాళేశ్వరం మూడు ప్యాకెజీలు మొదలు పెట్టి 2,562కోట్లకు 991కోట్లు ఇచ్చారని, భూములు తీసుకుని నీళ్లివ్వడం లేదని, డబ్బులు ఇవ్వడం లేదని రైతులు వాపోతున్నారన్నారు. మెదక్ లో పదేళ్లుగా పెద్ద నాయకులు ఉన్నా ఎందుకు ఆ సమస్యలు పరిష్కారం కాలేదో వారే చెప్పాలన్నారు. పిల్లకొట్టాల వద్ద కేసీఆర్ హాయంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ కాలనీకి కేసీఆర్ కాలనీ పేరు కొనసాగించాలని కవిత కోరారు. రోడ్లు, శ్మశాన వాటిక, ప్రార్ధన మందిరాలు, డ్రైనేజీలు ఇక్కడ లేవని..ఇళ్లను అనర్హులకు ఇవ్వడంతో తాళాలు వేసి ఉంటున్నాయని స్థానికులు చెబుతున్నారన్నారు. పద్మా దేవేందర్ రెడ్డి ఏనాడు ఉద్యమకారులను పట్టించుకోలేదని, దీనిపై ఆమె ఆలోచించుకోవాలన్నారు. మెడికల్ కాలేజీకి, నర్సింగ్ కాలేజీకి, వాటి హాస్టల్స్ భవనాలకు నిధులు మంజూరైన నిర్మాణాలు లేవని..ఇదే అదనుగా సీఎం రేవంత్ రెడ్డి మెడికల్ సీట్లను తన జిల్లాకు తరలించుకుపోవడం విచారకరమన్నారు.

కాళేశ్వరం నీళ్లు రాలే…హరీష్ రావు సమాధానం చెప్పాలి

మెదక్ లో కాళేశ్వరం కింద లక్ష 50వేల ఎకరాలకు నీరు రావాలని, ఒక్క ఎకరానికి కూడా నీరు రాలేదని, నిజాం కాలంలో కట్టిన ఘన్ పూర్ ప్రాజెక్టు నీళ్లు మాత్రమే నేటికి దిక్కయ్యిందని కవిత తెలిపారు. ఇక్కడ గోదాంలు లేవని, నాలుగు మున్సిపాల్టీలకు నిధులిచ్చిన పనులు జరుగలేదని వీటన్నింటికి హరీష్ రావు సమాధానం చెప్పాలన్నారు. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు ఏర్పాటు చేసినా..ఇక్కడి అభివృద్ధి మౌలిక వసతులు ఏర్పాటు కాలేదన్నారు. కేసీఆర్ కళ్లకు గంతలు కట్టి మెదక్ జిల్లాను నాశనం చేసిన హరీష్ రావు ఇందుకు జవాబు చెప్పాలన్నారు. మెదక్ జిల్లా సమస్యలు తెలిస్తే కేసీఆర్ ఊరుకునే వ్యక్తి కాదన్నారు. మెదక్ అంటే న్యూయార్కు అనుకున్నాగాని హరీష్ రావు వంటి నాయకుడున్న ఇన్ని సమస్యలు ఉండడం ఆశ్చర్యకరమన్నారు. జాగృతి జనం బాట సామాజిక తెలంగాణ సాధన దిశగా కొనసాగుతుందని కవిత తెలిపారు. హైదరాబాద్ తో పాటు గ్రామీణ ప్రాంతాల ప్రజల తలసరి ఆదాయం పెంచాల్సిన అవసరం ఉందన్నారు. గ్రూప్ 1 ఉద్యోగాల్లో అన్యాయం చేస్తున్నారని, ప్రభుత్వ శాఖలలో ఉద్యోగాలు భర్తీ చేయకుండా, ఉద్యోగాలంటే గ్రూప్స్ ఒక్కటే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

మెదక్ పాడి రైతులకు అన్యాయం చేసిన హరీష్ రావు

మెదక్ జిల్లా పాడి రైతులకు మద్దతుగా నిలవాల్సిన మెదక్ జిల్లా నాయకుడు హరీష్ రావు ప్రైవేటుగా పాల వ్యాపారం చేస్తూ బాగుపడ్డారే తప్పా..పాడి రైతులను పట్టించుకోలేదని కవిత విమర్శించారు. సీఎం పీఆర్వో అయోధ్యరెడ్డి గతంలో హరీష్ రావు, ఆయన సతీమణిలు టెండర్లు లేకుండా గురుకులాలకు పాల సరఫరా చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారని గుర్తు చేశారు. అయినా సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు హరీష్ రావు, ఆయన బీనామీలు చేసిన అక్రమాలపై చర్యలు తీసుకోవడం లేదని కవిత ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి, హరీష్ రావుకు మధ్య ఉన్న బంధం ఏమిటో..ఎందుకు ఆయనను కాపాడుతున్నారో సీఎం చెప్పాలని కవిత డిమాండ్ చేశారు.

బీఆర్ఎస్ ను ఏళ్ల తరబడిగా మోసం చేస్తున్నాడు

ఏండ్ తరబడి బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ ను హరీష్ రావు మోసం చేస్తున్నారని కవిత విమర్శించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో 15మంది ఇండిపెండెంట్లు వచ్చి మేం విత్ డ్రా చేసుకుంటామని.. అక్కా ఎన్నికల్లో ఎవరికి మద్దతునివ్వాలని అడిగితే తాను బీఆర్ఎస్ లేనని, మీ ఇష్టం వచ్చినవారికి మద్దతునిచ్చుకోమని చెప్పానన్నారు. వారు నా వద్ద నుంచి నేరుగా హరీష్ రావు వద్దకు వెళ్లి అడిగితే అదే ఆన్సర్ చెప్పడం తెలిసి ఆశ్చర్యపోయానన్నారు. హరీష్ రావు మోసం తెలియడానికి టైమ్ పడుతుందని కవిత వ్యాఖ్యానించారు. తండ్రి చనిపోయినా కూడా పార్టీ కోసం టెలికాన్పరెన్స్ పెట్టినారని హరీష్ రావు బిల్డప్ ఇచ్చారని, ఉప ఎన్నికలో ఓడిపోగానే..అరే హరీష్ రావు ఉంటే ఓడిపోయేది కాదంటూ ప్రచారం మొదలు పెట్టించుకున్నారని, వెంటనే తప్పించుకోవడం…అప్పటివరకు మోసం చేయడం హరీష్ రావు నైజం అని కవిత ఆరోపించారు.

వారు లేకపోతే కేసీఆర్ లేరన్నట్లుగా బిల్డప్ లు

బీఆర్ఎస్ సభ సక్సెస్ అయితే మా ఘనతే అన్నట్లుగా కేటీఆర్, హరీష్ రావులు ఫోజులు కొట్టుకోవడం అలవాటుగా మారిందని కవిత దుయ్యబట్టారు. హరీష్ రావు లేకపోతే తెలంగాణ ఉద్యమం లేదు..కేసీఆర్ లేరన్నట్లుగా డబ్బా కొట్టించుకుంటూ మోసం చేస్తున్నారన్నారు. ఉద్యమ సమయంలో పార్టీ నుంచి బయటకు పోయి వచ్చిన పద్మాదేవేందర్ రెడ్డి వెనుక ఎవరున్నారని ప్రశ్నించారు. నన్ను బయటేసినందునా..తెలంగాణ సమస్యలను నెత్తినేసుకుని తిరుగుతున్నానని, అలా ప్రజల కోసం పనిచేయకుండా కృష్ణార్జునులం అంటూ కేటీఆర్, హరీష్ రావులు ఒకరిపై ఒకరు బాణాలు వేసుకుంటూ కేడర్ ను ముంచుతున్నారన్నారు. సోషల్ మీడియా ట్విట్టర్ వదిలిపెట్టి కేటీఆర్ జనంలోకి రావాలని, హరీష్ రావు పార్టీ నాయకత్వాన్ని మోసం చేయడం మానివేయాలని కవిత హితవు పలికారు. పార్టీలో జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, మల్లారెడ్డిలు ఎవరని..బీఆర్ఎస్ నేతల ఆస్తులు 2013నుంచి ఇప్పటివరకు ఎన్ని ఉన్నాయో ఆలోచించాలని, నా ఆస్తులు ఎన్నో అందరూ ఆలోచించాలని కవిత తెలిపారు. నా వెంట ఈడీ, సీబీఐ పడిందని..నా దగ్గర ఎలాంటి అక్రమాస్తులు వారు గుర్తించలేదని కవిత తెలిపారు. మెదక్ లో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని కూడా పైసలు తీసుకున్నారని కవిత విమర్శించారు. మేడిపండు నాయకుల కథ ఇలా ఉందన్నారు. ఇప్పటికైన బీఆర్ఎస్ అగ్రనాయకత్వం మేల్కోనాలన్నారు.

కేసీఆర్ వస్తే కథ మరోలా ఉంటది : కవిత

కేసీఆర్ ఆరోగ్యం బాగానే ఉందని..రేవంత్ రెడ్డికి ఏదో ఆశ ఉందని, కేసీఆర్ ఆరోగ్యం బాగలేకపోతే, బయటకు రాకపోతే రాజకీయంగా లాభం అయితదనుకుంటున్నారన్నారని కవిత వ్యాఖ్యానించారు. సార్ బయటకొస్తే కథ మరోలా ఉంటదన్నారు. ముందు కేటీఆర్, హరీష్ రావులు కేసీఆర్ కళ్లకు గంతలు కట్టి చేస్తున్న మోసాలు ముందు చూసుకుంటే బాగుంటుందన్నారు. కేసీఆర్ పిలిచినా నేను బీఆర్ఎస్ లోకి వెళ్లబోనని, తండ్రిగా పిలిస్తే కూతురుగా వెలుతానన్నారు. బీఆర్ఎస్ ప్రజల పక్షాన పోరాడంలో విఫలమైన పక్షంలో భవిష్యత్తులో నేను ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగే అవకాశం ఉందని కవిత చెప్పుకొచ్చారు.