Rahul Gandhi| రాహుల్ గాంధీ చేపల వేట..వైరల్

బీహార్ ఎన్నికల ప్రచారంలో ఓట్ల వేటలో బిజీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ లోక్ సభ పక్షనేత, ఎంపీ రాహుల్ గాంధీ సరదాగా జాలర్లతో కలిసి చేపలు పట్టారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ కాసేపు ఈత కొట్టారు

Rahul Gandhi| రాహుల్ గాంధీ చేపల వేట..వైరల్

న్యూఢిల్లీ : ఎన్నికల ప్రచారంలో రాజకీయ నాయకులు రకరకాల చిత్ర విచిత్ర ప్రచారా కార్యక్రమాలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఈ క్రమంలో టీ కొట్టు వద్ద టీ కాయడం..ఇడ్లీ, దోషాలు వేయడం, పంట చేనుల్లో కూలీలతో కలిసి పనిచేయడం వంటి అనేక విన్యాసాలు ఎన్నికల ప్రచారంలో తరుచూ చూస్తుంటాం. తాజాగా బీహార్ ఎన్నికల ప్రచారం(Bihar Elections)లో ఓట్ల వేటలో బిజీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ లోక్ సభ పక్షనేత, ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi) సరదాగా జాలర్లతో కలిసి చేపలు(Fishing) పట్టారు. బెగుసరాయ్‌లో ఎన్నికల ప్రచారంలో ఉన్న రాహుల్ గాంధీ స్థానిక జాలర్లను కలిశారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ వారితో కలిసి ఫిషింగ్ బోట్ లో ప్రయాణించి చెరువులోకి దూకి చేపలు పట్టారు.

రాహుల్ తో పాటు డిప్యూటీ సీఎం అభ్యర్థి ముఖేష్ సహానీ, కాంగ్రెస్ నాయకుడు కన్హయ్య కుమార్, తదితరులు కూడా చెరువులోదకి దిగారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ కాసేపు ఈత కొట్టారు. జాలర్లతో కలిసి ఫోటోలు దిగారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి. ఎన్నికల ప్రచార ఎత్తుగడలలో తానేమి తక్కువ కాదంటూ రాహుల్ గాంధీ మరోసారి నిరూపించుకున్నారు.

గతంలో రాహుల్ గాంధీ కేరళలో మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యల్ని స్వయంగా తెలుసుకోవడానికి కొల్లాం సముద్రంలో వారితో కలసి చేపలు పట్టే ప్రయత్నం చేశారు. మధ్యలో హఠాత్తుగా సముద్రంలోకి దూకి కాసేపు ఈత కొట్టారు.