నన్ను చంపినా సరే..నేను నా స్వదేశం బంగ్లాదేశ్ కు వెళ్లితీరుతానని ఆ దేశా మాజీ ప్రధాని షేక్ హసినా కీలక వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్ లో తలెత్తిన ప్రజా తిరుగుబాటుతో అధికారం కోల్పోయి…దేశం విడిచిపెట్టిన షేక్ హసినా తాత్కాలికంగా భారత్ లో ఆశ్రయం పొందుతున్న సంగతి తెలిసిందే.
తాజాగా బంగ్లాదేశ్ రాజకీయ పరిస్థితులపై స్పందించిన షేక్ హసినా.. తాను డిసెంబర్లో స్వదేశానికి వెళ్లి కోర్టులో లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. నేను బంగ్లాకు తిరిగి వెళ్లినప్పుడు ప్రస్తుత పాలకులు నన్ను అరెస్టు చేయవచ్చు.. లేదా చంపొచ్చని, అయినా సరే నేను వెళ్లక తప్పదు అని వ్యాఖ్యానించారు. నా పార్టీ నాయకులు, కార్యకర్తలు అక్కడ తీవ్రమైన అణచివేతకు గురవుతున్నారన్నారు. నా మద్దతుదారులకు అండగా నిలవాల్సి ఉందన్నారు. తనకు చావు అంటూ వస్తే అతి సొంత గడ్డ మీదే రావాలని, తన తల్లితండ్రులు చనిపోయిన చోట, రక్తం చిందించిన చోటే రావాలని కోరుకుంటున్నట్లు హసీనా భావోద్వేగ వ్యాఖ్యాలు చేశారు.
ప్రస్తుతం భారత్ ఆశ్రయంలో ఉన్న షేక్ హసినా తన పార్టీ అయిన అవామీ లీగ్ నాయకులతో కలిసి డిసెంబర్లో స్వదేశానికి వెళ్లాలని యోచిస్తున్నారు. రెండేళ్ల క్రితం బంగ్లాదేశ్ లో తలెత్తిన విద్యార్ధుల తిరుగుబాటును అణచివేసే క్రమంలో అప్పట్లో ప్రధానిగా ఉన్న హసీనా ఇచ్చిన ఆదేశాలు వివాదస్పదమయ్యాయి. అప్పటి తిరుగుబాటు సందర్భంగా హసీనా విద్యార్ధుల్ని చంపేందుకు ఆదేశాలు ఇచ్చారని, వాటిని అడ్డుకోవడంలో విఫలమయ్యారని, తిరుగుబాటు దారుల్ని ఉక్కుపాదంతో అణచివేశారనే ఆరోపణలు ఉన్నాయి.
బంగ్లాదేశ్ కు చెందిన అంతర్జాతీయ నేరాల ట్రైబ్యునల్ ఈ కేసులో ఆమెను ఇప్పటికే దోషిగా నిర్ధారించి మరణశిక్ష విధించింది. దేశంలోకి అడుగుపెట్టగానే ఆయా కేసుల్లో తనను అరెస్టు చేస్తారని లేదా చంపేస్తారని ఆమెకు తెలుస్తున్నప్పటికి లెక్క చేయకుండా స్వదేశానికి తిరిగి వెళ్లాలని నిర్ణయించుకోవడం ఆసక్తికరంగా మారింది.
