Telangana HILT Policy| హిల్ట్ పాలసీపై కాంగ్రెస్, బీజేపీ డైలాగ్ వార్..అసెంబ్లీ మీడియా పాయింట్ లో ఏలేటి

తెలంగాణ రాజకీయాల్లో ఇండస్ట్రీయల్ ల్యాండ్స్ ట్రాన్స్ పర్మేషన్(హిల్ట్) పాలసీపై ప్రకంపనలు రేపుతుంది. హిల్ట్ పాలసీ దేశ చరిత్రలోనే అతిపెద్ద స్కామ్ అని..5లక్షల కోట్ల స్కామ్ కు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెరలేపిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపణలతో మొదలైన రచ్చ...ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీల మధ్య డైలాగ్ వార్ ను రాజేసింది. హిల్ట్ పాలసీ అక్రమాలపై సాక్ష్యాధారాలతో నిరూపిస్తానని..తనతో బహిరంగ చర్చకు రావాలంటూ బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ధ కుర్చీ వేసుకుని కుర్చోవడం ఆసక్తి రేపింది.

Reported by: Y.V. Narsimha Reddy | Latest News | Apr 04, 2026, 1:24 pm IST
Read Time: 5 mins
Telangana HILT Policy| హిల్ట్ పాలసీపై కాంగ్రెస్, బీజేపీ డైలాగ్ వార్..అసెంబ్లీ మీడియా పాయింట్ లో ఏలేటి

(వై. వెంకటనరసింహారెడ్డి)

తెలంగాణ(Telangana) రాజకీయాల్లో ఇండస్ట్రీయల్ ల్యాండ్స్ ట్రాన్స్ పర్మేషన్(HILT Policy) పాలసీపై ప్రకంపనలు రేపుతుంది. హిల్ట్ పాలసీ దేశ చరిత్రలోనే అతిపెద్ద స్కామ్ అని..5లక్షల కోట్ల స్కామ్ కు సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy Government) ప్రభుత్వం తెరలేపిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR Allegations) ఆరోపణలతో మొదలైన రచ్చ…ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీల(Congress vs BJP) మధ్య డైలాగ్ వార్ ను రాజేసింది.

హిల్ట్ పాలసీతో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రూ.6లక్షల 30వేల కోట్ల భూములను కేవలం రూ.5వేల కోట్లకే అనునయులకు కట్టబెట్టే కుట్ర చేస్తూ ప్రభుత్వ ఖజనాకు లక్షల కోట్ల గండి కొడుతూ భారీ స్కామ్ కు పాల్పడుతుందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. గతంలో పరిశ్రమలను ప్రోత్సహించేందుకు సబ్సిడీలతో ప్రభుత్వం ఇచ్చిన భూములను హిల్ట్ పాలసీతో 30శాతం రిజిస్ట్రేషన్ మినహాయింపుతో బడా పారిశ్రామిక వేత్తలకు కట్టబెట్టడాన్ని ఏలేటి తప్పుబట్టారు. కాలుష్య కారక, మూతపడిన పరిశ్రమలను నగరం వెలుపలికి తరలించేందుకు, అలాగే మూతపడిన పరిశ్రమల భూములను రెగ్యులరైజ్ చేసేందుకు హిల్ట్ పాలసీ తెచ్చామనడం బూటకం అని..ప్రభుత్వ నిర్ణయానికి ముందు ఎలాంటి పర్యావరణ, పారిశ్రామిక కమిటీల అధ్యయనం..రిపోర్టులు లేకుండా ప్రభుత్వం హిల్ట్ పాలసీని అమలు చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. హిల్ట్ పాలసీ ముమ్మాటికి కాంగ్రెస్ భారీ స్కామ్ అని..ఖజనాకు లక్షల కోట్ల నష్టం చేస్తుందని ఏలేటి ఆరోపించారు. దమ్ముంటే హిల్ట్ పాలసీపై బహిరంగ చర్చకు రావాలని ప్రభుత్వానికి సవాల్ చేశారు.

ఏలేటి ఆరోపణలపై మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. హిల్ట్ పాలసీపై సరైన అవగాహన లేకుండా ఏలేటి అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఇందులో ఎలాంటి స్కామ్ లేదని..కాలుష్య కారక పరిశ్రమలను నగరం బయటకు తరలించాలన్న ఆలోచన గత పాలకులు కూడా చేశారని..హిల్ట్ పాలసీతో ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుందని తెలిపారు. అయితే ఉత్తమ్ కుమార్ మాటలను తోసిపుచ్చిన బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి హిల్ట్ పాలసీ సరైందైతే..తనతో బహిరంగ చర్చకు రావాలంటూ సవాల్ చేశారు. తన సవాల్ మేరకు శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్దకు చేరుకుని..కుర్చీ వేసుకుని కాంగ్రెస్ నాయకుల కోసం ఎదురుచూశారు. హిల్ట్ పాలసీ అక్రమాలపై సాక్ష్యాధారాలతో నిరూపిస్తానని..అప్పుడు ఉత్తమ్ రాజకీయ సన్యాసం తీసుకుంటారా? దమ్ముందా? అని ఏలేటి ప్రశ్నించారు. ఉత్తమ్ కు దమ్ముంటే, సబ్ కమిటీ మంత్రులతో అసెంబ్లీకి రావాలని మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నాయకులు చర్చకు రాకపోయినా..హిల్ట్ పాలసీతో ప్రభుత్వం చేస్తున్న స్కామ్ పై ప్రజా, న్యాయపరమైన పోరాటాలు చేస్తామని ఏలేటి ప్రకటించారు.