Hyderabad | హైదరాబాద్‌లో బ్యాంకుల లూటీ.. 1.68 లక్షల కోట్లు అప్పులు ఎగ్గొట్టిన బడాబాబులు

Hyderabad | లిస్టులో వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు డిఫాల్టర్లలో పలువురు ఎంపీలు, మాజీలు నగర బ్యాంకునూ వదలని నీరవ్‌ మోదీ పీఎన్బీ కన్సార్షియానికి 5,044 కోట్లు టోపీ ల్యాంకో మొండి బకాయి 44,354 కోట్లు అనేక మందికి వందల కోట్లలో బకాయిలు (విధాత, ప్రత్యేక ప్రతినిధి) దేశవ్యాప్తంగా లక్షల కోట్లు కొట్టేసిన బడాబాబులు.. హైదరాబాద్‌ బ్యాంకులనూ భారీగానే ముంచారు. విశేషం ఏమింటే.. ఆ బడాబాబుల్లో తెలుగు ప్రముఖుల కంపెనీలు కూడా ఉన్నాయి. అందులో పలువురు వ్యాపారవేత్తలతోపాటు.. అటు రాజకీయాన్ని, […]

  • By: krs    latest    Aug 17, 2023 1:40 AM IST
Hyderabad | హైదరాబాద్‌లో బ్యాంకుల లూటీ.. 1.68 లక్షల కోట్లు అప్పులు ఎగ్గొట్టిన బడాబాబులు

Hyderabad |

  • లిస్టులో వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు
  • డిఫాల్టర్లలో పలువురు ఎంపీలు, మాజీలు
  • నగర బ్యాంకునూ వదలని నీరవ్‌ మోదీ
  • పీఎన్బీ కన్సార్షియానికి 5,044 కోట్లు టోపీ
  • ల్యాంకో మొండి బకాయి 44,354 కోట్లు
  • అనేక మందికి వందల కోట్లలో బకాయిలు

(విధాత, ప్రత్యేక ప్రతినిధి)

దేశవ్యాప్తంగా లక్షల కోట్లు కొట్టేసిన బడాబాబులు.. హైదరాబాద్‌ బ్యాంకులనూ భారీగానే ముంచారు. విశేషం ఏమింటే.. ఆ బడాబాబుల్లో తెలుగు ప్రముఖుల కంపెనీలు కూడా ఉన్నాయి. అందులో పలువురు వ్యాపారవేత్తలతోపాటు.. అటు రాజకీయాన్ని, ఇటు వ్యాపారాన్ని కలగలిపి సాగిస్తున్న వారూ ఉన్నారు. అంతేకాదు.. ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడకు వచ్చి.. కంపెనీలు పెడతామని ఇక్కడి బ్యాంకుల్లో అప్పులు తీసుకుని అడ్రస్‌ లేకుండా పోయినవారూ కనిపిస్తారు. ఆఖరుకు కొన్ని ప్రభుత్వ విభాగాలు సైతం మొండిబాకీల జాబితాలో చోటు చేసుకోవడం విశేషం.

2021 నాటికి హైదరాబాద్‌లోని వివిధ బ్యాంకుల్లో పేరుకుపోయిన 1200కుపైగా మొండిబకాయిల వివరాలను బ్యాంకు ఉద్యోగుల సంఘాల నాయకులు విధాతకు అందించారు. వీటి మొత్తం లెక్కగడితే.. సుమారు లక్షా 68 వేల కోట్ల రూపాయలుగా తేలుతున్నది. అందులో ల్యాంకో ఇన్‌ఫ్రా మొండి బకాయిలు రూ.44,354 కోట్లు ఉన్నాయి. పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్‌మోదీ పేరు కూడా ఉంది.

రావిర్యాలలో వజ్రాల ఫ్యాక్టరీ పెడతానని చెప్పి.. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ కన్సార్షియానికి ఆయన కంపెనీ గీతాంజలి జెమ్స్‌ రూ.5,044 కోట్లు కుచ్చు టోపీ పెట్టింది. దక్కన్‌ క్రానికల్‌ హోల్డింగ్స్‌కు చెందిన టీ వెంకట్రామ్‌రెడ్డి, ఇతరులు రూ.1951 కోట్లు ఎగవేశారు. హైదరాబాద్‌కే చెందిన వీఎంసీ సిస్టమ్స్‌ రూ.1314 కోట్లు, కోస్టల్‌ ప్రాజెక్ట్స్‌ 4737 కోట్లు, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వర్‌రావు కుటుంబానికి చెందిన మధుకాన్‌ ప్రాజెక్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ 1400 కోట్లు, ఏపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు, ఇతరులకు చెందిన ఇండ్‌ భారత్‌ (మద్రాస్‌) పవర్‌ కంపెనీ పీఎన్‌బీ కన్షార్షియానికి 826 కోట్లు, పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌కు 2655 కోట్లు ఎగవేశారు.

నిమ్మగడ్డ రామకృష్ణ, ఇతరులకు చెందిన వీనస్‌ ఆక్వా ఫుడ్స్‌ లిమిటెడ్‌ మొండి బకాయి 37 కోట్లు ఉంటే.. ప్రసాద్‌ వీ పొట్లూరి, ఝాన్సీ సూరెడ్డికి చెందిన పీవీపీ క్యాపిటల్‌ 172 కోట్లు ఎగవేసింది. రాజకీయ నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్‌కు చెందిన కాసాని రిసార్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ 72.74 కోట్లు ఎగ్గొట్టింది. వై బాలకృష్ణ, ఇతరులకు చెందిన ఎస్‌ఈడబ్ల్యూ ఇన్‌ఫ్రా మొండిబాకీ 187.75 కోట్లుగా ఉన్నది.

ఇలా వందల, వేల కోట్ల అప్పులు తీసుకొని ఎగవేసిన వాళ్లు ఎందరో ఉన్నారు. కొన్ని ఆస్తులు వేలానికి ఉంచినట్టు కూడా ఆయా బ్యాంకులు పత్రికల్లో ప్రకటనలు కూడా ఇచ్చాయి. బీజేపీకి చెందిన ఎంపీ వైఎస్‌ చౌదరి, ఇతరులకు చెందిన సుజనా యూనివర్సల్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ బకాయి 400 కోట్లు ఉంటే.. కేవలం 3.5 కోట్ల విలువ చేసే నాలుగు ఆస్తులను మాత్రం వేలానికి పెట్టడం విశేషం.

Banks | ఎవడబ్బ సొమ్మని! 50 బడా కార్పొరేట్ల.. బ్యాంకు లూటీ 87,000 కోట్లు

కొందరు ఒక బ్యాంకులో మొండి బకాయిలు ఉన్నప్పటికీ మరో బ్యాంకు నుంచి దర్జాగా రుణాలు పొందిన ఘటనలు కూడా ఇందులో కనిపిస్తాయి. హితేశ్‌ రమేశ్‌కుమార్‌ జైన్‌కు చెందిన ట్రఫ్‌వైర్స్‌ కంపెనీ.. ఎస్‌బీఐకి 9.73 కోట్లకు డిఫాల్టర్‌గా ఉండి కూడా ఆంధ్రా బ్యాంకు నుంచి మళ్లీ రుణాలు పొందారు.

మరో విశేషం ఏమిటంటే.. పీ జీవానందం, ఇతరులకు చెందిన చెన్నై, హైదరాబాద్‌లలో కార్యాలయాలు కలిగి ఉన్న జేకేఎస్‌ కన్‌స్ట్రక్షన్స్‌ కంపెనీ 115 కోట్లు డిఫాల్ట్‌ అయితే.. వాళ్లకు సంబంధించిన రంగారెడ్డి జిల్లా గోపనపల్లిలో ఉన్న ఐదెకరాలను 50 కోట్లకు మాత్రమే ఆక్షన్‌కు పెట్టడం మరో విచిత్రం. తరచి చూస్తే ఇలాంటి సిత్రాలు చాలానే కనిపిస్తున్నాయి.

ఎవరిదీ సొమ్ము?

ఈ బడాబాబులకు లక్షా 68వేల కోట్ల రూపాయల మేరకు రుణాలిచ్చిన బ్యాంకులకు ఆ సొమ్ము ఎక్కడి నుంచి వచ్చింది? ఈ హైదరాబాద్‌ నగర ప్రజలు, ఇక్కడ బతికే చిన్నచిన్న పెట్టుబడిదారులు, మదుపర్లు, వ్యాపారస్థులు, పైసాపైసా కూడేసి దాచుకున్న పేదలు.. వీరిదీ ఈ సొమ్ము. ఈ ప్రజల సొమ్ము నుంచే ఆయా బ్యాంకులు వేల కోట్ల అప్పులు ఇచ్చాయి. అంటే.. ప్రజల కష్టార్జితాన్ని అప్పుల రూపంలో తీసుకుని.. ఎగ్గొడుతున్నవారు.. నిజానికి బ్యాంకులను కాదు.. ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

దేశంలో అన్ని బ్యాంకులు చేసినట్టే ఇవి కూడా నోటీసులు జారీ చేయడం, మంతనాలు జరపడంతో సరిపెట్టేస్తున్నారన్న అభిప్రాయాలు ఉన్నాయి. ప్రత్యేకించి ఇందులో కొందరు ప్రముఖ పారిశ్రామికవేత్తలు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖ నాయకులు ఉండటంతో కూడా వసూళ్లకు వెనకాడుతున్నారని అంటున్నారు.

HYD | హైదరాబాద్ బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న డిఫాల్టర్ల జాబితా

హైదరాబాద్ బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న డిఫాల్టర్ల జాబితా