గ్యాంగ్‌స్ట‌ర్ గ‌ర్ల్‌ఫ్రెండా.. మజాకా! వంద కోట్ల బంగ్లా గిఫ్ట్‌.. కానీ

స్క్రాప్ మెటల్ మాఫియా లీడ‌ర్‌, ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న గ్యాంగ్‌స్టర్ రవికనాకు చెందిన రూ.200 కోట్ల పోలీసులు సీల్ చేశారు.

  • Publish Date - January 6, 2024 / 08:56 AM IST
  • ద‌క్షిణ ఢిల్లీలోని ఆ బంగ్లాను సీజ్‌చేసిన పోలీసులు
  • ఎవ‌రీ కాజల్ ఝా? ఏమిటా బంగ్లా క‌థ‌?



విధాత‌: స్క్రాప్ మెటల్ మాఫియా లీడ‌ర్‌, ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న గ్యాంగ్‌స్టర్ రవికనా, అత‌డి ముఠాకు చెందిన రూ.200 కోట్ల విలువైన ఆస్తులను నోయిడా పోలీసులు సీల్ చేశారు. స్క్రాప్ మాఫియాపై ఉక్కుపాదం మోపుతున్న‌ నోయిడా పోలీసులు.. గ్యాంగ్‌స్టర్ తన స్నేహితురాలు కాజల్ ఝాకి బహుమతిగా ఇచ్చిన రూ. 100 కోట్ల బంగ్లాకు కూడా శుక్ర‌వారం తాళం వేశారు.


కాజల్ ఝా ఎవరు?


రవి కనా స్నేహితురాలు కాజల్ ఝా. ఆమె తొలుత‌ ఉద్యోగం కోసం గ్యాంగ్‌స్టర్‌ను సంప్రదించింది. గ్యాంగ్‌లో చేరిన కొద్దికాలంలోనే కీల‌కంగా మారింది. ర‌వికి సంబంధించిన బినామీ ఆస్తుల వ్య‌వ‌హారాలు అన్నింటినీ కాజ‌ల్ నిర్వ‌హించేది. ఈ క్ర‌మంలో దక్షిణ ఢిల్లీలోని న్యూ ఫ్రెండ్స్ కాలనీలో దాదాపు రూ. 100 కోట్ల విలువైన మూడు అంతస్తుల బంగ్లాను ర‌వి ఆమెకు బహుమతిగా ఇచ్చాడు. పోలీసులు దాడుల‌ను తీవ్ర‌త‌రం చేయ‌డంతో కాజల్ ఝా, ఆమె సహచరులు అరెస్టు నుంచి తప్పించుకోవడానికి పారిపోయారు. ఆ బంగ్లాకు పోలీసులు సీల్ చేశారు.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రవి కానా అలియాస్ రవీంద్ర.. 16 మంది సభ్యులతో ముఠాను న‌డిపేవాడు. ఈ గ్యాంగ్ స్క్రాప్ మెటీరియల్‌ను అక్రమంగా సేక‌రించ‌డం, విక్ర‌యించ‌డం వంటి ప‌నులు చేసేది. స్క్రాప్ డీలర్‌గా ర‌వి ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో అక్ర‌మంగా వ్యాపారాలు నిర్వ‌హించేవాడు. స్క్రాప్ మెటీరియల్‌ను అక్రమంగా సంపాదించి విక్రయించడానికి ఒక ముఠాను ఏర్పాటు చేసి కోటీశ్వరుడయ్యాడు.


2014లో ప్రత్యర్థి ముఠా చేతిలో హత్యకు గురైన గ్రేటర్ నోయిడా గ్యాంగ్‌స్టర్ హరేంద్ర ప్రధాన్‌కు రవి కానా సోదరుడు. అతని మరణం తర్వాత రవి ఆ గ్యాంగ్ బాధ్య‌త‌లు చేపట్టాడు. చంపేస్తామని బెదిరింపులు రావడంతో అత‌డికి ప్ర‌భుత్వం గ‌తంలో పోలీసు రక్షణ కూడా కల్పించింది.


కిడ్నాప్, దొంగతనం ఆరోపణలతో సహా ర‌వితోపాటు అతని సహచరులపై ఇప్పటివరకు 11 కేసులు నమోదయ్యాయ‌ని గ్రేటర్ నోయిడా సీనియర్ పోలీసు అధికారి సాద్ మియాఖాన్ తెలిపారు. ముఠాలోని ఆరుగురిని ఇప్పటి వరకు అరెస్టు చేశామ‌ని తెలిపారు. గ్రేటర్ నోయిడా, నోయిడా అంతటా ఈ ముఠాకు చెందిన‌ స్క్రాప్ గోడౌన్లపై దాడి చేసి సీలు వేసిన‌ట్టు ఆయ‌న వివ‌రించారు. గ్యాంగ్‌స్టర్ ర‌వి, అత‌డి స్నేహితురాలు కాజ‌ల్ ఝా, ఇతర ముఠా స‌భ్యులు ప‌రారీలో ఉన్నార‌ని తెలిపారు. వారి కోసం గాలిస్తున్న‌ట్టు పేర్కొన్నారు.