ఢిల్లీలో పెయింట్ ఫ్యాక్ట‌రీలో మంట‌లు

దేశ రాజ‌ధాని ఢిల్లీలో ఘోర అగ్ని ప్ర‌మాదం సంభ‌వించింది. ఈ ఘ‌ట‌న‌లో 11 మంది కార్మికులు స‌జీవ ద‌హ‌న‌మ‌య్యారు

ఢిల్లీలో పెయింట్ ఫ్యాక్ట‌రీలో మంట‌లు
  • 11 మంది కార్మికులు స‌జీవ ద‌హ‌నం
  • మ‌రో న‌లుగురికి తీవ్ర గాయాలు
  • మ‌రో ఇద్ద‌రి ఆచూకీ గ‌ల్లంతు

విధాత‌: దేశ రాజ‌ధాని ఢిల్లీలో ఘోర అగ్ని ప్ర‌మాదం సంభ‌వించింది. ఈ ఘ‌ట‌న‌లో 11 మంది కార్మికులు స‌జీవ ద‌హ‌న‌మ‌య్యారు. వారి మృత‌దేహాలు గుర్తుప‌ట్ట‌లేకుండా కాలిపోయాయి. మ‌రో న‌లుగురు కూడా గాయ‌ప‌డ్డారు. ఈ ప్ర‌మాదం త‌ర్వాత మ‌రో ఇద్ద‌రు క‌నిపించ‌కుండా పోయారు. ఢిల్లీ అలీపూర్‌లోని మార్కెట్ ప్రాంతంలో గురువారం సాయంత్రం పెయింట్ ఫ్యాక్టరీ పేలుడు సంభ‌వించ‌డంతో ఈ ఘోరం జ‌రిగింది. రెండు గోడౌన్ల‌తోపాటు డీ-అడిక్షన్ సెంటర్ మంట‌ల్లో చిక్కుకున్నాయి.

పోలీసులు, అగ్నిమాపక అధికారులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. అలీపూర్‌లోని దయాల్‌పూర్ మార్కెట్‌లోని ఫ్యాక్టరీలో పేలుడు సంభ‌వించిన‌ట్టు సాయంత్రం 5:25 గంటలకు సమాచారం అందుకున్న అగ్నిమాపకశాఖ సిబ్బంది.. ఆరు అగ్నిమాపక యంత్రాలతో సంఘటనా స్థలానికి చేరుకొన్నారు. నాలుగు గంటలు శ్ర‌మించి మంటలను అదుపులోకి తెచ్చారు. 11 మంది కాలిపోయిన మృతదేహాలను బ‌య‌ట‌కు తీసుకొచ్చారు. అగ్నిప్రమాదంలో ఒక పోలీసు సహా నలుగురు గాయపడి ద‌వాఖాన‌లో చికిత్స పొందుతున్నారు. మరో ఇద్దరు మంట‌ల్లో చిక్కుకుపోయి ఉండవచ్చ‌ని, వారి కోసం గాలిస్తున్న‌ట్టు తెలిపారు.

మంటలు చెలరేగడానికి ముందు ఫ్యాక్టరీలో పేలుడు శబ్దం వినిపించిందని, అక్కడ నిల్వ ఉంచిన రసాయనాల కారణంగా పేలుడు సంభవించిందని అధికారులు అనుమానిస్తున్నారు. “ప్రక్కనే ఉన్న ఇంటికి, న‌షా ముక్తి కేంద్రానికి మంటలు వ్యాపించాయి. ఒక పేలుడు కారణంగా భవనం కూలిపోయింది. 11 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాలు పూర్తిగా కాలిపోయాయి. వారిని గుర్తించడం కష్టంగా ఉంది.” అని ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ డైరెక్ట అతుల్ గార్గ్ తెలిపారు. అగ్నిప్రమాదానికి ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదని, గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని ఆయన చెప్పారు.