Morbi bridge | విధాత: గుజరాత్‌లోని మోర్బి బ్రిడ్జి నిన్న సాయంత్రం కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 141కి చేరింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే రాజ్ కోట్ బీజేపీ ఎంపీ మోహన్ భాయ్ కల్యాణ్ జీ కుందారియా ఇంట్లో కూడా విషాదం నెలకొంది. మోర్బి బ్రిడ్జి కుప్పకూలిన ఘటనలో ఎంపీ కుటుంబానికి 12 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఈ సందర్భంగా ఎంపీ మోహన్ బాయ్ మాట్లాడుతూ.. నా కుటుంబంలో మొత్తం 12 మంది చనిపోయారు. ఇందులో ఐదుగురు చిన్నారులు ఉన్నారు. 12 మంది నా సోదరి కుటుంబానికి చెందిన వారు అని ఆయన ఉద్వేగానికి లోనయ్యారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు స్థానిక అధికారులు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారని తెలిపారు.
మృతదేహాలను వెలికి తీస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోందన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రాణాలు కోల్పోయిన వారిలో ఎక్కువగా మహిళలు, చిన్నారులే ఉన్నారని పేర్కొన్నారు.
మోర్బి నగరంలో మచ్చు నదిపై నిర్మించిన ఈ బ్రిడ్జి బ్రిటీష్ కాలం నాటిది. ఈ తీగల వంతెనపైకి సెలవు రోజుల్లో అధికంగా పర్యాటకులు వస్తుంటారు. దీపావళి సెలవులకు తోడు ఆదివారం కూడా తోడు కావడంతో.. నిన్న అధిక సంఖ్యలో పర్యాటకులు తరలివచ్చారు.
అధిక బరువును మోయలేక తీగల వంతెన కుప్పకూలిపోయింది. కొన్నేండ్ల పాటు ఈ వంతెనపైకి పర్యాటకులను అనుమతించలేదు. 7 నెలల పాటు మరమ్మతులు చేసి.. ఈ నెల 26నే సందర్శకులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. అంతలోనే ఈ ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది.