ద‌ట్ట‌మైన పొగ‌మంచు ప్ర‌భావం.. 134 విమానాలు, 22 రైళ్లు ఆల‌స్యం

దేశ రాజ‌ధాని ఢిల్లీలో కురుస్తున్న‌ చాలా దట్టమైన పొగమంచు విమానాలు, రైళ్ల రాక‌పోక‌లు తీవ్ర ఆటంకం క‌లిగిస్తున్న‌ది

ద‌ట్ట‌మైన పొగ‌మంచు ప్ర‌భావం.. 134 విమానాలు, 22 రైళ్లు ఆల‌స్యం
  • వ‌రుసగా నాలుగో రోజూ స‌ర్వీసుల్లో అంత‌రాయం
  • 3 రోజులు గంటలపాటు దట్టమైన పొగమంచు
  • ఢిల్లీలో 50 మీటర్లకు పడిపోయిన విజిబులిటీ
  • భారత వాతావరణ శాఖ అంచనా వెల్ల‌డి


విధాత‌: దేశ రాజ‌ధాని ఢిల్లీలో కురుస్తున్న‌ చాలా దట్టమైన పొగమంచు విమానాలు, రైళ్ల రాక‌పోక‌లు తీవ్ర ఆటంకం క‌లిగిస్తున్న‌ది. వ‌రుసగా మూడు రోజు కూడా విమానాలు, రైళ్లు ఆల‌స్య‌గా న‌డుస్తున్నాయి. ఢిల్లీని దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో గురువారం ఉద‌యం 134 విమానాలు, 22 రైళ్లు ఆలస్యంగా నడిచాయి. మ‌రో మూడు రోజులు కొత్త సంవత్సరం ప్రారంభం వరకు అర్థరాత్రి, ఉదయం వేళ‌ల్లో గంటలపాటు “చాలా దట్టమైన పొగమంచు” ఉంటుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్‌లలో డిసెంబర్ 31 వరకు దట్టమైన పొగమంచు కమ్మే అవకాశం ఉన్న‌ద‌ని ఐఎండీ తెలిపింది.


ఢిల్లీ, ఉత్తర భారతదేశంలోని చాలా ప్రాంతాలను పొగమంచు దట్టంగా కప్పేసింది. పొగమంచు కారణంగా దాదాపు 134 దేశీయ, అంతర్జాతీయ విమానాలు ఆల‌స్యంగా న‌డిచాయి. ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం గేటు వద్ద వంద‌ల ప్రయాణికులు క్యూలో నిల్చున్నారు. 35 అంతర్జాతీయ విమానాల బయలుదేరు, 28 అంతర్జాతీయ రాకపోకలు విమానాశ్రయంలో ఆలస్యం అయ్యాయి. మరోవైపు, 43 డొమెస్టిక్ డిపార్చర్లు , 28 దేశీయ విమానాల రాకపోకలు ఆలస్యంగా న‌డిచాయి. ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో విజిబులిటీ తక్కువగా ఉండటంతో 22 రైళ్లు చాలా గంటలు ఆలస్యంగా నడిచాయి.


పాలంలో విజిబులిటీ 25 మీట‌ర్లే


ఉదయం 5.30 గంటలకు ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ అబ్జర్వేటరీ వద్ద విజిబులిటీ 50 మీటర్లకు పడిపోయింది. ఢిల్లీ విమానాశ్రయానికి సమీపంలోని పాలం వ‌ద్ద దృశ్య‌మాన‌త 25 మీటర్లకు ప‌డిపోయింది. పంజాబ్, హర్యానా, మధ్యప్రదేశ్, యూపీల్లో, దృశ్యమానత 50 నుంచి 25 మీటర్ల వరకు చేరింది. పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో జమ్ముక‌శ్మీర్, పశ్చిమ రాజస్థాన్‌, పశ్చిమ మధ్యప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో దట్టమైన నుంచి చాలా దట్టమైన పొగమంచు కురిసిన‌ట్టు ఐఎండీ వెల్ల‌డించింది.


యూపీలో పాఠశాలలకు సెలవులు


ఉత్తర భారతదేశం అంతటా విపరీతమైన చలి కొనసాగుతుండటంతో యూపీలోని పలు నగరాల్లోని పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ఉత్తరాది రాష్ట్రాల్లో నూతన సంవత్సర వేడుకల వరకు అర్థరాత్రి, ఉదయం గంటల వరకు “చాలా దట్టమైన పొగమంచు” ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రయాణికులు జాగ్రత్తగా ఉండాలని, పొగమంచులో లైట్లను ఉపయోగించాలని సూచించింది. ఢిల్లీలో క‌నిష్ఠ‌ ఉష్ణోగ్రత 6 డిగ్రీలు, గరిష్ఠ ఉష్ణోగ్ర‌త‌ 21 డిగ్రీలు వ‌ద్ద న‌మోదైంది.


ఢిల్లీలో వాయు కాలుష్యం ఘోరం


ఢిల్లీలో గురువారం గాలి నాణ్యత చాలా పేలవంగా న‌మోదైంది. ఢిల్లీలో సగటు ఏక్యూఐ 386కి చేరుకున్న‌ది. ఆనంద్ విహార్‌లో తీవ్రమైన క్యాట‌గిరీ 464 ఏక్యూఐ నమోదు చేసింది. కాలుష్య స్థాయి రాబోయే రెండు రోజులు కూడా పేలవంగా ఉంటుంద‌ని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ తెలిపింది. బుధవారం కూడా దట్టమైన పొగమంచు కార‌ణంగా ఢిల్లీలో 110 విమానాలు, 25 రైళ్లు ఆలస్యంగా నడిచాయి. రహదారులపై పొగమంచు కమ్ముకోవడంతో ఉత్తరప్రదేశ్ అంతటా పలు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి.