PM MODI | ఒకే ఏడాది 15 దెబ్బలు.. మోదీ బీజేపీకి కలిసిరాని కాలం

PM MODI | ఢిల్లీ నగరపాలిక ఎన్నికల్లో పరాభవం అక్కడి నుంచి ఆ పార్టీకి అన్నీ నిరాశలే తాజాగా రాహుల్‌ విషయంలో ఓటమి అంతకు ముందే కర్ణాటక ఎన్నికల షాక్‌ పలు న్యాయ అంశాల్లోనూ ఝలక్‌లు విధాత, ప్రత్యేక ప్రతినిధి: అధికార బీజేపీకి 2023 పెద్దగా కలిసొచ్చినట్టు లేదు. ఏడాది వ్యవధిలోనే దాదాపు 15 గట్టి దెబ్బలను మోదీ సర్కార్‌గానీ, బీజేపీగానీ ఎదుర్కొన్నాయి. అందులో తాజా పరిణామంగా రాహుల్‌ గాంధీ అనర్హత వేటు అంశం నిలిచింది. సొంత […]

  • Publish Date - August 8, 2023 / 02:49 AM IST

PM MODI |

  • ఢిల్లీ నగరపాలిక ఎన్నికల్లో పరాభవం
  • అక్కడి నుంచి ఆ పార్టీకి అన్నీ నిరాశలే
  • తాజాగా రాహుల్‌ విషయంలో ఓటమి
  • అంతకు ముందే కర్ణాటక ఎన్నికల షాక్‌
  • పలు న్యాయ అంశాల్లోనూ ఝలక్‌లు

విధాత, ప్రత్యేక ప్రతినిధి: అధికార బీజేపీకి 2023 పెద్దగా కలిసొచ్చినట్టు లేదు. ఏడాది వ్యవధిలోనే దాదాపు 15 గట్టి దెబ్బలను మోదీ సర్కార్‌గానీ, బీజేపీగానీ ఎదుర్కొన్నాయి. అందులో తాజా పరిణామంగా రాహుల్‌ గాంధీ అనర్హత వేటు అంశం నిలిచింది. సొంత ప్రభుత్వం ఉన్న గుజరాత్‌లో దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థించినా.. సుప్రీం కోర్టు మాత్రం శిక్షపై స్టే విధించడం బీజేపీ అధినాయకత్వానికి జీర్ణం కాని అంశంలా మారింది. ఒక విధంగా కర్ణాటక ఎన్నికల్లో ఓటమి కంటే.. రాహుల్‌ లోక్‌సభ సభ్యత్వ పునరుద్ధరణే బీజేపీకి గట్టి దెబ్బ అని విశ్లేషకులు అంటున్నారు.

2014, 2019 పార్లమెంట్ ఎన్నికల్లో పూర్తి మెజార్టీతో అధికారంలోకి వచ్చిన బీజేపీ.. ప్రత్యేకించి రెండో దఫాలో తన అసలు రూపం ప్రదర్శించడం మొదలు పెట్టిందన్న విమర్శలు ఉన్నాయి. బీజేపీ అనుసరించిన ఆర్థిక, రాజకీయ, అరాచక విధానాలు.. ఆ పార్టీని ప్రజల నుంచి క్రమంగా దూరం చేస్తున్నాయని పలువురు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ దశలో తాను ఆశించినట్టు కాకుండా.. అనేక విషయాల్లో బీజేపీకి చుక్కెదురవడం ఆసక్తికర పరిణామంగా చర్చల్లో నిలిచింది.

ఈ పరిణామం బీజేపీ అధినాయకత్వాన్ని అయోమయంలోకి నెట్టిందని అంటున్నారు. మోదీ రెండో దఫా అధికారాన్ని మరికొన్ని నెలల్లోనే పూర్తి చేసుకోనున్నారు. ఈలోపే ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. అందులో ఎన్ని ఎదురుదెబ్బలు తగులుతాయోనన్న చర్చ కూడా నడుస్తున్నది. అదెలా ఉన్నప్పటికీ.. ఇప్పటి వరకూ మోదీ సర్కారుకు, బీజేపీకి ఎదురైన ఎదురుదెబ్బలను పరిశీలిస్తే..

ఏడాది మొదట్లోనే ఢిల్లీ నగరపాలిక ఎన్నికల షాక్‌

2023 ప్రారంభంలోనే ఢిల్లీ నగర పాలిక ఎన్నికలు జరిగాయి. 19 ఏళ్ళుగా ఢిల్లీ నగరపాలికపై బీజేపీ అధికారం చెలాయిస్తున్నది. ఉత్తర ఢిల్లీ, దక్షిణ ఢిల్లీ, పశ్చిమ ఢిల్లీగా ఉన్న మూడు నగరపాలికలను ఒకటి చేసి.. ఒకే మేయర్‌ పదవిని 2022 మేలో కేంద్రం నోటిఫై చేసింది.

తద్వారా ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి సమాన స్థాయిలో మేయర్‌ పదవిని తీసుకొచ్చి, సమాంతర ప్రభుత్వాన్ని నడపాలని ప్లాన్‌ చేసింది. అయితే.. ఈ ఏడాది మొదట్లో నిర్వహించిన ఢిల్లీ నగరపాలిక ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ విజయభేరి మోగించింది. 134 సీట్లు గెలిచి బీజేపీకి సవాలు విసిరింది. అంతేకాదు మేయర్‌ స్థానాన్ని సైతం చేజిక్కించుకుని బీజేపీకి నిరాశ మిగిల్చింది.

రెండో షాక్‌ హిమాచల్‌లో

2023లోనే రెండో దెబ్బ హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల రూపంలో బీజేపీకి తగిలింది. ఆ ఎన్నికల్లో సర్వ శక్తులను ధారబోసి, మళ్లీ గెలిచేందుకు బీజేపీ శతవిధాల ప్రయత్నించింది. ప్రచారంలోకి మోదీని దింపినా ఫలితం లేకపోయింది.

ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పూర్తి మెజార్టీతో అధికారంలోకి వచ్చి బీజేపీ ప్రయత్నాలను తిప్పికొట్టింది. అదే బీజేపీ 2017లో అక్కడ జరిగిన ఎన్నికల్లో అధికారం చేపట్టింది. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్‌ 40 సీట్ల ఆధిక్యంతో విజయం సాధించింది. బీజేపీ 25 సీట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

కోలుకోలేని దెబ్బతీసిన కర్ణాటక ఎన్నికలు

2023లో కర్ణాటక శాసన సభ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలు రాబోయే పార్లమెంట్‌ ఎన్నికలకు ట్రయల్గా దేశవ్యాప్తంగా ప్రచారమయింది. బీజేపీ స్టార్‌ ప్రచారకుడు మోదీ కర్ణాటక ఎన్నికల సమయంలో గల్లీ నాయకుడిగా మారిపోయి.. దాదాపు రాష్ట్రంలో మకాం పెట్టేసినంత పని చేశారు. ఎన్నికలకు ముందు కూడా తరచూ కర్ణాటకలో పర్యటించారు. ఎన్నికల సమయంలో ఏకంగా 8 బహిరంగ సభల్లో మాట్లాడారు. సుదీర్ఘ రోడ్‌షోలు నిర్వహించారు.

ఈ క్రమంలో మోదీ అనేక వాగ్దానాలు గుప్పించారు. ఓ ర‌కంగా క‌ర్ణాట‌కలో గెలుపు తమదే అని ప్ర‌గ‌ల్భాలు పలికారు. ఎన్నిక‌ల ఫ‌లితాలు మాత్రం బీజేపీకి పూర్తి సిగ్గుచేటుగా వ‌చ్చాయి. కాంగ్రెస్‌కు పూర్తి ఆధిక్యం కట్టబెట్టిన కర్ణాటక ప్రజలు.. తమ రాష్ట్రంలో బీజేపీ విద్వేష రాజకీయాలు నడవబోవని హెచ్చరిక జారీ చేశారు. ఎన్నికలకు ముందు బీజేపీ సహజంగా విద్వేషాలు రెచ్చగొడుతుందనే అభిప్రాయం బలంగా ఉన్నది. ఈ క్రమంలోనే హలాల్‌, హిజాబ్‌ అంశాలను బీజేపీ నాయకులు లేవనెత్తారు. వీటిని గమనించిన జనం.. బీజేపీని ఓడించారు.

న్యాయ పరంగానూ ఎదురుదెబ్బలే

రాజ‌కీయ విష‌యాలే కాకుండా అనేక అంశాల్లో సుప్రీం కోర్టులోకూడా బీజేపీకి ఇబ్బందికర తీర్పులు వచ్చాయి. మార్చి 2023లో ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ల నియామ‌కంపై సుప్రీం తీర్పు బీజేపీ స్వభావాన్ని ఎండగట్టేలా వెలువ‌డింది. ఆ తీర్పు ప్ర‌కారం ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ల నియామ‌క ప్యానెల్‌లో ప్ర‌ధాన‌మంత్రి తోపాటు పార్ల‌మెంట్ ప్ర‌తిప‌క్ష‌ నాయ‌కుడు, సుప్రీం ప్ర‌ధాన న్యాయ‌మూర్తి కూడా ఉండాలి. అన్నీ ఏక పక్షంగా సాగాలనుకునే బీజేపీ ధోరణికి ఇది రుచించని పరిణామం అని పలువురు విశ్లేషకులు అప్పట్లోనే వ్యాఖ్యానించారు.

2023 మేలో ఢిల్లీ ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల నియామకాలు, బ‌దిలీల విషయంలో కేంద్ర ప్రభుత్వానికి, ఢిల్లీ సర్కారుకు మధ్య వివాదం రేగింది. అధికారంలో ఆప్‌ ఉన్నా.. ఢిల్లీపై అజమాయషీ తమదే ఉండాలని భావించిన కేంద్రం.. ఒక ఆర్డినెన్స్‌ తెచ్చింది. అయితే.. న్యాయపోరాటంలో కేంద్రంపై ఆప్‌ గెలిచింది. సర్వీసెస్‌ అధికారుల నియామకాలు, బదిలీల్లో రాష్ట్ర ప్రభుత్వానిదే అధికారమని సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెలువరించడం బీజేపీకి పరాభవాన్ని మిగిల్చింది. అయితే.. సుప్రీం కోర్టు తీర్పును సైతం లెక్క చేయకుండా దానిని పక్కన పెట్టేస్తూ కేంద్రం మళ్లీ ఆర్డినెన్స్‌ తీసుకొచ్చింది. దానిని మంగళవారం మందబలంతో పార్లమెంటు ఉభయసభల్లో ఆమోదింప జేసుకున్నది.

మోదీ ప్రభుత్వంలో ఈడీ పనితీరు తీవ్ర విమర్శలకు దారి తీసిన విషయం తెలిసిందే. రాజకీయంగా కక్ష సాధించేందుకు ఈడీని బీజేపీ ప్రభుత్వం సాధనంగా ఎంచుకున్నదనేందుకు అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే మరోసారి ఈడీ డైరెక్టర్‌ సంజ‌య్ మిశ్రా పదవీ కాలాన్ని పొడిగించుకునేందుకు కేంద్రం సుప్రీం కోర్టు అనుమ‌తి పొంద‌డానికి ప్రయత్నించింది. కానీ సుప్రీం కోర్టు ఆ ప్రయత్నాన్ని తిప్పికొట్టింది. ప్ర‌భుత్వం చేసిన విన్న‌పాల‌ను తీవ్రంగా పరిగణిస్తూ.. చివ‌ర‌కు సెప్టెంబ‌ర్ 15వ తేదీకి పరిమితం చేసింది. ఇకపై గడువు పొడిగించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. ఇందులో కూడా బీజేపీ పాచిక పార‌లేదు.

రాహుల్‌ కేసులో ‘ఓడిన బీజేపీ’

ఆ త‌రువాత మార్చి నెల‌లో సూర‌త్ కోర్టు రాహుల్ గాంధీపై అన‌ర్హ‌త వేటుతో పాటు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. గుజ‌రాత్ హైకోర్టు కూడా ఈ శిక్ష‌ను స‌మ‌ర్థిస్తూ తీర్పునిచ్చింది. ఈ కేసుపై కాంగ్రెస్ సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో హైకోర్టు తీర్పుపై స్టే వెలువడింది. దాంతో రాహుల్పై అనర్హతను తొలగించి.. ఆయన లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించాల్సి వచ్చింది. విజయహాసంతో మంగళవారం రాహుల్‌గాంధీ పార్లమెంటుకు రావడం బీజేపీకి గట్టి ఓటమిగా విశ్లేషకులు పేర్కొంటున్నారు.

మరిన్ని విషయాల్లోనూ ఎదురుగాలే

ఇవే కాకుండా దేశ‌వ్యాప్తంగా బీజేపీకి ఇంకొన్ని విష‌యాల్లోనూ ఎదురు గాలి వీస్తున్నది. ఇటీవ‌లే చోటుచేసుకున్న బాలాసోర్ రైలు దుర్ఘ‌ట‌న దేశ చ‌రిత్ర‌లోనే అత్యంత భయంకరమైనది. ఈ ప్ర‌మాదంలో దాదాపు 300 మ‌ర‌ణించ‌గా 1000 మందికి పైగా గాయ‌ప‌డ్డారు. ఈ ఘటన విషయంలో ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నది.

బీజేపీకి మణిపూర్‌ మంట

గ‌త నాలుగు నెల‌ల‌కు పైగా మ‌ణిపూర్‌ మండిపోతున్నది. అక్కడ అల్లర్లను అదుపు చేయడంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం విఫలమైంది. ఒక విధంగా ప్రభుత్వ యంత్రాంగం సైతం అల్లర్లకు ఆజ్యం పోశారన్న విమర్శలు ఉన్నాయి. ఈ ఘర్షణల్లో ఇప్పటి వరకూ దాదాపు 200 మంది చ‌నిపోగా 70వేల మంది నిరాశ్ర‌యులయ్యారు. దేశ‌మంతా మ‌ణిపూర్‌లో శాంతికొర‌కు ఎదురు చూస్తున్నది.

కానీ రాష్ట్ర, కేంద్ర బీజేపీ ప్ర‌భుత్వాలు అనుస‌రిస్తున్న విధానాలు శాంతిని నెల‌కొల్పే విధంగా కాకుండా హింస‌ను ప్రేరేపిస్తున్నట్లు ఉన్నాయి. దీనిపై మోదీ పార్లమెంటు బయట నాలుగు ముక్కలు మాట్లాడటం తప్పించి సభలో మాట్లాడేందుకు ఇష్టపడటం లేదు. బయట మాట్లాడింది కూడా సుప్రీం కోర్టు జోక్యం చేసుకున్న తర్వాతే.

మణిపూర్‌ విషయంలో కేంద్ర ప్రభుత్వ నిష్క్రియాపరత్వాన్ని సుప్రీం కోర్టు సైతం ప్రశ్నించింది. ప్ర‌భుత్వం ఏమీ చేయ‌లేని ప‌రిస్థితే ఉంటే కోర్టే ప్ర‌త్యేకంగా క‌ల్పించుకోవాల్సి ఉంటుంద‌ని మొట్టికాయ‌లు వేసింది. ఘర్షణలు మణిపూర్‌కు సంబంధించిన అంశమే అయినప్పటికీ.. రానున్న ఎన్నికల్లో తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం కనిపిస్తున్నది.

తాజాగా హర్యానాలో చిచ్చు

ఇదిలా ఉండ‌గానే హర్యానాలో కూడా ప‌లు హింసాత్మక ఘటనలు పెల్లుబికాయి. దాదాపు 9 జిల్లాల్లో హింస చెలరేగింది. ఇప్ప‌టికే ఈ ఘ‌ట‌న‌ల్లో ఆరుగురు చనిపోగా.. కోట్ల రూపాయల విలువైన ఆస్తి న‌ష్టం జరిగింది. హింస మ‌రింత వ్యాపిస్తున్నది. ప్ర‌భుత్వం క‌ర్ఫ్యూ విధించింది. మ‌రోవైపు హింస‌కు మూల కార‌కులు అనే నెపం మోపి.. ఆక్రమణ ముసుగులో అనేకమందికి చెందిన ఇళ్లను, హోటళ్లను, షాపింగ్‌ మాల్స్‌ను ప్రభుత్వం బుల్డోజర్‌లతో కూల్చివేసే ప్రక్రియకు దిగింది.

దీంతో భ‌య‌భ్రాంతులకు గురైన ప్ర‌జ‌లు ప్రాణాల‌ను అర‌చేతిలో ప‌ట్ట‌కొని వ‌ల‌స పోతున్న దుస్థితి నెలకొన్నది. దేశ‌ రాజ‌ధానికి అత్యంత స‌మీపంలో జ‌రుగుతున్న ఈ హింసకాండ, మ‌రో వైపు మ‌ణిపూర్ ఘర్షణలు దేశ ప్రజల దృష్టిని ఆక‌ర్షించి, బీజేపీపై అసంతృప్తిని పెంచుతున్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

బీహార్‌లో కుల జనగణనకు హైకోర్టు అనుమతి

కులాల వారీగా జ‌నాభా లెక్క‌లు తీయాలనే చర్చ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తునే నడిచింది. అయితే.. బీజేపీ మాత్రం దీనిని వ్యతిరేకించింది. బీహార్‌ ప్రభుత్వం కుల జనగణనకు సిద్ధపడితే ఆటంకాలు ఎదురైనా.. ఆఖరుకు అక్కడి జేడీయూ-ఆర్జేడీ ప్రభుత్వం న్యాయపోరాటంలో విజయం సాధించడం బీజేపీకి సవాలు విసిరినట్టయింది. కుల జనగణన కేంద్రం చేయాల్సిందని పిటిషన్లు పడినా.. హైకోర్టు ఆ వాదనను నిరాకరించడం బీజేపీకి చెంపపెట్టేనన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

ఇండియా కూటమితో కొత్త సవాల్‌

మే నెల‌లో బెంగ‌ళూరులో సమావేశమైన భావసారూప్యం కలిగిన ప్రతిపక్ష పార్టీలు ఇండియా కూటమిగా ఏర్పడ్డాయి. ఇది బీజేపీకి గట్టిసవాలుగా మారింది. బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక, కక్షసాధింపు చర్యలను ఏకకంఠంతో ఇండియా కూటమి నిలదీస్తున్నది. ఈ క్రమంలోనే పార్లమెంటులో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. తీర్మానం వీగిపోయినా.. మోదీ మణిపూర్‌ అంశంలో నోరువిప్పాల్సిన అగత్యాన్ని సృష్టించడంలో ప్రతిపక్షాలు విజయం సాధించినట్టే.

అంతకు ముందు వన్‌ మ్యాన్‌ షోలా పార్లమెంటు కొత్త భవంతిని ప్రారంభించేందుకు మోదీ సిద్ధపడితే.. ప్రతిపక్షాలు గట్టిగా వ్యతిరేకించాయి. రాజ్యాంగాధిపతి లేకుండా చట్టసభ ప్రారంభోత్సవం ఏమిటని నిలదీస్తూ.. ఆ కార్యక్రమాన్ని ఉమ్మడిగా కలిసి బహిష్కరించాయి. ఈ అన్ని అంశాల్లో జరిగే చర్చలు.. ప్రజాభిప్రాయాన్ని బీజేపీకి వ్యతిరేకంగా మలచడంలో కీలక భూమికను పోషించనున్నాయనేది మాత్రం వాస్తవంగా కనిపిస్తున్నది.