విధాత, హైదరాబాద్ : సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటనతో భారత దేశవ్యాప్తంగా శనివారం నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. జూన్ 6వ తేదీ వరకు ఎన్నికల కోడ్ అమలులో ఉండనుంది. ఎన్నికల విధులకు వాలంటీర్లు, కాంట్రాక్టు ఉద్యోగులు దూరంగా ఉండాలని ఈసీ పేర్కొంది. టీవీ యాడ్స్ ఇష్టానుసారంగా వేయకూడదు. అలాగే పేపర్ యాడ్స్ కూడా నిబంధనలకు లోబడి ఉండాలి. రాజకీయ నేతల పోస్టర్లు, కటౌట్లు తొలగించాలి. టీవీ, సోషల్ మీడియా ప్రకటనలపై నిరంతర నిఘా, ఆడిట్ కొనసాగనుంది.
పొలిటికల్ హోర్డింగులు, పోస్టర్లు, గోడరాతలు తొలగించాలని అలాగే బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, రోడ్లు, బస్సులు, విద్యుత్ స్థంభాల పైన ప్రకటనలు తొలగించాలి. ప్రజాధనంతో పత్రికలు, టీవీల్లో ఇచ్చే ప్రభుత్వ పథకాల ప్రకటనలు నిలిపివేయాలి. అన్ని ప్రభుత్వ వెబ్ సైట్ల నుంచి సీఎం ఫోటోలను తొలగించాలి. ప్రభుత్వ గెస్ట్ హౌసుల నుంచి మంత్రులు, ప్రజా ప్రతినిధుల్ని ఖాళీ చేయించాలి. మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులకు పైలట్ కార్లు, సైరన్ వినియోగించకూడదు.
మంత్రులు ఎలాంటి నిధుల విడుదల చేయరాదు. ఎలాంటి శంఖుస్థాపనలు చేయరాదు. మౌలిక సదుపాయాల కల్పనపై ఎలాంటి హామీలు ఇవ్వరాదు. ఎలాంటి గ్రాంట్స్ ఇవ్వరాదు. స్వతంత్ర ఉద్యోగ నియామకాలు చేయరాదు. ప్రజాధనంతో ప్రకటనలు ఇవ్వరాదు. మంత్రుల అధికారిక పర్యటనలు ఎన్నికల ప్రచారం కిందకు వస్తాయి. ప్రభుత్వ వాహనాలు ప్రచారానికి వినియోగించరాదు. సభా మైదానాలు, హెలిప్యాడ్స్ అన్ని రాజకీయ పక్షాలకు అందుబాటులో ఉంచాలి. రహదారి బంగ్లాలు, ప్రభుత్వ క్వార్టర్స్ ఎన్నికల ప్రచారానికి వాడరాదు.
17వ లోక్‌సభ గడువు జూన్ 16వ తేదీతో ముగియనున్నది. అయితే 18లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఏడు దశల పోలింగ్ ప్రక్రియలోని ఓట్ల లెక్కింపు జూన్ 4వ తేదీనే నిర్వహించి ఫలితాలు వెలువడనుండటంతో, గడువులోగానే కొత్త లోక్‌సభ కొలువు తీరనుంది.