తమిళనాడులో భారీ వర్షాలకు 10 మంది మృతి
తమిళనాడులో కురిసిన కుండపోత వానలకు పది మంది మృత్యువాతపడ్డారు. వరద ముంపు ప్రాంతాల నుంచి 17 వేల మందిని 160 రిలీఫ్ క్యాంపుల్లోకి తరలించారు

- 160 రిలీఫ్ క్యాంపుల్లో 17 వేల మంది నిరాశ్రయులు
- ఇంకా వరద ముంపులోనే మరో 20 వేల మంది
- 47 ఏండ్లలో చూడని విధంగా కుండపోత వర్షం
విధాత: తమిళనాడులో రెండురోజులపాటు కురిసిన కుండపోత వానలకు పది మంది మృత్యువాతపడ్డారు. వరద ముంపు ప్రాంతాల నుంచి 17 వేల మందిని 160 రిలీఫ్ క్యాంపుల్లోకి తరలించారు. వివిధ ప్రాంతాల్లో ఇంకా 20,000 మంది ప్రజలు చిక్కుకుపోయారు. పొంగిపొర్లుతున్నతామరబరాణి నది నుంచి 1.2 లక్షల క్యూసెక్కులకుపైగా నీటిని విడుదల చేయడంతో పరిస్థితి మరింత దిగజారింది.
సాధారణ జనజీవనం ఇప్పటికీ అస్తవ్యస్తంగా ఉన్నదని, ఇంకా వరద ముంపు నుంచి ప్రజలు తేరుకోలేదని తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శివదాస్ మీనా మంగళవారం వెల్లడించారు. తిరునెల్వేలి, టుటికోరిన్ జిల్లాల్లో వర్షాల కారణంగా 10 మంది చనిపోయారని సచివాలయంలో సీఎస్ మీడియాకు తెలిపారు. గోడ కూలి కొందరు, విద్యుదాఘాతంతో మరి కొందరు మరణించారని పేర్కొన్నారు.
తమిళనాడులో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు ఐఎండీ అంచనా వేయగా, టుటికోరిన్ జిల్లాలోని ఒక మున్సిపాలిటీలో రెండు రోజుల్లోనే 115 సెం.మీ వర్షపాతం నమోదైనట్టు సీఎస్ తెలిపారు. “30 గంటల్లో కాయల్‌పట్టినంలో 1,186 మిల్లీమీటర్ల వర్షపాతం, తిరుచెందూర్‌లో 921 మి.మీ వర్షపాతం నమోదైంది. టుటికోరిన్‌లో చాలా ప్రాంతాలు, తామరబరాణి నది ఒడ్డున ఉన్న గ్రామాలు వరదల కారణంగా దెబ్బతిన్నాయి” అని ఆయన చెప్పారు.
ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డీఆర్‌ఎఫ్), స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్‌తో సహా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీలకు చెందిన దాదాపు 1,343 మంది సిబ్బంది రెస్క్యూ, రిలీఫ్ ఆపరేషన్‌లో పాల్గొన్నారని ఆయన చెప్పారు. ఇప్పటి వరకు 160 రిలీఫ్ క్యాంపులను ఏర్పాటు చేశామని, దాదాపు 17 వేల మందిని వాటిల్లో ఉంచామని తెలిపారు. దాదాపు 34 వేల ఫుడ్ ప్యాకెట్లను ప్రజలకు సరఫరా చేశామని తెలిపారు. ఇప్పటికి కూడా నీటి మట్టం తగ్గకపోవడంతో కొన్ని గ్రామాలకు చేరుకోలేకపోతున్నామని ఆయన చెప్పారు.
తొమ్మిది హెలికాప్టర్లు సహాయక చర్యల్లో పాల్గొన్నాయని, వాటి ద్వారా 13,500 కిలోల ఆహారాన్ని ఒంటరిగా ఉన్న బాధితులకు సరఫరా చేసినట్టు సీఎస్ తెలిపారు. బాధిత ప్రజలకు నిత్యావసరాల సరఫరాకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని, తిరునెల్వేలిలో 64,900 లీటర్లు, టుటికోరిన్‌లో 30,000 లీటర్లు పాలను సరఫరా చేశామని వివరించారు.
ఒకటి లేదా రెండు రోజుల్లో టుటికోరిన్‌లో పూర్తిగా పాల పునరుద్ధరణ జరుగుతుందని తాము భావిస్తున్నట్టు తెలిపారు. కన్యాకుమారి, తెన్కాసి జిల్లాలలో విద్యుత్ సరఫరా వ్యవస్థ పూర్తిగా పునరుద్ధరించినట్టు సీఎస్ వెల్లడించారు. తిరునెల్వేలి, టుటికోరిన్‌లలో చాలా చోట్ల ఇంకా పూర్తి స్థాయిలో విద్యుత్ సరఫరా జరగలేదని తెలిపారు.
చెన్నై, దాని పరిసర ప్రాంతాలు, మైచాంగ్ తుఫాను విధ్వంసం నుంచి ఇప్పటికీ కోలుకోలేకపోతున్నాయి. గత 47 సంవత్సరాలలో చూడని విధంగా కుండపోత వర్షంతో కొట్టుమిట్టాడుతున్నాయి. తుఫాన్‌తోపాటు తాజా కురిసిన కుండపోత వానలు తమిళ ప్రజలకు తీవ్ర నష్టాన్ని కలిగించారు. తక్షణ సహాయం కోసం తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కేంద్ర ప్రభుత్వానికి సాయాన్ని కోరారు.