నాగర్ కర్నూల్ టికెట్ రేసులో 26 మంది
నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు నేతలు భారీ సంఖ్య లో దరఖాస్తు చేసేకున్నారు.

- ఎస్సీ రిజర్వు స్థానంలోనూ భారీ డిమాండ్
- మల్లు రవి.. సంపత్ మధ్య టికెట్ పంచాయతీ
- టికెట్ కోసం అధిష్టానంపై ఇద్దరి ఒత్తిడి
- బీజేపీ నుంచి వినిపిస్తున్న బంగారు శృతి పేరు
- బీఆరెస్‌లో టికెట్ ఊసెత్తని నేతలు
- టికెట్ వద్దని అధిష్టానం వద్ద మొహం చాటేస్తున్న బీఆరెస్ నేతలు
- ఐదు అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు..
- రెండు సెగ్మెంట్లలో ఇద్దరు బీఆరెస్ ఎమ్మెల్యేలు
విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి : నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు నేతలు భారీ సంఖ్య లో దరఖాస్తు చేసేకున్నారు. ఈ స్థానం షెడ్యూల్ కులాలకు కేటాయించడంతో ఆ వర్గం నేతలు టికెట్ కోసం 26 మంది దరఖాస్తు చేసుకున్నారు. టికెట్ కావాలని కోరుకుంటున్న వారిలో ప్రముఖంగా మాజీ ఎంపీ మల్లు రవి, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, మాజీ ఎంపీ మంద జగన్నాథం, మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్ కూతూరు చంద్రప్రియలు ఉన్నారు.
ఇందులో మల్లు రవి, సంపత్ కుమార్ పేర్లు మాత్రమే అధిష్టానం లెక్కల్లోకి తీసుకున్నట్లు తెలిసింది. ఇటీవల మల్లు రవి ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి గా నియమించడం తో ఎంపీ టికెట్ తనకే ఇవ్వాలని సంపత్ పట్టుబడుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అలంపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి చెందానని, ఇది దృష్టిలో పెట్టుకుని నాగర్ కర్నూల్ ఎంపీ స్థానం నుంచి పోటీలో ఉండేందుకు అవకాశం ఇవ్వాలని కొందరు ఏఐసీసీ నేతలవద్ద తన గోడు చెప్పుకున్నారు.
ప్రస్తుతం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సభ్యునిగా ఉండి పార్టీకి ఎన్నో సేవాలందించానని, ఎంపీ టికెట్ అవకాశం ఇవ్వాలని సంపత్ కుమార్ కోరుతున్నారు. అటు మల్లు రవి కూడా ఎంపీ టికెట్ వదులుకునే ప్రసక్తే లేదని ఏఐసీసీని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల తనకు వచ్చిన పదవి ఎంపీ స్థానంలో పోటీ చేసేందుకు అడ్డురాదని, ఎంతో సీనియర్ నేతను అయినా తనను కాదని ఇతరులకు టికెట్ ఎలా ఇస్తారని మల్లు అంటున్నారు.
ఎంపీ స్థానంలో పోటీ చేయాలనే ఉద్దెశంతో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదని, పార్టీ నిలబెట్టిన అభ్యర్థులకు మద్దతుగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారం చేసి వారి విజయానికి తోడ్పాటు అందించానని ఆయన అంటున్నారు. అందుకే పార్లమెంట్ స్థానంలో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని, అధిష్టానం తనకే టికెట్ ఇస్తున్నదనే ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఈసారి మాకే అవకాశమివ్వాలి
ఇలా ఉంటే నాగర్ కర్నూల్ టికెట్ కోసం దరఖాస్తు చేసిన మిగతా 24 మంది మాత్రం ఎప్పుడు మల్లు రవి, సంపత్‌లే పోటీ లో ఉంటారా.. ఈ ఎన్నికల్లో కొత్త వారికి టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంకెంత కాలం పార్టీ జెండా మోయాలని, మాకు పదవుల్లో ఉండొద్దా అంటూ వారు కాంగ్రెస్ అధిష్టానం ను నిలదీస్తున్నారు. మేమంతా కష్ట పడినందుకే అసెంబ్లీ ఎన్నికల్లో నాగర్ కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్, వనపర్తి నియోజకవరర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లు విజయం పొందారని, అందుకే పార్టీ కోసం పని చేసిన వారికి టికెట్ ఇవ్వాలని కొత్తగా దరఖాస్తు చేసుకున్న నేతలు డిమాండ్ చేస్తున్నారు.
కానీ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మాత్రం మల్లు రవి కే టికెట్ ఇవ్వాలనే ప్రతిపాదన ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ లో సీనియర్ నేత, వివాదరహితుడు, నేతలందరిని కలుపుకొని పోయే మనస్తత్వం ఉన్న వ్యక్తి గా పేరు పొందిన మల్లు రవి పైనే కాంగ్రెస్ అధినేతల దృష్టి ఉంది. ఈ సెగ్మెంట్ లో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండడం, అందులో ఐదింటిలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉండడంతో ఇక్కడ ఎంపీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి విజయం ఖాయమనే సాంకేతాలు ఉండడం కూడా టికెట్ కోసం పోటీ పడే నేతల సంఖ్య పెరిగింది.
బీజేపీ అభ్యర్థిగా బంగారు శృతి ?
నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానంలో బీజేపీ నుంచి పోటీ చేసేందుకు పెద్దగా డిమాండ్ లేకపోవడంతో ఆ పార్టీ సీనియర్ నాయకురాలు బంగారు శృతి పేరు ఎక్కువగా వినపడుతోంది. దివంగత మాజీ కేంద్ర మంత్రి బంగారు లక్ష్మణ్ కూతురే శృతి. ప్రస్తుతం ఈ పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి బీజేపీ తరపున ఆమె పోటీలో ఉంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి. గతం లో ఈ స్థానంలో ఆమె ఎంపీ అభ్యర్థి గా పోటీ చేసి ఓటమి చెందారు. మళ్ళీ ఒకసారి బీజేపీ అవకాశం ఇవ్వడం, ఆమె కూడా పోటీ చేయడానికి ఆసక్తి చూపడం తో బీజేపీ నుంచి ఇతరులు ఎవ్వరూ టికెట్ ఆశించడం లేదు.
ఈ పార్లమెంట్ నియోజకవర్గం లో కల్వకుర్తి, గద్వాల సెంగ్మెంట్‌లలో బీజేపీకి బలమైన నాయకత్వం ఉంది. కల్వకుర్తిలో బీజేపీ సీనియర్ నేత ఆచారి, గద్వాలలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఉండడంతో ఈ నియోజకవర్గాల్లో బీజేపీకి బలం ఉందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించారని, పార్లమెంట్ ఎన్నికల్లో మోడీ కోసం బీజేపీని అందరిస్తారని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు.
టికెట్ కోసం మొహం చాటేస్తున్న గులాబీ నేతలు
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దెబ్బకు కకావికాలం చెందిన బీఆరెస్ ఇప్పటికీ కోలుకోలేదు. పోయిన పరువును పార్లమెంట్ ఎన్నికల్లో దక్కించుకేనేందుకు అధిష్టానం నానా తంటాలు పడుతుంటే నియోజకవర్గాల్లో నేతలు సహకరించడం లేదు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపొందాలని ఉవ్విళ్ళు ఊరుతున్న ఆ పార్టీ అధిష్టానం కు నేతలు ఝలక్ ఇస్తున్నారు. టికెట్ ఇస్తామని అంటున్నా మాకొద్దు బాబోయ్ అంటూ నేతలు మొహం చాటేస్తున్నారు.
మహబూబ్ నగర్ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఇదే పరిస్థితి ఉందనుకుంటే నాగర్ కర్నూల్ సెగ్మెంట్ లో కూడా అదే పరిస్థితి నెలకొంది. నాగర్ కర్నూల్ ఎంపీ స్థానంలో పోటీ చేసేందుకు గులాబీ పార్టీ లీడర్లు ముందుకు రావడం లేదు. సిట్టింగ్ ఎంపీ రాములు సైతం ఆసక్తి చూపడం లేదనే వార్తలు వస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందిన అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ను ఇక్కడ పోటీలో ఉంచేందుకు గులాబీ బాస్ అనుకుంటున్నారని సమాచారం.
అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ లను మార్చి ఉంటే పరిస్థితి ఇలా వచ్చేది కాదని చాలా సందర్బాల్లో కేటీఆర్ అనడం చూస్తే పార్లమెంట్ ఎన్నికల్లో సిట్టింగ్ లను మార్చే ఉద్ధేశంలో కేసీఆర్‌ర్ ఉన్నట్లు తెలిసింది. అందులో భాగంగానే నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్ లో సిట్టింగ్ లను మార్చాలని కెసిఆర్ చూస్తున్నారు. కానీ ఈ రెండు స్థానాల్లో కొత్తవారు పోటీ చేసేందుకు ఆసక్తి చూపడం లేదు ఇక్కడ కూడా గువ్వల బాలరాజు కూడా పోటీ చేసేందుకు ఇష్టం లేదనే అభిప్రాయంలో ఉన్నట్లు సమాచారం.
ఒకప్పుడు టికెట్ కోసం కేసీఆర్ ముందు క్యూ కట్టిన నేతలు ప్రస్తుతం టికెట్ ఇస్తామంటే మొహం చాటేస్తున్నారు. బీఆరెస్ పరిస్థితి ఒక్కసారిగా అందలం నుంచి పాతాళం లోకి పడిపోయింది. నాగర్ కర్నూల్ పార్లమెంట్ సెగ్మెంట్ లో గద్వాల, అలంపూర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆరెస్ ఎమ్మెల్యేలు ఉన్న ఎంపీ స్థానంలో పోటీ లో ఉంచేందుకు అభ్యర్థి కోసం వెతుకులాడే పరిస్థితి వచ్చిందంటున్నారు.