ప్రయాగ్‌రాజ్ మాఘమేళాలో మంటలు
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ జిల్లా మాగ్ మేళా ప్రాంతంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకున్నది.

- ముగ్గురికి తీవ్ర కాలిన గాయాలు
విధాత: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ జిల్లా మాగ్ మేళా ప్రాంతంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకున్నది. సెక్టార్ 5లో ఉన్న కిన్నార్ అఖారా క్యాంపులో మంటలు చెలరేగడంతో ముగ్గురికి తీవ్ర కాలిన గాయాలు అయ్యాయి. క్షతగాత్రులకు మేళా ప్రాంతంలో ఉన్న గంగా దవాఖానలో ప్రథమ చికిత్స అందించారు. అనంతరం స్వరూప్ రాణి నెహ్రూ దవాఖాన తరలించినట్టు మేళా అధికారి దయానంద్ ప్రసాద్ శుక్రవారం వెల్లడించారు.
అగ్నిమాపక శాఖ సిబ్బంది సుమారు గంటపాటు శ్రమించి మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చినట్టు అధికారి తెలిపారు. అయితే ఈ ఘటనలో చాలా వస్తువులు దెబ్బతిన్నాయి. కిన్నార్ అఖారాకు చెందిన రాధికా తివారీ మాట్లాడుతూ.. ఆహార పదార్థాలు, పరుపులు, బట్టలు తదితరాలన్నీ కాలిపోయాయి. అయితే, మంటలు చెలరేగడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు కేసు దర్యాప్తు జరుపుతున్నారు.