విధాత: సముద్ర తీరంలో సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లిన నలుగురు భారతీయులు నీటిలో మునిగిపోయారు. ముగ్గురు అక్కడికక్కడే చనిపోగా, నాలుగో వ్యక్తి దవాఖానలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ విషాద ఘటన ఆస్ట్రేలియాలోని విక్టోరియాలోని ఫిలిప్ ఐలాండ్ వద్ద గస్తీ లేని బీచ్‌లో బుధవారం చోటుచేసుకున్నది.
మృతుల్లో 20 ఏండ్ల పురుషుడు, ఇద్దరు మహిళలు, 40 ఏండ్ల మరో మహిళ ఉన్నట్టు స్థానిక మీడియా నివేదించింది. కాన్‌బెర్రాలోని భారత హైకమిషన్ ఈ విషయాన్ని మృతుల కుటంబాలకు తెలియజేసింది. మెల్‌బోర్న్‌లోని కాన్సులేట్ జనరల్ మృతుల స్నేహితులకు అందుబాటులో ఉన్నట్టు తెలిపింది.
“ఆస్ట్రేలియా విక్టోరియాలోని ఫిలిప్ ద్వీపంలో మునిగిపోయిన ఘటనలో నలుగురు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి. దౌత్యాధికారుల బృందం అవసరమైన సహాయం కోసం మరణించిన వారి స్నేహితులతో సంప్రదింపులు జరుపుతున్నది” అని రాయబార కార్యాలయం తెలిపింది. .
43 ఏండ్ల మృతురాలు భారత్ నుంచి ఆస్ట్రేలియాకు విహారయాత్రకు రాగా, మిగిలిన ముగ్గురు మెల్‌బోర్న్‌కు సమీపంలో నివసిస్తున్నారని విక్టోరియా పోలీసు అధికారి కరెన్ నైహోల్మ్ తెలిపారు. ఫిలిప్ ద్వీపం సముద్ర గుహలకు ప్రసిద్ధి. ఈత ప్రదేశాలు ఇక్కడ చాలా ప్రమాదకరంగా ఉంటాయి.